ఎట్టెట్టా శివాజీ..? చుక్కల భూముల వివాదంతో చంద్రబాబుపై కుట్రా..?

హీరో శివాజీ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సారి మరో కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వెనుక చుక్కల “భూముల కేంద్రంగా” కుట్ర జరుగుతోందని.. 12 లక్షల మంది ఓటర్లను టీడీపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా… అధికారులే అడ్డు పడుతున్నారని.. చంద్రబాబు చెప్పినా వినిపించుకోవడం లేదంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలున్నాయని.. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ అడిగానని… ఆయనకు ఆధారాలు మొత్తం ఇస్తానన్నారు. తనకు కొంత మంది కలెక్టర్లతో జరిగిన అనుభవాలను కూడా ఆయన వివరించారు. చంద్రబాబుకు సమస్య ఏమిటో చెప్పిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే.. సంక్రాంతి తర్వాత ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు.

చుక్కల భూముల సమస్య ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉంది. స్వాతంత్య్రం రాక ముందు 1906లో దేశవ్యాప్తంగా భూముల సర్వే జరిగింది. ప్రతి 30 ఏళ్లకోసారి సర్వే లేదా రీ సర్వే జరగాలి. కానీ 1954 తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సర్వే, రీ సర్వే జరగలేదు. దీంతో భూ వివాదాలకు 1954 నాటి రెవెన్యూ రికార్డులే ప్రామాణికంగా ఉన్నాయి. రీ సర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్‌ వారీగా ఖాతాదారుల పేర్లు, విస్తీర్ణం నమోదు చేశారు. అయితే, ఎవరూ క్లెయిమ్‌ చేయని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములుగా చెలామణి అవుతున్నాయి. 1974లో ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణల చట్టం ప్రకారం ఎవరూ క్లెయిమ్‌చేయని, పోరంబోకు భూములన్నీ ప్రభుత్వానికి చెందుతాయని ఆదేశం ఇచ్చింది. అయితే, ఈ చట్టం రాక ముందునుంచే చుక్కల భూముల సమస్య ఉంది. 1954 నుంచే చుక్కల భూములను ఆక్రమించుకున్నవారు వాటిని తమ అధీనంలోనే ఉంచుకున్నారు. క్రయవిక్రయాలు కూడా జరిగాయి. కొన్నాళ్ల క్రితం చుక్కల భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. దీనిపై హైకోర్టులో కొంత మంది కేసులు దాఖలు చేశారు. అప్పుడు హక్కు పత్రాలున్న వారికి న్యాయం చేయాలని హైకోర్టు ప్రబుత్వాన్ని ఆదేశించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేబినెట్‌లోనూ చాలా సార్లు చర్చించారు.

చుక్కల భూములు 24 లక్షల ఎకరాలున్నాయి. వీటిలో మూడున్నర లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. ఈ భూమిపై తమకు సర్వహక్కులు ఉన్నాయంటూ దాదాపుగా రెండు లక్షల మంది క్లెయిమ్‌ చేస్తున్నారు. ప్రత్యేక చట్టం తెచ్చి అన్ని పత్రాలు ఉన్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే లక్షల ఎకరాల చుక్కల భూముల్లో ఏ పత్రాలూ లేకుండా ఉన్న వారి, నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి? తాజా పరిస్థితుల్లో ఆభూములను స్వాధీనం చేసుకోవడం కష్టతరమని, బలవంతంగా ఆ పనిచేస్తే శాంతిభద్రతల సమస్యలు కూడా రావొచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యనే… శివాజీ హైలెట్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా.. సమస్యను పరిష్కారం కాకుండా చేసి ప్రభుత్వంపై బురద జల్లాలనుకుంటున్నారు… ఆయా భూముల్లో ఉన్న వారందర్నీ ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. శివాజీకి తెలుసో తెలియదో కానీ… ఆయనకు ఒక్క శాతమే సమస్య గురించి తెలిసి ఉంటుంది. ప్రభుత్వానికి వంద శాతం తెలిసి ఉంటుంది. శివాజీ హడావుడి చేయాల్సిన అవసరం లేదు.

పరిస్థితి చూస్తూంటే.. శివాజీ ఎక్కడో చుక్కల భూముల్ని కొని.. వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నాడని.. అందుకే.. అందర్నీ కలిపి.. ఈ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో.. శివాజీనే చెప్పాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.