దుర్ఘ‌ట‌న‌ను కూడా ఇలా చూపించ‌డం ‘సాక్షి’కే సాధ్యం!

Courtesy : Sakshi

అరుకు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు మావోయిస్టుల చేతిలో హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అంత్యక్రియ‌లు పూర్త‌య్యాయి. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌త్రిక సాక్షి ప్రెజెంటేష‌న్ ఎలా ఉందంటే… అరుకు ఎమ్మెల్యే మృత్యువాత ప‌డ‌టానికి టీడీపీ అధినాయ‌క‌త్వం మొండి వైఖ‌రి అనే వైపు ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్ని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేసింది! ‘సీఎం సారూ.. నాకు మావోల ముప్పు ఉంది’ అంటూ ఓ క‌థ‌నం ప్ర‌చురించారు. గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న నియోజ‌క వ‌ర్గంలోని అన్ని ప్రాంతాల‌కూ వెళ్ల‌లేనీ, స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల తాకిడి ఉంద‌నీ, కాబ‌ట్టి త‌న‌కు ఆ ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌కుండా మిన‌హాయింపు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రిని కిడారి కోరారంటూ పేర్కొన్నారు. టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశంలో కూడా ఇదే అంశాన్ని కిడారి ప్ర‌స్థావిస్తే, కుద‌ర‌ద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పాశార‌ని రాశారు!

‘సీఎం చెప్పడంతో చేసేదేం లేక భయం భయంగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి, మావోయిస్టుల చేతిలో మృత్యువాత ప‌డ్డారు’ – ఇదీ సాక్షి ప్రెజెంటేష‌న్‌! కిడారి అభ్య‌ర్థ‌న‌ను ముఖ్య‌మంత్రి అర్థం చేసుకుని ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని ఆయ‌న అనుచ‌రులు వాపోతున్న‌ట్టు రాశారు. త‌మ‌కు చెప్ప‌కుండా కిడారి ఆయా గ్రామాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని పోలీసులు అంటున్నార‌నీ, భ‌ద్ర‌త లేకుండా బ‌య‌ట‌కి వెళ్లొందంటూ తాము ముందుగానే ఒక నోటీస్ జారీ చేశామ‌నీ చెప్పార‌న్నారు! కానీ, పోలీసులు త‌మ‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని కిడారి పీయే సాక్షికి చెప్పార‌ని రాశారు.

ఏదేమైనా, జ‌రిగింది ఘోరం. మావోయిస్టుల దుశ్చ‌ర్య‌ల‌కు ఒక నిండు ప్రాణం బ‌లైపోయింది. అయితే, ఈ సంద‌ర్భాన్ని కూడా ‘సాక్షి’ ఎలా వాడుకుంటోంద‌న్న‌ది మాత్ర‌మే ఇక్క‌డ చ‌ర్చ‌నీయం. గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యేలంద‌రూ వారివారి నియోజ‌క వ‌ర్గాల్లో అన్ని ప్రాంతాల‌కు వెళ్లాల‌ని సీఎం సూచించారు. అయితే, ‘సీఎం చెప్ప‌డంతో చేసేది లేక…’ కిడారి బ‌య‌లుదేరారు అనే వాక్యంతో ఆ హ‌త్య‌ను ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంగా ప్రెజెంట్ చేయ‌డాన్ని ఏ త‌ర‌హా జ‌ర్నలిజం అంటారో మ‌రి..? మావోయిస్టు ఘాతుకాన్ని ఈ కోణంలో చూపించాల్సిన అవ‌స‌రం ఏముంది..? ప్ర‌తీ అంశంలోనూ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌య‌త్నించ‌డమే పనిగా పెట్టుకోవ‌డం, ఏదో ఒక కోణాన్ని ఎత్తుకుని అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేసే వాద‌న‌ను తయారు చేసుకోవ‌డం, దాన్లోంచి సానుభూతిని గెయిన్ చేసుకోవాల‌నే తాప‌త్ర‌యప‌డ‌టం… సాక్షి తీరు పూర్తిగా ఇలానే ఉంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com