రాజమహేంద్రవరం పేపరు మిల్లులో పాత సినిమా కథ!

పట్టించుకోని జమిందారు…మిల్లులో మేనేజర్ల ఇష్టారాజ్యం…ఇదేమిటని నిలదీసే కార్మికుల మీద చర్యలు…ఈగోలు దెబ్బతిన్న కక్షసాధింపులు…భూస్వాములు పారిశ్రామికవేత్తలైన దశలో కాస్త అక్షరజ్ఞానం, కొంత వ్యవహార లౌక్యం వున్న మేనేజిమెంటు వాళ్ళ కుయుక్తులు, కార్మికుల తిరుగుబాట్లు….యాభై అరవై ఏళ్ళ క్రితం సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు వుండేవి.

రాజమహేంద్రవరంలోని ”’ఇంటర్నేషనల్ పేపర్ ” మిల్లులో ఇపుడు ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి.

ఒప్పందం ప్రకారం అర్హులైన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండు చేసినందుకు 33 మంది ఉద్యోగులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. మిగిలిన 900 మంది రెగ్యులర్ ఉద్యోగుల్లో ఏవిధమైన ఆందోళనా చేయబోమని రాసి ఇచ్చిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. 1400 మంది కాంట్రాక్టు పనివారికి ఏపనీ ఇవ్వకుండా కూర్చోబెడుతున్నారు. ఇలా 9 రోజులుగా పేపరు మిల్లులో 5000 టన్నుల పేపర్ ఉత్పత్తి నిలచిపోయింది. ఇక్కడ రోజుకి 550 నుంచి 600 టన్నుల కాగితం తయారౌతుంది.

2016 జూలై 23న మిల్లు యాజమాన్యానికీ, కార్మిక సంఘాలకు వ్రాతపూర్వకంగా జరిగిన ఒప్పందం ప్రకారం మిల్లు ఉద్యోగాల్లో బయటనుండి నియమించు కున్నవారి సంఖ్య తో సమంగా కార్మికులు పిల్లల్లోఅర్హులైన వారికి (1:1)
ఉద్యోగాలు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా మిల్లు యాజమాన్యం బయట క్యాంపస్ సెలక్షన్ లో 22మందిని నియమించుటకు నిర్ణయించి మిల్లు కార్మికుల పిల్లలు అర్హులైన 13మందిలో కేవలం ముగ్గురినిమాత్రమే సెలెక్ట్ చేసి నియమించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా ఈ అంశంపై చర్చించేందుకు మిల్లులో గల పది కార్మికసంఘాల ప్రతినిధులను అనుమతించి ఆ సమావేశంలో యాజమాన్యం తన నిర్ణయమే ఫైనల్ అని ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం మిగతా10మంది కార్మికులపిల్లలను నియమించాలని సమావేశంలో పాల్గొన్నయూనియన్ల ప్రతినిధులు పట్టుబట్టారు. ఇది సహించలేక యాజమాన్యం పోలీసుఅధికారులను రప్పించారు. పోలీసుఅధికారులు మధ్యవర్తిత్వంతో 2రోజులలో పరిష్కరించుకొనేలా సమావేశం తీర్మానించింది.

ఏవిధమైన అవాంఛనీయ సంఘటన జరగకపోయినా ఏవిధమైన పోలీసు కేసులులేకపోయినా సమావేశంలో పాల్గొన్నయూనియన్ల ప్రతినిధులు 33 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పర్మినెంటు కార్మికులంతా స్వచ్ఛందంగా యాజమాన్య చర్యకు నిరసనగా విధులు బహిష్కరించారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తోసహా నగరంలోని రాజకీయ పార్టీల నాయకులు పలువురు యాజమాన్యాన్ని కలసి సస్పెన్షన్ లను వెనక్కి తీసుకోవాలని మిల్లులో నార్మల్సీ ని కొనసాగించాలని చర్చలు ద్వారా ట్రైనీ ఉద్యోగనియామకాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

యాజమాన్యం సానుకూలంగా స్పందించనందున 10వ తేదీన పర్మినెంటు కార్మికులంతా స్వచ్ఛందంగా విథులుబహిస్కరించారు. దీనితో యాజమాన్యం 11వతేదీ నుండి పర్మినెంటు కార్మికులను డ్యూటీ లకి అనుమతించకుండా ప్రతిష్టంభనను సృష్టించింది.

ఈ వివాదాన్ని పరిష్కరించడానికి డిప్యూటీ లేబర్ కమీషనర్ ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకూ జాయింట్ లేబర్ కమీషనర్ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికీ మిల్లు నుంచి యాజమాన్యం ప్రతినిధులు ఏ ఒక్కరూ హాజరు కాలేదు.

స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పడిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే పది పెద్ద పేపరు మిల్లుల్లో ఒకటి. ”బంగూర్లు” దీన్ని స్ధాపించి నడిపించారు. గ్లోబలైజేషన్ లో డిజిన్వెస్ట్ మెంట్లు మొదలయ్యాక రాష్ట్రప్రభుత్వం మిల్లులో తనకున్న కొద్దిపాటి వాటాలనూ అమ్మేసుకుంది.

70 ఏళ్ళ చరిత్ర వున్న (రాజమండ్రి) ఎపిపిఎం (ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు)
బలమైన కార్మిక సంఘాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకూ అనుబంధ కార్మిక సంఘాలు మిల్లులో వున్నాయి.

30 దేశాలలో పేపర్ మిల్లులు వున్న ఇంటర్నేషనల్ పేపర్ సంస్ధ బంగూర్ల నుంచి ఈ మిల్లుని కొనేసింది. 600 కోట్లరూపాయల పెట్టుబడులతో ఆధునీకరించింది.

ప్రారంభోత్సవంలో తప్ప కంపెనీ చైర్మన్ లేదా డైరక్టర్లు ఈ మిల్లులో కనబడలేదు. వారు ఇండియా ఎప్పుడు వస్తారో తెలియదు. తమిళనాడు ప్రొఫెషనల్స్ హైదరాబాద్ లో వుండి రాజమండ్రి మిల్లుని నమ్మకమైన వారి అధికారుల కళ్ళూ, చెవులతో మిల్లుని నడిపిస్తారు.

ఉద్యోగుల పిల్లల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చే సాంప్రదాయం మొదటి నుంచీ వుంది. కొత్తయాజమాన్యం కూడా అందుకు లిఖితపూర్వకంగా అంగీకరించింది. మరేమైందో కాని ఒప్పుందాన్ని పక్కనపెట్టేశారు. అదేమిటని అడిగినవారిని సస్పెండ్ చేశారు. పట్టుదలకుపోయి ఉత్పత్తిని కూడా ఆపేశారు. ప్రజానాయకులైన ఎమ్మెల్యేల మాట వినని యాజమాన్యం ప్రతినిధులకు కార్మికశాఖ అధికారులంటే ఏమాత్రం ఖాతరే లేదు.

రాజమండ్రిమిల్లులో వివాదం ఆర్ధికాంశాలతో ముడిపడి వున్నది కాదు. ఉత్పత్తినే ఆపుకున్న స్తోమత గల యాజమాన్యం పంతంలో, అడ్డగోలు పట్టుదలలో కార్మికులను నోరెత్తనీయరాదన్న ఆలోచన వుంది. కార్మికుల ఆందోళనలో గౌరవాన్ని హక్కుల్కి నిలుపుకోవాలన్న ఆరాటం వుంది.అయితే, ఇన్వెస్టర్లకు అనుకూలమైన మోదీ, బాబు ప్రభుత్వాల్లో కార్మికుల గోడు మరో అరణ్యరోదన అవుతుందో? కార్మికులకు న్యాయం జరుగుతుందో ఇప్పటికైతే తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com