భారతీయ మహిళా టెన్నిస్ మరో మెట్టు పైకెదిగింది. సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ కు చేరింది. సెమీ ఫైనల్లో మేరీ పియర్స్, కోప్స్ జోడీని వరస సెట్లలో చిత్తు చేసింది. 6-1, 6-2 స్కోరుతో అలవోకగా ఓడించింది. గతంలో అనేక టైటిల్స్ గెల్చుకున్న సానియా, వింబుల్డన్ ఫైనల్స్ కు చేరడం ఇదే మొదటిసారి.
ఈ మధ్య వరస విజయాలతో మంచి ఊపు మీదున్న సానియా జోడీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ ఆడింది. మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం చాటింది. ప్రత్యర్థి జోడీకి కుదురుకోనివ్వకుండా తమదైన షాట్లతో దాడి చేసింది. తొలి సెట్ ను 6-1 తో గెలుచుకుందంటే సానియా జోడీ ఎంత ఫామ్ లో ఉందో అర్థమవుతుంది. రెండో సెట్లో ప్రత్యర్థి జోడీ కాస్త పోటీ ఇవ్వడానికి ప్రయత్నించినా సానియా, హింగిస్ ధాటికి తట్టుకోవడం సాధ్యం కాలేదు. దీంతో 6-2తో సానియా జోడీ సెట్ ను, మ్యాచ్ ను గెల్చుకుంది.
అనేక ఏటీపీ టోర్నీల్లో టైటిల్స్ గెల్చుకున్న సానియా, మహిళల డబుల్స్ లో ఇంత వరకూ గ్రాండ్ స్టామ్ టైటిల్ ను గెల్చుకోలేదు. 2011లో ఎలెనా వెస్నినాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు చేరింది. కానీ విజయం సాధించలేక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఓ గ్రాండ్ స్లాం టోర్నీ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. ఫైనల్లో సానియా మెరుపులు విజయాన్ని సాధిస్తే అది సంచలనమే అవుతుంది. భారతీయ టెన్నిస్ కు క్రేజ్ ను తెచ్చిన సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరే అవకాశం ఉంది. మరి, ఫైనల్లో ఈ జోడీ ఇదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి.