బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు తెలంగాణ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలని, 48 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ , క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
ఈ స్కామ్ విషయంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ ఫోన్ల కొనుగోలులో నిజంగానే భారీ కుంభకోణం జరిగిందని బిఆర్ఎస్ బలంగా నమ్మితే, ఆ పార్టీలోని సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంటి వారితో నేరుగా ప్రెస్ మీట్ పెట్టించి సాక్ష్యాలను బయటపెట్టవచ్చు. అలా కాకుండా, కేవలం సోషల్ మీడియా వేదికగా దళిత నేత క్రిశాంక్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది.
సీతక్క ఇప్పటికే లీగల్ నోటీసు ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు బిఆర్ఎస్ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఈ వివాదం కోర్టుకు వెళ్తే, అక్కడ తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించి స్కామ్‌ను నిరూపించే గొప్ప అవకాశం ఆ పార్టీకి ఉంది. ఒకవేళ కోర్టులో అవినీతి నిరూపితమైతే సీతక్క తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నారు. ఒక అవినీతి మంత్రిని పదవి నుంచి దించేసే ఇంతటి సువర్ణ అవకాశాన్ని వదులుకోకుండా, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి ఉంది.
కోర్టులో జరిగేది పారదర్శకమైన విచారణే కాబట్టి, సత్యమేంటో తేలిపోతుంది. ఒకవేళ బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తేలితే, తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ పార్టీ కూడా చట్టపరమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని, కోర్టు వేదికగా తమ నిజాయితీని లేదా ఎదుటివారి అవినీతిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బిఆర్ఎస్ పైన ఉంది. అయితే నోటీసులపై ప్రెస్‌మీట్ పెట్టిన క్రిషాంక్..ఆధారాలేమీ బయట పెట్టలేదు కానీ.. సీబీఐ విచారణ కావాలని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతోనే ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా బురద చల్లుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
