బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందాయి. హరీష్ రావు తర్వాత ఆయనకే నోటీసులు జారీ చేశారు. శుక్రవారం పదకొండు గంటలకు జూబ్లిహిల్స్ ఏసీపీ ఆఫీసుకు వచ్చేయాలని ఆయనకు నందినగర్ ఇంట్లో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హరీష్ రావును కేవలం ఒక సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారు పోలీసులు. విచారణలో ఆయన ట్యాపింగ్ చేయించారన్నదాని కన్నా.. ఆయనకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా గతంలో ట్యాపింగ్‌కు గురయ్యాయని కొన్ని సాంకేతిక ఆధారాలను ఆయన ముందు ఉంచినట్లు సమాచారం. దీనివల్ల హరీష్ రావు ఈ కేసులో బాధితుడిగా లేదా సాక్షిగా పరిగణినలోకి వస్తారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం విచారణాధికారుల కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కేటీఆర్ పై ప్రధానంగా ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, రాజకీయ ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టడంలో కేటీఆర్ పాత్ర ఏంటనే దానిపై సిట్ దృష్టి సారించింది. నిందితులైన పోలీసు అధికారులు, కేటీఆర్ మధ్య ఉన్న సంబంధాల గురించి అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెటప్, ఆ డేటా ఎక్కడికి తరలించబడింది, ఆ నివేదికల ఆధారంగా రాజకీయ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అనే అంశాలపై కేటీఆర్‌ను విచారించనున్నారు.
హరీష్ రావు కేసులో పోలీసులు సమాచారం సేకరిస్తే, కేటీఆర్ కేసులో ఆయనను ఈ కుట్రలో భాగస్వామిగా చూస్తూ విచారణ జరిపే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం లేదు. ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.


