తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నిలువునా చీలిపోయింది. పార్టీ నాయకత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, డీఎంకేతో సాన్నిహిత్యం పెంచుకోవాలనే ఆలోచనలపై తీవ్ర అసహనంతో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగా విడిపోయారు. వారంతా తమ మద్దతును నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీకి ప్రకటించారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకే సంక్షోభంలో పడటమే కాకుండా, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది.
చీలిపోయిన ఎమ్మెల్యేల వర్గం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత 53 ఏళ్లుగా ఏ డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఆవిర్భవించిందో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూడటం కార్యకర్తలకు చేసే ద్రోహమని వారు మండిపడుతున్నారు. పార్టీ ఉనికిని కాపాడటం ప్రస్తుత నాయకత్వం వల్ల కాదని, అందుకే తామంతా కలిసి టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత ఆశయాలను నిజమైన రీతిలో ముందుకు తీసుకెళ్లే సత్తా విజయ్‌కే ఉందని ఈ తిరుగుబాటు వర్గం బలంగా నమ్ముతోంది.
ఈ పరిణామం అన్నాడీఎంకే అధిష్టానానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు జారిపోవడంతో అసెంబ్లీలో పార్టీ బలం గణనీయంగా తగ్గడమే కాకుండా, విపక్ష హోదా కూడా ప్రమాదంలో పడింది. ఈ ఎమ్మెల్యేలు కేవలం మద్దతు ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న భారీ కేడర్‌ను కూడా టీవీకే వైపు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. జయలలిత లేకపోయినా అన్నాడీఎంకే ఎలాగోలా బలంగా నెట్టుకొస్తున్నా… ఇప్పటి పరిణామాలతో అన్నాడీఎంకే కేడర్ కూడా.. టీవీకేతో కలసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నాడీఎంకే చీలిక వల్ల టీవీకే ప్రభుత్వానికి స్థిరత్వం వస్తుంది.


