రివ్యూ : ఓ బోరింగ్ రాజా ‘సెల్ఫీరాజా’

Selfie Raja Telugu Movie Review
Selfie Raja Telugu Movie Review

ఈ తరం హీరోల్లో తనదైన కామెడితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ తో గతంలో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో, సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, మరియు గతం లో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై రూపొందించిన హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్, ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి (చలసాని గోపి తనయుడు) ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ పబ్లిసిటీ తో అందరిని ఆ కట్టుకున్నఈ చిత్రం ఈ రోజున విడుదల అయ్యింది. ఈ చిత్రం లో సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ , కామెడీ పరం గా మరి ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

సెల్ఫీ రాజా (అల్లరి నరేష్) సెల్ఫీ మేనియాక్, సెల్ఫీ పిచ్చితో నిత్యం సమస్యల్లో చిక్కుకునే యువకుడు. ఓ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తుంటాడు. అతనికున్న వీక్ నెస్ ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు దిగడమే. ఉదయం లేవడమే సెల్ఫీతో డే స్టార్ట్ చేస్తుంటాడు. అయితే తను తీసే సెల్ఫీలతో అవతలవారిని అడ్డంగా బుక్ చేస్తూ వారందరు తన మీద గొడవకు వచ్చేలా చేసుకుంటాడు. అదొక్కటే కాదు నోటికి దూల ఎక్కువ. ఇక అలాంటి సెల్ఫీ రాజా శ్వేతను (కామ్న రనౌత్)ను మొదటి చూపులోనే ఇష్టపడి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. శ్వేత కూడా రాజా లవ్లో పడుతుంది. శ్వేత ఫాదర్ పోలీస్ కమీషనర్ (నాగినీడు) పెళ్లికి ఒప్పుకోవడం పెళ్లి జరిగిపోవడం అంతా జరుగుతుంది. పెళ్లి తర్వాత ఓ చిన్న గొడవతో రాజా శ్వేతలు విడిపోతారు. చనిపోవాలనుకున్న రాజా కిల్లర్ ఖాకి (రవిబాబు)కు తనను చంపే కాంట్రాక్ట్ ఇస్తాడు. ఇక్కడే షాక్ తనను చంపేందుకు ముంబై నుండి వచ్చిన భీమ్స్ కూడా అచ్చం రాజాలానే ఉంటాడు. ఇతంకీ రాజాను భీమ్స్ ఏం చేశాడు..? రాజాను చంపేందుకు భీమ్స్ మనుషులే కాకుండా మరో బ్యాచ్ ఎందుకు ప్రయత్నం చేస్తుంది..? రాజా శ్వేతలు కలిశారా లేదా..? ఈ కథ లో వున్న ట్విస్ట్ ఏమిటి ? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ….

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

అల్లరి నరేష్‌కి ‘సుడిగాడు’ తర్వాత సుడి కలిసి రావడం లేదు అనుకుంటా? వరుసపెట్టి చాలా ఫ్లాప్‌ సినిమాలు చేసిన నరేష్‌ ఇప్పుడు సెల్ఫీ మేనియాక్ గా నటించిన చిత్రం ‘సెల్ఫీరాజా’. నవ్వించడానికి వివిధ మేకప్పులు, డ్యూయల్‌ రోల్సు చేస్తున్న అల్లరి నరేష్‌, ఈసారి కూడా సెల్ఫీ రాజా, భీమ్స్ క్యారక్టర్స్ తన ఓ కె అనిపించాడు. చాలా సాధారణ సన్నివేశాలు, నాసి రకం సంభాషణలు ఉన్నా కానీ తన మార్కు టైమింగ్‌తో అక్కడక్కడా మెరిసాడు. కానీ ఇంతకంటే బెటర్‌ కామెడీ ఎప్పుడో చేసేసిన నరేష్‌ నుంచి ఈ లెవల్‌ కామెడీని ఇప్పుడు ఎంజాయ్‌ చేయడం కష్టమే. ఇక హీరోయిన్ గా చేసిన కామ్న రనౌత్ ఓకే అనిపించుకుంది. సినిమాలో ఆమెకు అంత ఎక్కువ స్కోప్ లేదు. ఇకపోతే సెకండ్ హీరోయిన్ గా సాక్షి చౌదరి నటించింది. సాక్షి అందాలు అక్కడక్కడ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక కమెడియన్స్ కృష్ణ భగవాన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ చేసిన కామెడీ ఓ ఎత్తైతే జబర్దస్థ్ టీం మొత్తం ఇందులో రకరకాల పాత్రల్లో అలరించడం విశేషం. ముఖ్యంగా అంకుశం పోలీస్ గా ప్రుధ్వి రాజ్ మరోసారి ఇరగ్గొట్టేశాడు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రం మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. ఇదే సబ్జెక్ట్ తో ఇదవరకే సినిమాలు చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి అవుట్‌ డేటెడ్‌ డైరెక్టర్స్‌ హ్యాండిల్‌ చేసిన తీరులో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఒకటి, రెండు సినిమాలు తీసిన దర్శకుడి నుంచి కాస్త ఫ్రెష్‌నెస్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే మాత్రం చాలా నిరుత్సహ పడతాం.కనీసం కామెడీ పరంగా అయినా కొత్తగా ట్రై చేయలేదు. ఈమధ్య అందరూ చేస్తున్నట్టే… ద్వితీయార్థంలో కన్‌ఫ్యూజన్‌ డ్రామాతో నెగ్గుకు రావాలని చూసాడు. సినిమాటోగ్రఫీ పరవా లేదు. ఎడిటర్ ఎం.ఆర్ వర్మ సినిమా ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది.. అక్కడక్కడ జర్క్ లు వచ్చినట్టు అనిపిస్తుంది. డైలాగ్స్‌ అంతటా ప్రాసల పరంపర తప్ప గుర్తుండేవి ఏవీ లేవు.సాయి కార్తిక్ పాటలు ఎందుకున్నాయో తెలీదు నేపథ్య సంగీతం కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కథకు తగ్గట్టు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది.

విశ్లేషణ :

సెల్ఫీ రాజా టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో మొదట సెల్ఫీ పిచ్చి ఉన్న హీరో పాత్ర దాని వల్ల వచ్చిన గొడవలు చూపించడం ఓకే కాని, తర్వాత సినిమాలో ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఉండదు. నవ్వించడం కోసమని చేయని ప్రయత్నమంటూ లేదు. సినిమా నిండా చాలా మంది కామెడీ ఆర్టిస్టులున్నారు. అడపాదడపా కొన్ని జోకులు ఫర్వాలేదనిపించాయి తప్పితే వాటి కోసమని మిగతా సొద అంతా భరించడం చాలా కష్టం. కేవలం ప్రాస డైలాగులుంటే జనం నవ్వేస్తారనుకునే భ్రమలోంచి రచయితలు బయటకి రావాలి. సన్నివేశంలో నవ్వించే సత్తా లేనప్పుడు కనీసం సంభాషణలతో అయినా కొంతవరకు కాపాడ్డానికి వీలున్న జోనర్‌ కామెడీ ఒక్కటే. అయితే కామెడీ పండించడానికి రచయిత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటి నాసిరకం సినిమాలే వస్తాయి. చిన్న అవుట్‌లైన్‌ దొరికితే దాంతో అలరించే కామెడీ సినిమాని రూపొందించే టాలెంట్‌ ఉన్న జంధ్యాల, ఇవివి సత్యనారాయణ లాంటి దర్శకులు లేని వెలితి బాగా కనిపిస్తోంది. లో బడ్జెట్‌ సినిమాల్లో మినిమమ్‌ గ్యారెంటీ అయిన జోనర్‌ నెమ్మదిగా కళ కోల్పోతోంది.ఇక అసలు విషయానికొస్తే… కథను కావాలనే కన్ ఫ్యూజ్ చేసి ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చేశాడు దర్శకుడు ఈశ్వర్ రెడ్డి. తాను చెప్పదలంచుకున్న పాయింట్ కాస్త కామెడీతో మిక్స్ చేసి చెప్పడంలో విఫలమయ్యాడు. నరేష్ సినిమా అంటే కొన్ని సీన్స్ అదరగొడతాయన్నట్టు ఇందులో బాహుబలి స్పూఫ్ తో ట్రాఫిక్ పోలీస్ ద్రంక్ అండ్ డ్రైవ్ రైడ్ దగ్గర వచ్చే కామెడీ ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇస్తుంది. ఇక అక్కడక్కడ బెంగాల్ టైగర్, బాహుబలి స్పూఫ్ లను చేస్తూ సినిమాను రన్ చేశారు. క్లైమాక్స్ లో కాళిదాసు, రాజా అండ్ ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేసి చంపేయాలని చూస్తుంది. అయితే అక్కడ ఉంది భీమ్స్ అని సెల్ఫీ రాజా ఎంట్రీ వచ్చాక అర్ధం అవుతుంది. సో ఫన్ని క్లైమాక్స్ తో సినిమా ముగింపు పలుకుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎంజయ్ చేసినట్టే అనిపిస్తుంది. తీరా బయటకు వస్తే మాత్రం ఏమి ఉండదు. హీరోయిన్స్ పేరుకి ఇద్దరు ఉన్నా ఒక్కరు కథకు కనెక్ట్ అయ్యేలా ఉండరు. ఓ విధంగా చెప్పాలంటే మొదటి హీరోయిన్ కామ్న రనౌత్ కన్నా సెకండ్ హీరోయిన్ గా చేసిన సాక్షి చౌదరికి కాస్త ఎక్కువ స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి లాజిక్ లు ఏమి వద్దు అనుకున్న వారికి అల్లరి నరేష్ చూపించిన సెల్ఫీ రాజా కామెడీ నచ్చే అవకాశం ఉంటుంది. రొటీన్ కామెడీతో నడిచే ఈ సినిమా అందరికి నచ్చదు.

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

బ్యానర్ :ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్,
నటీనటులు : అల్లరి నరేష్, సాక్షిచౌదరి, కామ్నా రనవత్, నాగినీడు, రవి బాబు, సప్తగిరి,కృష్ణ భగవాన్,పృద్వీ రాజ్, సుడిగాలి సుధీర్, జీవ, సత్య, షకలక శంకర్, తాగుబోతు రమేష్, మరియు జబర్దస్త్ షో నటులు.
కెమెరా : ఎస్ . లోకనాథన్,
ఆర్ట్ : చిన్న
కథ, :శ్రీధర్ సీపాన,
మాటలు : డైమండ్ రత్న బాబు,
ఎడిటింగ్ : యం.ఆర్. వర్మ,
సంగీతం :సాయి కార్తిక్
స‌మ‌ర్ప‌ణ‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
నిర్మాత : చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి
దర్శకత్వం : జి.ఈశ్వర్ రెడ్డి
విడుదల తేదీ : 15.07.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com