దీని వెన‌క ప్ర‌భుత్వం ఉంద‌ని ‘సాక్షి’కి వినిపించిందట..!

స‌మ‌స్య ఏదైనా కావొచ్చు, దాన్ని ఏదో ఒక కోణం పట్టుకుని అటుతిప్పీ ఇటుతిప్పీ… తెలుగుదేశం స‌ర్కారుకు ముడిపెట్ట‌డం అనేది ‘సాక్షి’ మాత్ర‌మే సాధ్యం! ఇప్పుడు తిరుమ‌ల అంశాన్ని కూడా ఇలానే చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ర‌మ‌ణ దీక్షితులు చేస్తున్న ఆరోప‌ణ‌లు తెలిసిందే. దీనికి నిర‌స‌న‌గా టీటీడీ ఉద్యోగులు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి విధులకు హాజరౌతూ నిర‌స‌న‌ల‌కు దిగారు. ఆ త‌రువాత‌, తిరుమ‌ల‌లో న‌ల్ల బ్యాడ్జీల‌తో ఉద్యోగులు, అర్చ‌కులూ నిర‌స‌న‌లు చేయ‌రాదంటూ జేఈవో శ్రీ‌నివాస‌రాజు ఒక స‌ర్యుల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ విష‌యాన్ని సాక్షి ఎత్తుకోవ‌డ‌మే… ‘అర్చ‌కుల నియామ‌కాల్లో రాజకీయం నడిపిన రాష్ట్ర ప్ర‌భుత్వం, ఇప్పుడు దేవుడిని కూడా లాగుతోంద‌’ని మొద‌లుపెట్టారు! టీటీడీ ఉద్యోగులూ అర్చ‌కులూ న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి విధుల‌కు హాజ‌రు కావ‌డం వెన‌క‌.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌ని వారిక‌ి తెలిసింద‌ట‌! ప్ర‌భుత్వం అండ లేకుండా ఇలాంటి నిర‌స‌న‌లు సాధ్య‌మ‌య్యేవి కాద‌ని ప‌లువురు అంటుండ‌గా సాక్షికి వినిపించింద‌ట‌. అంతేనా.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఉద్యోగుల‌ను రెచ్చ‌గొడుతూ తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేయిస్తోంద‌ని కొంత‌మంది భ‌క్తులు కూడా అంటుండ‌గా సాక్షి చెవిన ప‌డింద‌ట‌. ర‌మ‌ణ దీక్షితులు రాజ‌కీయ నాయ‌కుడు కాదు క‌దా, ఆయ‌న్ని ఎందుకు బ‌లవ‌ంతంగా వివాదాల్లోకి లాగుతున్నార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతుంటే.. సాక్షి చూసింద‌ట‌! తిరుమ‌ల‌లో రోజుకో ఘ‌ట‌న చోటు చేసుకుంటూ ప్ర‌తిష్ఠ‌ను భంగ‌ప‌ర‌చే విధంగా తెలుగుదేశం ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న‌ది ఆ క‌థ‌నం సారాంశం.

ర‌మ‌ణ దీక్షితును వివాదంలోకి ఎవ‌రు లాగారో అంద‌రికీ తెలుసు..! ఢిల్లీలో ఆయ‌న‌కి ఎవ‌రు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారో, ఎవ‌రి ప్రోద్బ‌లంతో ఆయ‌న కేంద్రమంత్రుల్ని క‌లుస్తున్నారో ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారు. ర‌మ‌ణ దీక్షితుల ఆరోప‌ణ‌ల‌ను నేప‌థ్యంగా చేసుకుని దీన్నో వివాదం మార్చి, అక్క‌డేదో జ‌రిగిపోతోందోన్న భ్ర‌మ ప్ర‌జ‌ల‌కు క‌ల్పించ‌డం, దానికి కార‌ణం టీడీపీ అని ప్రొజెక్ట్ చేసేందుకు కాచుకుని ఉన్నవారు ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మౌతోంది. తిరుమల అంశంలో టీడీపీని దోషిగా చూపించాలనే వ్యూహం చాలారోజుల నుంచే అమ‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న‌దే! ఆ మ‌ధ్య పురావ‌స్తు శాఖ నుంచి ఓ జీవో వ‌చ్చింది.. తిరుమ‌ల‌ను త‌మ అండ‌ర్ లోకి తెచ్చుకుని ప‌రిరక్షిస్తామ‌నేస‌రికి.. కేంద్రంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డంతో ఆ జీవోపై వెన‌క్కి త‌గ్గింది. ఇప్పుడు ర‌మ‌ణ దీక్షితులు దొరికారు. ఆయ‌న ఆరోప‌ణ‌ల్ని ప‌ట్టుకుని సీబీఐ ఎంక్వయిరీ వ‌ర‌కూ ఆలోచిస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ కోణాలేవీ సాక్షికి క‌నిపించ‌వు. ఉద్యోగులు న‌ల్ల బ్యాడ్జీలు పెట్టుకోవ‌డం వెన‌క టీడీపీ ఉంద‌ని వినిపించింద‌నీ, కొందరు అనుకుంటున్న‌ట్టు తెలుస్తోందనే ఊహాగానాల‌ను పోగేసి రాసేశారు. విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజం చేసే ఆ ప‌త్రిక‌కు ఇది త‌గునా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com