అల్లరి పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్…. హేమ. మనకు లేడీ కమిడియన్లు అంతంత మాత్రమే. శ్రీలక్ష్మి తరవాత ఆ ప్లేసు చాలా కాలం ఖాళీగా ఉండిపోయింది. అలాంటి దశలో ఎంట్రీ ఇచ్చింది హేమ. త్రివిక్రమ్ సినిమాల్లో హేమకు భలేటి పాత్రలు పడ్డాయి. నరేష్ నటించిన చాలా సినిమాల్లో హేమ కనిపించేది. కృష్ణభగవాన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ లాంటి వాళ్ల పక్కన నిలబడి ఠీవీగా సెటైర్లు వేసేది. ఈమధ్య హేమ దూకుడు కాస్త తగ్గింది. అయితే… ఓ వైవిధ్యభరితమైన పాత్రతో షాక్ ఇవ్వబోతోందట. అవును… హేమ విలన్ గా మారింది. తనలోని విలనిజాన్ని తొలిసారి చూపించబోతోంది. సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్. ఈ సినిమాలో హీరో సప్తగిరి అయితే.. విలన్ హేమ.
”అక్కయ్య.. నువ్వు ఈ సినిమాలో ఓ కీ రోల్ చేయాలి అని సప్తగిరి అడిగాడు. నేను ఒప్పుకొన్నా. అయితే అది విలన్ పాత్ర అని తరవాత తెలిసింది. నన్ను విలన్ గా రిసీవ్ చేసుకొంటారా, లేదా అనుకొన్నా. కానీ.. దర్శకుడు నా పాత్రని డీల్ చేసిన విధానం బాగా నచ్చింది. తప్పకుండా నాకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది” అంటోంది హేమ. ఈ సినిమాలో అలీ కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడు. సప్తగిరి ఆడియో ఫంక్షన్లో అలీ మాట్లాడుతూ.. సప్తగిరికి ఓ విలువైన సలహా ఇచ్చాడు. ”కమిడియన్లు హీరోగా సినిమా చేస్తే అది లాటరీ టికెట్టు కొన్నట్టే. ఎప్పుడో ఓసారి తగులుతుంది. ఆ డబ్బులు జేబులో పెట్టుకోండి. మళ్లీ మళ్లీ టికెట్ తీయాలని చూడొద్దు. కమిడియన్ పాత్రలే మనకు శ్రీరామరక్ష” అంటూ… హీరోగా చేసినా కామెడీ వేషాలు వదలకూడదు అని సలహా ఇచ్చాడు. ఇదే వేడుకకు వచ్చిన సునీల్‌కి ఈ మాటలు తగిలాయో లేదో??