గాలి జనార్దన్ రెడ్డిని మారుస్తాడట సోము వీర్రాజు..!

భారతీయ జనతా పార్టీ నేతలంటే అతిశయోక్తులకు ఆనవాళ్లుగా మారుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టినప్పుడల్లా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరిసింహారావు చెప్పే మాటలు కోటలు దాటి పోతూంటాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా.. అలాంటి మాటలు చెబుతూంటారు.. కానీ సోము వీర్రాజు మాటలు మాత్రం మరింత ప్రత్యేకంగా ఉంటాయి. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి లాంటి అవినీతి పరులను మార్చే ప్రయత్నం చేస్తామన్నారు. గాలి జనార్దన్ రెడ్డినే డబ్బు కట్టలతో అందర్నీ మార్చే ప్రయత్నం చేస్తారు. చివరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా లంచాలిచ్చి…మార్చేశారు. అలాంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని..వాళ్లను మార్చే ప్రయత్నం చేస్తామంటున్నారు సోము వీర్రాజు.

అంతే కాదు.. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన కన్నా లక్ష్మినారాయణకు ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై మరింత విచిత్రంగా స్పందించారు. కన్నా అనే కాకుండా… బీజేపీలోకి వచ్చే కాంగ్రెస్ నేతలందరికీ బీజేపీ భావజాలం ఎక్కిస్తారట. అదేదో రక్తం అయినట్లు.. ఇన్‌స్టంట్ గా సిరంజీలతో ఎక్కించేయగలిగినట్లు.. బీజేపీ భావజాలాన్ని కాంగ్రెస్ నేతలకు ఎక్కిస్తారట. కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది కాబట్టే.. కన్నా, పురంధేశ్వరి, కావూరి లాంటి నేతలు బీజేపీలోకి వచ్చారు. కానీ బీజేపీ భావజాలంపై ఆసక్తితో కాదు. పదవులు ఇస్తే ఉంటారు.. లేకపోతే లేదు. కన్నా లక్ష్మినారాయణ చేసింది అదే కదా… ఏపీ అధ్యక్ష పదవి దక్కదని తేలిన తర్వాత వైసీపీలోకి లాంగ్ జంప్‌కు సిద్ధమయ్యారు. మళ్లీ పదవి ఇస్తామంటే ఇండిపోయారు. మరి నాలుగేళ్ల పాటు కన్నా.. పార్టీలో ఉన్నా.. బీజేపీ భావజాలాన్ని ఎందుకు ఎక్కించలేకపోయారు..?

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ … తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని కూడా చెప్పామన్నారు సోము వీర్రాజు. ఇది మరీ విచిత్రంగా ఉంది.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ పొత్తు చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంది సోము వీర్రాజు,. ఇంత చేసి…. పవన్ కల్యాణ్ కు టీడీపీతో పొత్తు వద్దని చెప్పారట సోము వీర్రాజు. అంటే.. సోము పవన్ కల్యాణ్.. అసలు తమ పార్టీ వైపు రావద్దని చెప్పారా..?. అప్పుడు అలా చెప్పిన సోము వీర్రాజు.. ఇప్పుడు మాత్రం పవన్ తో పొత్తుకు రెడీ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటున్నారు. కామెడీ కాకపోతే.. అప్పుడు పవన్ కు పొత్తు అని చెప్పారేమో సోము వీర్రాజు… ఇప్పుడు పవన్ కు బీజేపీతో వద్దు అని చెప్పేందుకు వేల మంది రెడీగా ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com