సీతారామం రివ్యూ: ప్రేమ కావ్యం

SIta Ramam movie review telugu

తెలుగు360 రేటింగ్ :3.25/5

ప్రేమ వేరు.. యుద్ధం వేరు.
కానీ కొన్నిసార్లు ప్రేమ కోసం యుద్ధం చేయాల్సివ‌స్తుంది.
ఇంకొన్నిసార్లు.. యుద్ధంలోనూ ప్రేమ క‌నిపిస్తుంది.
ఆ రెండూ క‌లిస్తే – సీతారామం.
ప్రేమ‌, యుద్ధం అనే రెండు వేర్వేరు నేప‌థ్యాల్ని క‌లిపిన ఉత్త‌రం – సీతారామం.
దేశాన్ని ప్రేమించే ఓ సైనికుడికి – దేశ‌మంత ప్రేమ‌ని ఆ సైనికుడిపై ధార‌బోసే ఓ అమ్మాయికీ మ‌ధ్య జ‌రిగిన ప్ర‌యాణం.. సీతారామం.

పాకిస్థాన్‌లో ఓ ఉత్త‌రం.. ఇర‌వై ఏళ్లుగా ఎదురు చూస్తుంటుంది.. తాను చేరాల్సిన గ‌మ్యం కోసం. లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్క‌ర్ సల్మాన్‌) రాసిన ఉత్త‌రం అది. హైద‌రాబాద్‌లో ఉన్న‌ సీతామాల‌క్ష్మి కోసం. ఆ ఉత్త‌రం చేర్చాల్సిన బాధ్య‌త – అఫ్రిన్ (ర‌ష్మిక‌)పై ప‌డుతుంది. తాత‌య్య (స‌చిన్ ఖేడ్క‌ర్‌) ఆఖ‌రి కోరిక అది. తాత‌య్య పై ప్రేమ‌తో కాదు.. ఆ ఉత్త‌రం చేర్చాల్సిన చోట చేరిస్తే త‌ప్ప, తాత‌య్య ఆస్తిలో చిల్లి గ‌వ్వ కూడా త‌న‌కు రాదు. అందుకే ఇష్టం లేక‌పోయినా ఆ ఉత్త‌రం ప‌ట్టుకొని హైద‌రాబాద్ వ‌స్తుంది. ఒకొక్క‌రినీ క‌లుస్తుంటుంది. ఆ ప్ర‌యాణంలో రామ్ గురించీ, సీతామాల‌క్ష్మి గురించీ కొత్త కొత్త విష‌యాలు, అస‌లు సిస‌లైన నిజాలు తెలుస్తుంటాయి. లెఫ్ట్ నెంట్ రామ్ ఓ అనాథ‌. సైన్యం – దేశం త‌ప్ప ఇంకేం తెలీవు. హ‌ఠాత్తుగా సీతామాల‌క్ష్మి పేరుతో ఉత్త‌రాలు వ‌స్తుంటాయి. ప్ర‌త్యుత్త‌రం రాద్దామంటే చిరునామా ఉండ‌దు. ఆ ఉత్తరాల్ని చ‌ద‌వ‌డం, మ‌రో ఉత్త‌రం కోసం ఎదురుచూడ‌డం.. ఇదే రామ్ దిన‌చ‌ర్య అయిపోతుంది. స‌డ‌న్‌గా.. ఓ రోజు సీతామాల‌క్ష్మిని క‌లుస్తాడు కూడా. ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం మొద‌ల‌వుతుంది, అది ప్రేమ అవుతుంది. `న‌న్ను పెళ్లి చేసుకుంటావా..` అని అడిగిన ప్ర‌శ్న‌కు సీత నుంచి ఎలాంటి స‌మాధారం రాదు. దానికి కార‌ణం వేరే ఉంది. అలా క‌లుసుకొన్న సీత‌, రామ్‌… మ‌ళ్లీ విడిపోతారు. సీత కోసం రామ్ రాసిన ఉత్త‌రం పాకిస్థాన్‌లో ఎందుకు ఆగిపోయింది. ఆ ఉత్త‌రాన్ని చేర‌వేసే బాధ్య‌త భుజాన వేసుకొన్న అఫ్రిన్‌.. త‌న బాధ్య‌త నెర‌వేర్చిందా, లేదా? అస‌లు రామ్, సీత ఎందుకు విడిపోయారు? వారిద్ద‌రికీ పెళ్లి జ‌రిగిందా, లేదా? అనేది మిగిలిన విష‌యాలు.

యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ అని ఈ సినిమాకి ట్యాగ్ లైన్ పెట్టారు. అదెందుకు అనేది సినిమా చూశాకే అర్థం అవుతుంది. ఈ ట్యాగ్ లైన్‌కి కూడా ద‌ర్శ‌కుడు న్యాయం చేశాడు. యుద్ధం – ప్రేమ ఈ రెండు అంశాల్నీ బాలెన్స్ చేస్తూ ఈ క‌థ చెప్పాడు. యుద్ధ వాతావ‌ర‌ణంతో క‌థ మొద‌ల‌వుతుంది. పాకిస్థాన్‌లోని తీవ్ర‌వాదులు క‌శ్మీర్‌లో ఎలా విధ్వంసం సృష్టించాల‌నుకొన్నారు? అనే పాయింట్ తో క‌థ చెప్ప‌డం మొద‌లెట్టాడు ద‌ర్శ‌కుడు. అయితే మ‌న‌సులో మాత్రం `సీతా రామం`ల ప్రేమ క‌థ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అనే ఆస‌క్తితోనే ప్రేక్ష‌కుడు సినిమా చూస్తుంటాడు. యుద్ధ నేప‌థ్యానికీ, క‌శ్మీర్ అల్ల‌ర్ల‌కీ అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చాడో? అనిపిస్తుంది.కానీ.. ఆ లెంగ్త్ కీ చివ‌ర్లోనే జ‌స్టిఫికేష‌న్ చేశాడు ద‌ర్శ‌కుడు.

ఎప్పుడైతే రామ్ కి ఉత్త‌రాలు రావ‌డం మొద‌ల‌వుతుందో అప్ప‌టి నుంచీ ఈ క‌థ ల‌వ్ స్టోరీలా మారిపోతుంది. సీత‌ని వెదుక్కొంటూ రామ్ వెళ్ల‌డం, వారిద్ద‌రి జ‌ర్నీ – పొయెటిక్‌గా తీశాడు. రామ్ – సీత మాట్లాడుకుంటుంటే, పొయెట్రీలా అనిపిస్తుంటుంది. వాళ్ల మాట‌లూ ఉత్త‌రం – ప్ర‌త్యుత్త‌రం లానే అనిపిస్తాయి. వెన్నెల కిషోర్‌, సునీల్ లాంటి వాళ్ల‌ని తీసుకొచ్చి కాస్త కామెడీ ట‌చ్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు కానీ, అది కుద‌ర్లేదు. పైగా వారిద్ద‌రి గెట‌ప్పులూ ఎందుకో సూట‌వ్వ‌లేద‌నిపిస్తుంది. అది మిన‌హా ఫ‌స్టాఫ్ లో కంప్లైంట్స్ ఏమీ ఉండ‌వు. పాట‌లెప్పుడొస్తాయో కూడా తెలియ‌నంత‌గా క‌థ‌లో భాగ‌మైపోయాయి. ఇంట్ర‌వెల్ లో ఓ ఊహించ‌ని ట్విస్ట్ వ‌స్తుంది. దాంతో క‌థ‌కు బ్రేక్ ప‌డుతుంది.

ఇదో ల‌వ్ స్టోరీ. అయితే.. అందులోనూ కొన్ని ఆసక్తి క‌ర‌మైన ట్విస్టులు రాసుకొని, ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్‌లో అస‌లు క‌థ మొల‌వుతుంది. ఎమోష‌న్స్ పీక్స్‌కు వెళ్తాయి. సీత నేప‌థ్యం తెలిశాక ఆ పాత్ర‌పై ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే సీతని ప్రేమించ‌డం మొద‌లెడ‌తారో, అక్క‌డి నుంచీ ల‌వ్ స్టోరీనీ ప్రేమిస్తుంటారు ప్రేక్ష‌కులు. రామ్ త‌న‌కు ఎవ‌రైతే ఉత్త‌రాలు రాశారో… వాళ్లంద‌రినీ వెళ్లి క‌ల‌వ‌డం – చివ‌ర్లో ఓ చెల్లె ద‌గ్గ‌ర‌కు వెళ్లి, అన్న‌లా త‌న బాధ్య‌త తీసుకోవ‌డం హృద్యంగా అనిపిస్తుంది. విష్ణు శ‌ర్మ పాత్ర ఈ క‌థ‌కు అత్యంత కీల‌క‌మైన‌ది. పైకి సాదా సీదాగా, సామాన్యంగా క‌నిపించిన ఈ పాత్ర‌.. క‌థ న‌డుస్తున్న కొద్దీ కొత్త ముఖాలు ములుముకుంటుంటుంది. ఆ పాత్ర వ‌ల్ల క‌థ స్వ‌రూప‌మే మారిపోతుంది. దేశం కోసం ప్రాణాన్నీ, ప్రేమ‌నీ త్యాగం చేస్తున్న‌ప్పుడు లెఫ్ట్నెంట్ రామ్ ఎంత ఉన్న‌తంగా క‌నిపిస్తాడో, అత‌ని కోసం ఎదురు చూపుల్లో బ‌తికేసే – సీత‌ని చూసినప్పుడు కూడా అంతే గొప్ప‌గా అనిపిస్తుంది. క‌థానాయ‌కుడు, క‌థానాయిక పాత‌ల్ని స‌మానంగా ప్రేమించిప్పుడే ఇలాంటి పాత్ర‌ల పంప‌కం జ‌రుగుతుందేమో..? అఫ్రిన్ పాత్ర‌కు ఇచ్చిన ముగింపు చూస్తే, ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. అస‌లు ఆ పాత్ర‌ని అలా (ఎలా అనేది సినిమా చూశాక తెలుసుకోవాలి) ముగించ‌డం వ‌ల్ల క‌థ‌కు మ‌రింత అందం వ‌చ్చింది. అదొక్క‌టే కాదు. ప్ర‌తీ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు తెలివిగా వాడుకొన్నాడ‌నిపిస్తుంది. చివ‌రి 30 నిమిషాలూ ఈ క‌థ స్థాయిని పెంచుకొంటూ వెళ్లాయి. `ఇప్పుడు మీరు క్ష‌మాప‌ణ‌లు అడ‌క్క‌పోతే చ‌చ్చిపోయేట్టుఉన్నాను` అని అఫ్రిన్ చెబుతున్న‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే, నీళ్లు గిర్రున తిరుగుతాయి. ఓ ప్రేమ‌క‌థ‌కు ఉద్వేగ‌భ‌రిత‌మైన ముగింపు ల‌భిస్తే అలాంటి క‌థ‌లు చాలా కాలం వ‌ర‌కూ గుర్తుండిపోతాయి. అలాంటి క‌థ‌ల్లో `సీతారామం` కూడా చేరుతుంది.

దుల్క‌ర్ ఈ క‌థ‌కు ప్రాణంపోశాడు. రామ్ పాత్ర‌లో.. అల్లుకుపోయాడు. త‌న అందం, మాట‌తీరు, న‌డుచుకొనే ప‌ద్ధ‌తి, ఎమోష‌న్స్ పండించిన తీరు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు. దుల్క‌ర్ క‌ళ్లు రొమాన్స్ ప‌లికిస్తాయి. ఆ క‌ళ్ల‌ల్లో ఎంత ఉద్వేగముందో ఈ సినిమాలో మ‌రోసారి తెలుస్తుంది. మృణాల్ స్లో పాయిజ‌న్‌లా ఎక్కేస్తుంది. డబ్బింగ్ చెప్ప‌డంలో ఎంచుకొన్న స్టైల్ వ‌ల్ల ఏమో.. మృణాల్ పాత్ర కాస్త ఎవేగా క‌నిపిస్తుంది. కానీ.. మెల్ల‌మెల్ల‌గా ఆ పాత్ర‌నీ, దాని స్వ‌భావాన్నీ అర్థం చేసుకొన్న త‌ర‌వాత సీత పాత్ర‌నీ ప్రేమించేస్తాం. పొగ‌రున్న అమ్మాయి పాత్ర‌లో అఫ్రిన్ క‌నిపించింది. మెల్ల‌మెల్ల‌గా ఆ పాత్ర‌లో వ‌చ్చిన మార్పునీ బాగానే క్యారీ చేయ‌గ‌లిగింది. సుమంత్ ది స‌ర్‌ప్రైజింగ్ పాత్రే. త‌ను బాగా చేశాడు. ప్ర‌తీ చిన్న పాత్ర‌కూ.. పేరున్న వాళ్ల‌ని తీసుకోవ‌డం వ‌ల్ల ఒక్క సీన్ అయినా స‌రే, గుర్తుండిపోతుంది.

టెక్నిక‌ల్‌గా ఈ సినిమాకి వంక పెట్ట‌లేం. 1965, 1985 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ కాలంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లిపోయారు. ఏవి సెట్లో, ఏవి రియ‌ల్ లొకేష‌న్లో చెప్ప‌డం క‌ష్టం. పాట‌లు ఇది వ‌ర‌కే హిట్టు. `ఇంతందం` పాట వెండి తెర‌పై మ‌రింత బాగుంది. క‌శ్మీర్ అందాల్ని మ‌నోహ‌రంగా చూపించారు. మాట‌లు కొన్నిసార్లు క‌విత్మంలా వినిపించాయి. ఇన్ని విభాగాల్లో శ్ర‌ద్ధ తీసుకొన్న టీమ్‌ – ఇర‌వై ఏళ్ల లెట‌ర్ ని తెల్ల‌ని మ‌ల్లెపువ్వులా చూపించ‌డం మాత్రం అత‌క‌లేదు. హ‌ను ప్రేమ‌క‌థ‌ల్ని అందంగా తీయ‌డంలో నేర్ప‌రి. ఈసారి చాలా బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకొన్నాడు. విభిన్న పార్వ్శాలున్న క‌థ దొర‌క‌డం, వైజ‌యంతీ మూవీస్ లాంటి సంస్థ తోడ‌వ్వ‌డం త‌న‌కు మ‌రింత బ‌లాన్నిచ్చింది. తొలి స‌గంలో అక్క‌డ‌క్క‌డ ఫ్లాట్ నేరేష‌న్ బోర్ కొట్టించినా – రెండో స‌గంలో భావోద్వేగాల్ని పీక్స్‌లోకి తీసుకెళ్లి, పాత్ర‌ల‌న్నింటినీ స‌మ‌ర్థంగా వాడుకొని – ఓ ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ తో క‌థ‌ని ముగించాడు.

ప్రేమ‌క‌థ‌ల‌కు ఈరోజుల్లో అర్థం మారిపోయింది. సీన్లో నాలుగైదు లిప్ లాక్‌లు లేక‌పోతే అస్స‌లు ప్రేమ‌క‌థే అనిపించుకోదు. ఇలాంటి త‌రుణంలో వ‌చ్చిన స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ ఇది. ప్రేమించిన అమ్మాయిని `గారూ.. మీరూ` అని పిల‌వ‌డం ద‌గ్గ‌ర్నుంచి, ఒక్క ముద్దు స‌న్నివేశం కూడా లేకుండా, ఎక్క‌డా త‌ల దించుకొని – దొంగ చూపులు చూడాల్సిన ప‌రిస్థితి తీసుకురానివ్వ‌కుండా – ఓ క్లీన్ ల‌వ్ స్టోరీని తీసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని అభినందించాలి.

తెలుగు360 రేటింగ్ :3.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close