స్వయం కృతాపరాధం-ముంచుకొచ్చిన అపాయం

జగన్‌ కేసులపై మాజీ సిఎస్‌ రమాకాంతరెడ్డిని కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ చేయడమే రాజకీయ మీడియా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సందర్భంగా ఆయన ఈ కేసులు నిలవబోవనీ, ఈ ముక్క సిబిఐ జెడి లక్ష్మీనారాయణకే చెప్పానని గొప్పగా ప్రకటించుకోవడం ఇంకా విపరీతంగా వుండింది. రమాకాంతరెడ్డి ఇలా అనగానే కొమ్మినేని జెడి లక్ష్మీనారాయణ ఏమన్నారని ప్రశ్నించడం, వూరికే నవ్వారని ఆయన జవాబు చెప్పడం అంతా ప్రహసనంగా నడిచింది. రమాకాంతరెడ్డి మాజీ ఐఎఎస్‌ అయితే కావచ్చు గాని ఆరోపణలకు అతీతులేమీ కాదు. ఆ మాటకొస్తే ఎలుగుబంటి సూర్యనారాయణ ఇఎస్‌ఐ ఆస్పత్రుల కుంభకోణం వచ్చినపుడు ఆయన పాత్రపైనా విమర్శలు వచ్చాయి. నేనైతే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని సూటిగా ప్రశ్నించాను. సిఎస్‌ తప్పేమీ లేదని ఆయన జవాబిచ్చినపుడు ఎవరి తప్పు లేకపోతే ఇంక విచారణ ఎందుకు జరిపిస్తున్నారని కూడా అడిగాను.(ఇవన్నీ నెట్‌లో చూడొచ్చు) జగన్‌పై పెట్టిన రెండు కేసులో రమాకాంతరెడ్డిని పిలిచి విచారించారు. ఆయనను ఏమడిగారు, తానేం చెప్పారన్నది అంతర్గత విషయం. దానిపై తన గురించి తనే చెప్పుకున్నదాన్ని ప్రమాణంగా తీసుకోవడానికి లేదు. అంతటితో ఆగక కేసుపైనే వ్యాఖ్యలు చేయడం, సిబిఐకి క్యాబినెట్‌ ఫంక్షనింగుపైనే అవగాహన లేదని తీసిపారేయడం కొంత విడ్దూరంగానే అనిపించింది. ఆ విషయాలు చెప్పడానిక(నేర్పడానికి)ి తాను ఎవరినో పంపించానని కూడా మాజీ సిఎస్‌ గొప్పలు పోయారు.దానిపై 10టీవీలో చర్చ వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నట్టు లని నేను బహిరంగంగానే వ్యాఖ్యానించాను. ఆ రోజు మిగిలిన ప్యానలిస్టులు దానిపై మాట్లాడేందుకు సమయం సరిపోలేదు. ఇదంతా రాతలోనూ పెడతామనుకున్నా గాని సమయం లేక వదిలేశాను. ఇప్పుడు సరిగ్గా దాన్నే ఆధారంగా తీసుకుని జగన్‌ బెయిలు రద్దు చేయాలని సిబిఐ కేసు దాఖలు చేయడం చాలా కాలం తర్వాత వచ్చిన తీవ్ర పరిణామం. ముమ్మాటికీ స్వయం కృతమే. సాక్షి జగన్‌ స్వంతమైనంత మాత్రాన ఈ ఇంటర్వ్యూను ఆయనకు ఆపాదించడానికి లేదు గాని కేసును ప్రభావితం చేసే ప్రయత్నం అనడానికి ఆస్కారం ఇచ్చింది. శాసనసభలోనూ జగన్‌దీనిపై మరింత గట్టిగా మాట్లాడారు గాని అది సభ్యుడుగా ఆయన హక్కు కింద పోవచ్చు . పిటిషన్‌లో సిబిఐ వాదనను ఎదుర్కోవాలంటే జరిగింది తనకు తెలియదని,ముందు ముందు జాగ్రత్త వహిస్తానని చెప్పి బయిటపడాల్సిందే. అంతకంటే ఎక్కువ వాదన వేసుకుంటే ప్రతికూల ఫలితాలే కలుగుతాయి. ఇక కొమ్మినేని గాని ఇతర అత్యుత్సాహ వంతులు గాని ఎలాటి జాగ్రత్తలు తీసుఉంటారనేది చూడాల్సిందే.సిబిఐనో లేక చంద్రబాబునో విమర్శించినా రాజకీయంగా కలిగే నష్టం వుండనే వుంటుంది. బహుశా ఈ విషయంలో జగన్‌ బృందం ఎలాటి తొందరపాటుకు దిగకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com