బిగ్ బాస్ : సంపూ ఏడుపు ఓ డ్రామానేనా??

ఏంటో.. కాస్త చ‌ప్ప‌గా మొద‌లైన బిగ్ బాస్ – ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. బిగ్ బాస్ లో ఇప్పుడిప్పుడే ఆస‌క్తి క‌ర‌మైన ఘ‌ట్టాలు మొద‌ల‌వుతున్న స‌మ‌యంలో సంపూర్నేష్ బాబు షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అదీ సాదా సీదాగా కాదు. షోలో సంపూ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. – చచ్చిపోతా అని అరిచాడు, ఏడిచాడు.. ”ఈ షో నుంచి న‌న్ను పంపించేయండి బాస్‌… నేనిక్క‌డ ఉండ‌లేను” అంటూ చిన్న‌పిల్లాడిలా ఏడ్చేశాడు. దాంతో.. సంపూ బిగ్ బాస్ షో లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. సంపూ ఎపిసోడ్ చూస్తుంటే.. ఇదంతా కావాలని ఆడిస్తున్న డ్రామాలానే ఉంది. ఆత్మ‌హ‌త్య చేసుకొందామ‌నేంత సీన్ క్రియేట్ చేయ‌డం కాస్త అతిగా అనిపిస్తుంది. షో నియ‌మాల ప్ర‌కారం.. ఎవ‌రికి న‌చ్చినా, న‌చ్చ‌క‌పోయినా ఎలిమినేష‌న్ అయ్యేంత వ‌ర‌కూ బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాలి. బ‌య‌టకు రావ‌డం కుద‌ర‌దు. అలాంటి స‌మ‌యంలో… సంపూ ర‌చ్చ చేసి – కావాల‌ని వాకౌట్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డానికి ఓ ద‌గ్గ‌ర దారి చూపించాడు.

సెల‌బ్రెటీల లిస్టులో సంపూనే కాస్త ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉన్నాడ‌నుకొన్నారంతా. కానీ…. ఆ సంపూనే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం చూస్తుంటే.. ఇదంతా బిగ్ బాస్ షోలో మెలోడ్రామా కోస‌మే అనిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌ప్ప‌గా సాగిన ఈ షో… సంపూ ఎలిమినేష‌న్ తో కాస్త ఊపొచ్చిన‌ట్టైంది. బ‌హుశా… బిగ్ బాస్ వ్యూహం కూడా ఇదే కావొచ్చు. సంపూ వ‌చ్చేశాడు కాబ‌ట్టి.. త‌న ప్లేస్‌లో మ‌రొక‌ర్ని పంపే అవ‌కాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యం. లేదంటే.. బ‌య‌ట ప‌నుల‌న్నీ చూసుకొని – సంపూ మ‌రోసారి బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టినా పెట్టొచ్చు. ఇది బిగ్ బాస్ గేమ్‌! రూల్స‌ల్నీ వాళ్ల‌కు అనుగుణంగానే ఉంటాయి. సంపూ ఎలిమినేష‌న్ నిజంగా జ‌రిగిందా, లేదంటే… ఇదంతా ఉత్తుత్తినేనా..? చూద్దాం.. ఏం జరుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.