వైసీపీలోకి శిల్పా? ఇదీ బాబు వ్యూహ‌మేనా?

నంద్యాల‌.. ప్ర‌ధాన మంత్రిగా పీవీ న‌ర‌సింహారావు అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం. సీమ‌లో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న ప్రాంతం. దాని ప‌రిథిలోని నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. పార్టీ దూకుళ్ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. అక్క‌డి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో తెలుగుదేశంలోకి వెళ్ళ‌డం.. రెండు నెల‌ల క్రితం ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఆయ‌న కుమార్తె అఖిల‌ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఇప్ప‌డు నంద్యాల అసెంబ్లీ సీటు త‌మ‌కు కావాల‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి కోరుతున్నారు. అది వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతాన‌ని శిల్పా సోద‌రులు చంద్ర‌బాబును బెదిరించారు. దిగి వ‌చ్చిన చంద్ర‌బాబు మాటివ్వ‌డం వారిని తాత్కాలికంగా శాంత‌ప‌రిచింది. ఓప‌క్క‌న ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌కొచ్చేస్తోంది. చంద్ర‌బాబు ఏమీ తేల్చ‌క‌పోతుండ‌డం శిల్పా సోద‌రుల‌లో అసంతృప్తిని ఎగ‌దోసింది. మ‌ళ్ళీ ఫిరాయింపు రాగాన్ని అందుకున్న‌ట్లే ఉంది. కొద్ది రోజుల్లోనే బ‌హుశా ఈనెల 14నే వారు ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం అయిపోయిందంటున్నారు. చంద్ర‌బాబును దెబ్బ‌కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా కాసుక్కూర్చున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం వారికి గేట్లు తెరిచేసిన‌ట్లుగానే ఉంది. భూమా కుటుంబం వైసీపీ నుంచి నెగ్గి, టీడీపీకి వెళ్ళి.. అక్క‌డి వేదిక‌పై జ‌గ‌న్‌పై కుప్పించిన విమ‌ర్శ‌లు బ‌హుశా ప్ర‌తిప‌క్ష నేత‌ను రెచ్చ‌గొట్టి ఉండ‌వ‌చ్చు. అందుకే నంద్యాల ప్రాంతంలో బలీయ‌మైన నేత‌లైన శిల్పా సోద‌రుల‌ను పార్టీలో చేర్చుకోవ‌డానికి మొగ్గు చూప‌డానికి ఇదే కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చు. శిల్పా వైసీపీలో చేర‌తారా చేర‌రా అనేది ఇక్క‌డ స‌మ‌స్య కాదు. ఒంటి చేత్తో అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునే స‌త్తా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌క్క పార్టీ నాయ‌క‌గ‌ణాన్ని ఆహ్వానించ‌డానికి అర్రులు చాస్తుండ‌డ‌మే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన‌ప్పుడు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయించి గెలిపించుకున్న వైయ‌స్ఆర్ వార‌సుడిలో ఆ స‌త్తా ఏమైంది.. ప‌రాయి పార్టీ వారిని ఎన్నిక‌ల్లో గెలిపించుకోడానికి పాటుప‌డాల‌నుకోవ‌డం ఆయ‌న‌కు చిన్న‌త‌నంగా అనిపించ‌డం లేదా? అనుకున్న దానిని ముక్కుసూటిగా చేసుకుపోయే మ‌న‌స్త‌త్వ‌మున్న వైయ‌స్ఆర్ ల‌క్ష‌ణాన్ని పుణికిపుచ్చుకున్న జ‌గ‌న్ చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాల‌నే థ్యేయంతో శిల్పా మోహ‌న్ రెడ్డికి ఎర్ర తివాచీ ప‌ర‌చ‌డం దేనికి సంకేతమో ఆలోచించుకోవాలి. దీని వెనుక కూడా చంద్ర‌బాబు వ్యూహ‌ముందేమో ఆలోచించుకోవాలి. 20కి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిపోయిన సంఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న గ‌మ‌నంలో ఉంచుకోవాలి. గొట్టిపాటి ర‌వికుమార్ ఒక్క‌డు చాలు.. వైసీపీలో నెగ్గి, టీడీపీలోకి వెళ్ళిపోయిన తీరే ఉదాహ‌ర‌ణ‌. 2009 ఎన్నిక‌ల్లో కూడా వైయ‌స్ ఇలాంటి ప్ర‌యోగాన్నే అసిఫ్‌న‌గ‌ర్‌లో చేశారు. దానం నాగేంద‌ర్‌ను టీడీపీనుంచి పోటీచేయించారు. కానీ ఆయ‌న అక్క‌డ ఓడిపోయారు. వెంట‌నే నాగేంద‌ర్ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చేశారు. ఇప్పుడు శిల్పా సోద‌రుల‌ను వైసీపీ నుంచి గెలిపించి, తిరిగి టీడీపీలోకి వ‌చ్చేలా చేయ‌డ‌మే చంద్ర‌బాబు ప్ర‌స్తుత వ్యూహంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే ఎంత త‌ల్ల‌క్రిందులుగా త‌ప‌స్సు చేసినా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని ఓడించ‌డం క‌ష్ట‌మ‌నే నిర్థార‌ణ‌కు ఆయ‌న వ‌చ్చేశారంటున్నారు. అందుక‌నే ఈ వ్యూహాన్ని అనుస‌రించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com