విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి, జోన్ ఆపరేషన్లకు సంబంధించి తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీల్లో కీలకమైన ఈ జోన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడంతో కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
నివిశాఖలోని ముడసర్లోవ వద్ద జోనల్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి గత ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి, తాత్కాలికంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కి చెందిన ది డెక్ భవనంలోని రెండు అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయాల కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. సుమారు 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయం నుంచి పరిపాలనా పనులను మొదలుపెట్టడం ద్వారా జోన్‌ను ఆపరేషన్లోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ జోన్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లోని కొంత భాగం దీని పరిధిలోకి వస్తుంది. రైల్వే కార్యకలాపాల వికేంద్రీకరణ వల్ల కొత్త రైళ్ల మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా విశాఖను రైల్వే హబ్‌గా మార్చేందుకు అమరావతి, విజయవాడ, తిరుపతిలలో మెగా కోచింగ్ టెర్మినల్స్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఏప్రిల్ 1 నాటికి గెజిట్ నోటిఫికేషన్ వెలువడితే ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరినట్లవుతుంది. ఇప్పటికే ఈ జోన్ కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపులు కూడా జరిగినందున కేంద్రం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం విశాఖ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
