ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి న్యాయం చేసేందుకు సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఆయన సన్నిహితుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తరవాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా ఉండేవారు. ఆయనను కంట్రోల్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించి.. ఓటుకు నోటు కేసు పేరుతో ట్రాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన ఫోన్లపై నిఘా కొనసాగిందని స్వయంగా రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు. ఇప్పుడు వాటికి ఆధారాలను సిట్ బయట పెట్టే అవకాశం ఉంది.
అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్న అప్పటి బీఅర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరికి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని నిందితులు ఇచ్చినట్లుగా సిట్ అనుమానిస్తోంది. అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. వీరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అనుమానిస్తున్నారు.
