సాక్షి తెచ్చిన అనుమానం.. ! మోడీతో కుమ్మక్కయింది జగనేనా..?

Courtesy : Sakshi

రాముడికి సీతేమవుతారో… నిజ్జంగా సాక్షి పత్రికకు మాత్రం తెలియదు. లేకపోతే.. నిన్నటి బ్యానర్‌గా ఏమి అచ్చేసేమో కానీసం… తెలియనట్లుగా.. దానికి విరుద్ధంగా ఈ రోజు మరో వార్త వేస్తారా..?. నిన్నంతా మోడీ కన్నుసన్నల్లోనే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారు. ఒకరినొకరు విమర్శించుకోరు… జాతీయ రాజకీయాలపై టాపిక్ నెట్టేస్తారు.. అని “ఊహాత్మక” విశ్లేషణలతో కథనం అల్లి.. దానికి సపోర్ట్‌గా వైసీపీ నేత స్టేట్‌మెంట్లు అచ్చేసిన సాక్షి పత్రిక… తెల్లవారగానే.. పూర్తి రివర్స్‌ స్టోరీ వినిపించింది.

నరేంద్రమోదీ… చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్న వ్యాఖ్యలు చేయడమే.. అవిశ్వాసం మొత్తంలో సాక్షికి కనిపించిన ప్రధాన అంశం. దాన్నే బ్యానర్ స్టోరీగా వేసుకుంది. అందులో మళ్లీ ప్రధానమంత్రి అనని మాటలను కూడా ఆయన నోట్లో పెట్టేశారు. ” హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారని..” మోదీ… అన్నట్లు రాసుకొచ్చేశారు. అది ఆ పత్రిక.. ఆ పత్రికను నడించే నాయకుని పార్టీకి విధానం అనుకున్నా…. మరి అంతకు ముందు చేసిన వాదన ఏమిటి అనే దాన్ని కాస్త జస్టిఫై చేసుకోవాలి కదా..! అదేంటి.. నిన్న మోదీ, బాబు కుమ్మక్కు అన్నాం.. ఈ రోజు నరేంద్రమోడీ .. చంద్రబాబును అంత తీవ్రంగా విమర్శించారు. దాన్ని హైలెట్ చేయాల్సి వస్తే.. కన్విన్సింగ్‌గా ఎలా చెప్పాలన్నదానిపై కనీస కసరత్తు అయినా చేయాలి కదా..! అదీ మాత్రం లేదు. చంద్రబాబును నరేంద్రమోదీ విమర్శించాలన్న ఉత్సాహం మాత్రం.. సాక్షి పత్రిక మొత్తం కనిపించింది.

పిల్లికి ఎలక సాక్ష్యామన్నట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… చంద్రబాబును విమర్శించడం… అంతకు మించిన ఆయుధం దొరకదన్నట్లుగా… సాక్షి పత్రిక విజృంభించడం… చూస్తూంటే.. సాక్షి పాఠకులకు కూడా.. మోడీతో కుమ్మక్కయింది.. చంద్రబాబా.. జగనా అన్న అనుమానం రాక మానదు. ఎప్పుడూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలనే… ప్రత్యేకహోదా విషయంలో నరేంద్రమోడీ పార్లమెంట్ వేదికగా చేశారు. దాన్నే సాక్షి హైలెట్ చేసింది.

ఈ మొత్తం వ్యవహారంలో సాక్షి పత్రిక తనకంటూ ఓ విధానం లేకపోయిందని… నిరూపించేసుకుంది. ఓ వైపు… మోడీ చంద్రబాబుపై రాజకీయ విమర్శలు పార్లమెంట్‌ వేదికగా చేస్తే.. దాన్ని హైలెట్ చేసిన సాక్షి.. కిందనే.. మళ్లీ టీడీపీ..బీజేపీతో రహస్య స్నేహం చేస్తోందని… రాజ్‌నాథ్ మాటలను ఊటంకించారు. కథలు..కథలుగా రాశారు. తమ రహస్య బంధం రాజ్‌నాథ్ బయటపెట్టారని టీడీపీ నేతలు ఆందోళనలో పడ్డారట. అంత రహస్య స్నేహమే ఉంటే.. ఇప్పుడీ హైడ్రామా అంతా ఎందుకు నడిచేది. అందుకే.. సాక్షి పత్రికలో రామాయణం చదివిన వాళ్లు చాలా మంది ఉన్నారు కానీ.. యజమానికి రాముడికి సీత ఏమవుతుందో తెలియదు కాబట్టి.. అందరూ తెలియనట్లే ఉండాలి. అది పత్రికలో రోజూ ప్రతిబింబిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]