సీనియ‌ర్లు త‌ప్పు చేస్తోంద‌క్క‌డే!

వంశీ తీసిన `ఫ్యాష‌న్ డిజైన‌ర్‌` సినిమా చూసి, ఏడ‌వాలో, వంశీపై జాలి ప‌డాలో అర్థం కాదు. లేడీస్ టైల‌ర్ తీసిన వంశీనేనా? చెట్టుకింద ప్లీడ‌ర్ తీసిన వంశీ, తినూ ఒక్క‌డేనా?? అనే అనుమానాలు వచ్చేయ‌డం స‌హ‌జం. లేడీస్ టైల‌ర్ రోజుల్లో వంశీ తీసిన ఫ్లాప్ సినిమా కూడా ఫ్యాష‌న్ డిజైనర్ కంటే వంద రెట్లు మెరుగ్గా ఉంటుంది. తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ఎన్నో మ‌ధురానుభూతులు మిగిల్చిన వంశీలాంటి ద‌ర్శ‌కుడి నుంచి ఇలాంటి అవుట్ పుట్ ఊహించ‌లేం. ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఆడుతున్న థియేట‌ర్లు చూస్తుంటే… వంశీపై జాలి మ‌రింత పెరిగిపోతుంది. ఎందుకంటే… ఆ థియేట‌ర్ల ద‌గ్గ‌ర అస‌లు సంద‌డే లేదు.

వంశీ మంచి క‌థ‌కుడు, గొప్ప ర‌చ‌యిత‌, మంచి ద‌ర్శ‌కుడు. త‌న టేస్ట్ అద్భుతం. వంశీ స్టైల్ అర్థం చేసుకొన్న‌వాళ్ల‌కు వంశీ భ‌లే బాగా నచ్చేస్తుంటాడు. వంశీ క‌ళ్ల‌తో ఆ సినిమాని చూస్తే మ‌రింత అందంగా, అద్భుతంగా క‌నిపిస్తుంటుంది. అలాంటి వంశీ వీరాభిమానుల‌కు కూడా ఫ్యాష‌న్ డిజైన‌ర్ మింగుడు ప‌డ‌దు. దానికి కార‌ణం… వంశీ ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోవ‌డం. ఇంకా ముత‌క కామెడీని ప‌ట్టుకొని వేళాడ‌డం. వంశీ జ‌మానా చూసిన ప్రేక్ష‌కుల‌కే ఇప్ప‌టి వంశీ న‌చ్చ‌లేదంటే.. ప్ర‌స్తుతం ఉన్న యూత్ గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. వంశీ ఘ‌న‌త‌లు తెలీవు కాబ‌ట్టి.. వాళ్ల‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌రింత సాదా సీదాగా క‌నిపించొచ్చు. వంశీ కామెడీ టైమింగ్ కి ఓ స్పెషాలిటీ ఉండేది. ఆ కామెడీ పండే రోజులు కావివి. ఈత‌రానికైతే `ఇదేం గోల‌` అనిపిస్తుంది. వంశీ త‌న ఛ‌ట్రంలోంచి తాను బ‌య‌ట‌కు రావాలి. ఈ త‌రానికి ఏం కావాలో ఆలోచించాలి. త‌ను భావుక‌త ఉన్న ద‌ర్శ‌కుడు. స‌న్నివేశాన్ని పొయెటిగ్‌గా తీయ‌గ‌ల‌డు. ఆ బ‌లాన్ని, ఆ కోణాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టాలి. అన్వేష‌ణ లాంటి సీరియెస్ సినిమాలు అందించాలి. అప్పుడు ఈ జ‌న‌రేష‌న్ భావాల‌కు కాస్త ద‌గ్గ‌ర‌గా రాగ‌ల‌డేమో అనిపిస్తుంది.

వంశీలాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు ఇప్పుడు వ‌రుస‌గా విఫ‌లం అవుతున్నారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు, ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి న‌ర‌సింహ‌రావు లాంటి ద‌ర్శ‌కులు ఈమధ్య సినిమాలు తీసి చేతులు కాల్చుకొన్నారు. దానికి కార‌ణం.. ఈ త‌రం ట్రెండుకు దూరంగా ఉండ‌డ‌మే. దాస‌రి చివ‌రి చిత్రం ఎర్ర‌బ‌స్సు కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. దానికి కార‌ణం.. ఆయ‌నా ట్రెండు గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే. వంశీ ద‌గ్గ‌రా ఈ లోపం క‌నిపిస్తోంది. తమ‌ని తాము అప్‌డేట్ చేసుకోవ‌డంలో సీనియ‌ర్లు అశ్ర‌ద్ధ చేస్తున్నారు. తాము సృష్టించిన ట్రెండునీ, తమ‌కి విజ‌యాల్ని అందించిన ఫార్ములాల‌నే ఇప్ప‌టికీ ప‌ట్టుకొని వేలాడుతున్నారు. ఆ జ‌మానా పోయి చాలా కాలం అయ్యింద‌న్న నిజాన్ని గ్ర‌హించ‌డం లేదు. సీనియ‌ర్ల నుంచి సినిమాలు రావాల్సిందే. వాళ్ల మేకింగ్ మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల్సిందే. కాక‌పోతే.. జ‌స్ట్ అప్‌డేట్ అవ్వ‌మంటున్నామంతే! ఈ ఒక్క లోపం స‌వ‌రించుకోగ‌లిగితే.. సీనియ‌ర్లు.. ఇప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ల‌ని మించిపోయే సినిమాలు తీయ‌గ‌ల‌రు.. తీస్తారు కూడా! ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.