వైసీపీ కోసం సాక్షి తంటాలు..! అవిశ్వాసం తీర్మానం పెట్టించుకున్నది మోడీనేనట..!

Courtesy : Sakshi epaper

“నా మీద అసహ్యం చూపించు.. నన్ను మోసగాడిగా నిరూపించు… అన్నింటిలోనూ ఫెయిలయ్యామని నిరూపించు…నువ్వు బలపడు” అని ఏ వ్యక్తి కానీ.. రాజకీయ పార్టీ కానీ.. ప్రత్యర్థులకు ఆఫర్ ఇస్తారా..?. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరూ ఇవ్వరు. ఇప్పుడున్న రాజకీయాల్లో అందరూ స్మార్టే కానీ… తన మీద రాళ్లేయించుకునేంత ఓవర్ స్మార్ట్ ఎవరూ లేరు. కానీ మీడియాలో మాత్రం ఉన్నారని.. “సాక్షి” పత్రికను చూస్తే అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ కనుసైగతోనే తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టిందనే వార్తను బ్యానర్ వార్తగా సాక్షి పేపర్ రాసుకొచ్చింది. కానీ అందులో లాజిక్ కానీ..మ్యాజిక్ కానీ లేదు. ఉన్నదల్లా… ఎలాగోలా.. టీడీపీకి, బీజేపీకి సంబంధాలు అంటగట్టేయాలనే తాపత్రయమే.

“తీర్మానం వెనుక మోదీ సర్కార్ కనుసైగ” అన్న శీర్షికన సాగిన సాక్షి కథనంలో… జాతీయ స్థాయి అంశాలు చర్చకు రాకుండా చేసే వ్యూహం ఉందని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నోటిసిచ్చినంత మాత్రాన.. ఒక్క ఏపీ అంశాలే అందరూ మాట్లాడరు. ఇది అందిరికీ తెలుసు. నాలుగేళ్ల నరేంద్రమోడీ పాలనా వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడం, మతం పేరుతో కొట్టి చంపడం లాంటి అంశాలన్నీచర్చకు వస్తాయి. చర్చకు తెస్తారు. ఇవన్నీ చర్చకు వస్తే… రేపు .. టీడీపీని ఏ రాజకీయ పార్టీ పట్టింటుకోలేదు.. అన్నీ జాతీయ అంశాలే మాట్లాడారు.. అంటూ రాసుకొస్తారు. ప్రత్యేకహోదాపై కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టే ఎత్తుగడ అంటూ.. కొత్తగా.. ఆ పార్టీపై సానుభూతి చూపించింది సాక్షి. నిజానికి ఈ విషయంలో రెండు పార్టీలు తోడుదొంగలని.. తెలియనిది ఎవరికి..? ఇప్పుడేదో కొత్తగా ఆ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎలా జరుగుతుందో మరి..?

సంఖ్యాబలం దృష్ట్యా బీజేపీ అదుపాజ్ఞాల్లోనే సభ ఉంటుందని .. సాక్షి పత్రిక అదే కథనంలో మరో ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా… అధికారపార్టీ అదుపాజ్ఞల్లోనే సభ ఉంటుంది. ప్రతిపక్షాల చేతుల్లో ఉండదు. కానీ ఇదేదో.. టీడీపీ చేసిన తప్పిదమన్నట్లుగా.. బీజేపీ సాధించిన విజయమన్నట్లుగా చెప్పుకొచ్చారు. సీనియర్లను కాదని.. జూనియర్లతో చర్చ ప్రారంభింపచేస్తున్నారనేది.. సాక్షికి మరో డౌటానుమానం. గల్లా జయదేవ్ సామర్థ్యం ఏమిటో ఇప్పటికే ప్రపంచం మొత్తం చూసింది. అయినా దీన్ని కూడా… అదో బ్రహ్మపదార్థం అన్నట్లుగా సాక్షి ఫోకర్ చేయడానికి తంటాలు పడింది. ఎంత సేపు.. మేము 13 సార్లు నోటీసులిచ్చాము..కానీ స్పీకర్ యాక్సెప్ట్ చేయలేదు..,. అని ప్రతీ పేజీలోనూ బాక్స్ కట్టి వేసుకుంటే..పార్టీకి మైలేజ్‌కి వస్తుందా….?. పేపర్‌కి మేలు చేస్తుందా..?

ఎంపీల రాజీనామాల విషయంలో వైసీపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ ఆ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆ పార్టీ నేతలకు తెలియడం లేదు. ఆ పార్టీ విధానాలను మోయాల్సిన పత్రికగా సాక్షికి ఇది సంకట పరిస్థితినే తెచ్చి పెట్టింది. బీజేపీతో టీడీపీకి లింక్ పెట్టేయాలని ఎడిటోరియల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లున్నారు.. కానీ.. అది ఎంత తేడాగా ప్రజల్లోకి వెళ్తుందో ఊహించలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో జరిగింది జరిగినట్లు రాసుకున్న పాఠకులు కన్విన్స్ అవుతారు. కానీ తమ పార్టీ వాదన వినిపించడానికి… కరపత్రికలాగా.. పేపర్‌ను మార్చేస్తే… అది క్రెడిబులిటీకే దెబ్బపడుతుంది. సాక్షి పత్రికను చూసిన .. వైసీపీ కార్యకర్తలైనా.. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే.. వేరే పత్రిక కొనుగోలు చేయాల్సిందే. ప్రస్తుతం సాక్షి పత్రిక ఆ స్థితికి దిగజారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com