ఆ కేసులో ‘సాక్షి’కి క‌నిపించే కోణం ఇదొక్క‌టే..!

ఇదిగో పులి అంటే, అదిగో తోక అన్నాడ‌ట వెన‌క‌టికో అత్యుత్సాహ‌వంతుడు! సాక్షి కూడా అంతే అత్యుత్సాహానికి పోతోంది. వారికున్న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోణం నుంచే అన్ని ప‌రిణామాల‌నూ చూస్తుంటుంది. ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. స‌రే, దీనివెన‌క కేసీఆర్ రాజ‌కీయ ఉద్దేశాలూ వ్యూహాలూ వేరే చర్చ‌. అయితే, కేసీఆర్ నిర్వ‌హించిన స‌మీక్ష వార్త‌ను.. సాక్షి మ‌రోలా చూపించే ప్ర‌య‌త్నం చేసింది. ఒక్క అడుగు ముందుకేసి ‘చంద్రబాబే ఏ-1’ అంటూ భారీగా వండివార్చేశారు. ఓటుకు నోటు ఒక కొలీక్కి రాబోతోంద‌నీ, ఈ కేసులో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అభియోగాలు ఎదుర్కోబోతున్నారంటూ సాక్షి తీర్మానించేసింది. ఈ కేసు విష‌య‌మై ఛార్జిషీటు సిద్ధ‌మైపోయింద‌నీ, ఆ కాపీ వారికి అందినంత సాధికార‌త‌గా వార్త రాసేశారు.

ఏ కేసులోనైనా ఏ-1, ఏ-2లు ఎవ‌ర‌నేది నిర్ద‌రించాల్సింది సాక్షి కాదు! దానికి చ‌ట్టం ఉంది. చట్టం దగ్గ‌రున్న ఆధారాలూ, నివేదిక‌ల ప్రాతిపదికగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దాన్లో ఎవ‌రిని అక్యూజ్డ్ వ‌న్ లేదా టుగా చేర్చాల‌నేది వారు నిర్ణ‌యిస్తారు. అంతేగానీ… సాక్షి ప్ర‌ధాన కార్యాల‌యంలో కాదు! వాస్త‌వం మాట్లాడుకుంటే… ఓటుకు నోటు కేసులో టీడీపీ ఇరుక్కున్న మాట వాస్త‌వ‌మే. కానీ, ఇందులో ఏ-1 గా చంద్ర‌బాబును చేర్చే అవ‌కాశాలు సాంకేతికంగా చాలా త‌క్కువ‌. ఎందుకంటే, ఆయ‌న‌ది ఒక్క వాయిస్ టేప్ మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డింది. కాబ‌ట్టి, ఏ-1 ఉండే అవకాశాలు అతి త‌క్కువ‌గానే ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అయినా, దాన్ని నిర్ణయించాల్సింది చట్టం.

అలాంట‌ప్పుడు, సాక్షి ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిందీ అంటే… ఈ వార్త‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా వాడుకోవ‌డం కోస‌మే అనేది వేరే చెప్పాల్సిన ప‌నిలేదు.

నిజానికి, ఏ-1, ఏ-2 లు అన‌గానే గుర్తొచ్చేది ప్ర‌తిప‌క్ష పార్టీలోని టాప్ టు లీడ‌ర్సే. వారానికి ఒక‌సారి కోర్టుకు వెళ్తున్న‌ది జ‌గ‌నే. కాబ‌ట్టి, సహ‌జంగానే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు! అయితే, ఆ విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టాలంటే… రెండే మార్గాలు. ఒక‌టీ తాము నిర్దోషుల‌మ‌ని నిరూప‌ణ జ‌ర‌గాలి.. అది వారి చేతిలో లేని ప‌ని! రెండోది, చంద్ర‌బాబు నాయుడుని కూడా దోషి అనాలి! ఏదో ఒక కేసులో వేలెత్తి చూపాలి. అది సాక్షి చేతిలో పని. చంద్ర‌బాబు పేరుకి కూడా ఏ – 1 అంటూ ఒక ప్రిఫిక్స్ జోడించాల‌నే ఉత్సాహం వైకాపాకి ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే. ఈ మ‌ధ్య ఎంపీ విజ‌యసాయి రెడ్డి కూడా ఢిల్లీలో ఇలానే స‌వాల్ చేశారు క‌దా! త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు బండారం బ‌య‌ట పెడ‌తా, బోనులోకి ఈడుస్తా అన్నారు. అదే ప‌నిగా పీఎంవో చుట్టూ చక్క‌ర్లు కొట్టార‌నీ విమ‌ర్శ‌లొచ్చాయి. కార‌ణాలేవైతేనేం.. ఓటుకు నోటు తేనెతుట్టెని కేసీఆర్ క‌దుపుతున్నారు. దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటూ, సీఎం చంద్ర‌బాబుపై బుర‌దచ‌ల్లే మ‌రో కార్య‌క్ర‌మానికి ప్రారంభ‌మే ఈ క‌థ‌నం ఉద్దేశం. ఇక చూడండి.. ఈ మాత్రం స్క్రిప్ట్ దొరికింది క‌దా, ఇక అంబ‌టిలూ, రోజా రెడ్డీలకు మైకావేశం రావ‌డం ఒక్క‌టే త‌రువాయి..!

కొస మెరుపు: ఒక కీల‌క‌మైన కేసుకు సంబంధించిన వార్త‌లో ‘నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు’ అనే ఊహాజ‌నిత వాక్యాన్ని రాయోచ్చా లేదా అనేది స‌గ‌టు జ‌ర్న‌లిస్టుకు తెలిసిన ప్రాథ‌మిక పాఠం. మ‌రి, విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజం మాత్ర‌మే చేస్తున్న సాక్షి… ఓటుకు నోటు కేసులో ఏకంగా ఏ 1, ఏ 2ల‌ను కూడా డెస్క్ లో నిర్ణ‌యించే స్థాయికి ఎదిగిపోయిందంటే.. ఏమ‌ని అర్థం చేసుకోవాలి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com