పుష్పక విమానం, విచిత్రసోదరులు, భైరవద్వీపం లాంటి క్లాసిక్ సినిమాల్ని అందించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. వయోభారంతో చాలా కాలం నుంచి ఆయన దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. సింగీతం మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారని, త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారని, స్వప్న సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుగు360 ఇది వరకే చెప్పింది. ఇప్పుడు అదే నిజం అవ్వబోతోంది. సింగీతం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. సింగీతం దర్శకత్వంలో వచ్చే 61వ సినిమా ఇది.
పూర్తిగా కొత్తవారితో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. సంగీతం అందించే బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ కి దక్కినట్టు తెలుస్తోంది. సీనియర్ టెక్నీషియన్లే ఈ చిత్రానికి పని చేసే అవకాశం ఉంది. సింగీతం సినిమాలు దాదాపు ప్రయోగాత్మకాలే. ఈ కథ కూడా అలాంటిదే కావొచ్చు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి’ చిత్రానికి సింగీతం పని చేశారు. ఇప్పుడు ‘కల్కి 2’లోనూ ఆయన పాత్ర వుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ఓ సినిమా చేస్తున్నారన్నమాట. సింగీతం లాంటి లెజెండరీ దర్శకుడు, ఈ వయసులో మరోసారి మెగాఫోన్ పట్టుకొంటున్నారంటే అది అరుదైన సంగతే.
