తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సిట్ , ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నంది నగర్‌లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. సీఆర్పీసీసీ 160 సెక్షన్ కిందనే నోటీసులు ఇచ్చారు.
కొంత కాలంగా సిట్ నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతూనే ఉంది. శుక్రవారమే ఆయన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అనే కోణంలో ఆయనను విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జోగినపల్లి సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వీరి ముగ్గురికీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి, వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో విచారణ ఎదుర్కొన్న నేతలు చెప్పిన విషయాలు, అరెస్టయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాలను సరిపోల్చేందుకు కేసీఆర్ విచారణ అత్యంత కీలకం కానుంది.
ప్రభుత్వ నిఘా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ అసమ్మతి నేతలు , వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నిధుల మళ్లింపు, ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకోవడానికి ఈ ట్యాపింగ్‌ను ఉపయోగించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే సాగిందని అరెస్టయిన అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఇప్పుడు కేసీఆర్ పాత్రపై విచారణ అనివార్యమైంది.
రాష్ట్ర చరిత్రలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వనుంది.


