మహా కూటమి సిత్రాలు: బాబు వల్లే తెలంగాణ వచ్చిందంటున్న కాంగ్రెస్ నేత

మూడు దశాబ్దాలుగా తెలుగు నేలపై బద్ధ శత్రువులుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య తెలంగాణ ఎన్నికల కారణంగా పొత్తు కుదిరింది. నేతల మధ్య సునాయాసంగా పొత్తు కుదిరినప్పటికీ, దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యతిరేకత నింపుకున్న తెలుగుదేశం క్యాడర్ లో నూ, అలాగే జీవితంలో ఎన్నడూ చంద్రబాబుకు ఓటు వేయని కాంగ్రెస్ అభిమానులలోనూ, ఈ పొత్తు మీద ఇంకా పూర్తి స్థాయి సదభిప్రాయం రాలేదు. అయితే పొత్తు తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల మధ్య మాత్రం పరస్పరం సానుకూల వ్యాఖ్యానాలు, పొగడ్తలు వెలువడుతున్నాయి. దాంతో ఈ వ్యాఖ్యానాలు తెలుగు ప్రజలకు కామెడీ గా అనిపిస్తున్నాయి.

ఈ కోవలో ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వ్యాఖ్య కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్య. చంద్రబాబు వల్లే తెలంగాణ ఏర్పడింది అంటూ సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా సోనియాగాంధీ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ వచ్చిందని అటు కాంగ్రెస్ నేతలు, కెసిఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాధ్యం అయిందని ఇటు టీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నప్పటికీ, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు వల్లే తెలంగాణ వచ్చింది అన్న వాదన కాంగ్రెస్ నేతల నుండే మొదలైంది. చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇవ్వడం వల్ల, బిల్లు పెట్టి తీరాల్సిందే అని కాంగ్రెస్ ని ఒత్తిడి చేయడం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టారని , దాని వల్లే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సర్వే సత్యనారాయణ, తెలుగుదేశం మరియు టీజేఏసీ నేతలతో కలిసి పెట్టిన ప్రెస్ మీట్ లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇక మహా కూటమి కారణంగా ఏర్పడ్డ పొత్తు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది తెలియడానికి మరో 3 వారాలు పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.