“ఎన్టీఆర్ ఆత్మ”పై అందరికీ ఎంత అభిమానమో..?

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అనైతికమా..? మరి వేర్పాటువాద పీడీపీతో బీజేపీ పొత్తు నైతికమా..?

ఎన్టీఆర్‌ను ఎప్పుడూ.. కాస్త మంచిగా స్మరించుకోని వాళ్లంతా..ఇప్పుడు… ఆయన ఆత్మ క్షోభిస్తుందంటూ.. తెగ మథనపడిపోతున్నారు. ఇలా మథనపడేవాళ్లలో తెలుగుదేశం పార్టీ నేతలు అస్సలు లేరు. ఉన్నదంతా.. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతలే. ఒక్కసారిగా వీరికి ఎన్టీఆర్ ఆత్మ ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలుసా..?. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరగడంతో వీరందరికీ ఒక్కసారిగా.. ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని పెట్టారని… అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారని.. ఆయన ఆత్మ క్షోభిస్తుందని… దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని.. తెగ బాధపడిపోతున్నారు. అటు కిషన్ రెడ్డి దగ్గర్నుంచి… ఇటు కృష్ణా జిల్లా వైసీపీ నేత పార్థసారధి వరకూ అందరితీ అదే బాధ. విశేషం ఏమిటంటే.. ఇలా అంటున్న వాళ్లతో చాలా మంది.. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్… పార్టీ పెట్టారో.. అదే కాంగ్రెస్ పార్టీలో పుటి, పెరిగి.. పదవులు అనుభవించిన వాళ్లే.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తు అనగానే.. ముందుగా చాలా మందికి వణుకు వచ్చేసింది. ఆ పొత్తు తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పేస్తుందేమో.. తమ రాజకీయ భవిష్యత్‌ను మరింత అంధకారం చేస్తుందేమోనని.. బాధపడిపోతున్నారు. అందుకే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తేమిటని.. తెగ బాధపడిపోతున్నారు. దానికి ఎన్టీఆర్‌ సెంటిమెంట్‌ను వాడేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఢిల్లీ అహంకారంపై పోరాటానికే పార్టీ పెట్టారు. అహంకారాన్ని అణచి వేశారు. అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది.అందుకే ఆ పార్టీపై పోరాడింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది. కాంగ్రెస్‌ను మించిన అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటి శతృవుపైన పోరాడాలా..? ఎప్పుడో ఓడిపోయిన శతృవు గురించి ఆలోచించాలా..?

తెలంగాణలో పొత్తులపై… ఇతర పార్టీల నేతలు.. ఎన్టీఆర్‌ను వాడేసుకుని రాజకీయంగా లబ్ది పొందుదామని అనుకుంటున్నారు. ఈ రియాక్షన్ అంతా.. ఇతర పార్టీల నుంచే వస్తోంది కానీ.. టీడీపీ నేతల దగ్గర్నుంచి రావడం లే్దు. తెలంగాణలో పొత్తులపై… ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని… గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ మంత్రులు ప్రకటించారు. ఆ తర్వాత వారు కూడా సైలెంటయ్యారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ నేతలు మాత్రం.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోకూడదన్నట్లే విమర్శలు చేస్తున్నారు. అది వారి రాజకీయ వ్యూహంలో భాగం. ఎందుకంటే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. గేమ్‌ చేంజర్‌గా మారుతుందన్నది వాళ్ల భయం కావొచ్చని.. టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అనైతికమా..? మరి వేర్పాటువాద పీడీపీతో బీజేపీ పొత్తు నైతికమా..?

తెలుగుదేశం పార్టీ పొత్తులపై… తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు తెగ విమర్శలు చేసేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం కన్నా.. అనైతికత ఏమీ లేదంటున్నారు. మరి బీజేపీ అంత నైతికమైన పొత్తులు పెట్టుకున్నదా..? . జమ్మూకశ్మీర్‌లో నిన్నామొన్నటిదాకా పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపింది..” పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్” అనే పార్టీ. ఈ పార్టీ ఏమిటి..? ఈ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి..? బీజేపీ ఏమిటి..? బీజేపీ సిద్ధాంతాలు ఏమిటి..? 2016లో కశ్మీర్‌లో ఎన్నికలు జరిగినప్పుడు…370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి వద్దని బీజేపీ ప్రచారం చేసింది. ఆర్టికల్ 370ని మరింత పటిష్టం చేయాలన్నది పీడీపీ ప్రధాన డిమాండ్. కశ్మీర్‌కు స్వాతంత్రం కోరే పార్టీ పీడీపీ, కశ్మీర్‌ భారతదేశంలో భాగం అనే పార్టీ బీజేపీ. ఎలా పొత్తు పెట్టుకున్నారు..? అసలు పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పచ్చి రాజకీయ అవకాశవదానికి పరాకాష్ట. అంతే కాదు అభ్యంతరకరం కూడా.

ఇంత పత్తిత్తు పొత్తులు పెట్టుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఇంకా పెట్టుకోని టీడీపీ, కాంగ్రెస్ పొత్తుల్ని విమర్శించడానికి బయలుదేరారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. ఇద్దరూ.. తెలుగుదేశం పార్టీని వదిలించుకునేదాకా నిద్రపోలేదు. అలా 2014 ఎన్నికలు అయిపోయాయో లేదో కానీ.. ఇలా… టీడీపీతో ఇక పొత్తు ఉండదు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకోవడం ప్రారంభించారు. ఇప్పటికి వారికి తత్వం బోధపడినట్లుంది. మూడు రోజుల కిందట.. తమతో కలిసి వచ్చే వారందరితో కలిసి టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలోనే కాదు…ఏపీలోనూ బీజేపీ అంటరాని పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. అధికార అవసరార్థం.. కేసీఆర్ కానీ.. జగన్ కానీ.. లోపాయికారీ మిత్రత్వం నటిస్తున్నారేమో కానీ… అధికారం లేకపోతే… బీజేపీని ఆమడదూరంలో ఉంచుతారు.

ఇప్పుడు తాము వద్దనుకున్న టీడీపీకి… తెలంగాణలో అంత కీలకంగా మారడం… కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. ఏకంగా అధికారానికి కూడా దగ్గరవుతుందన్న ప్రచారం జరుగుతూండటంతో.. వాళ్లకి షివరింగ్ ప్రారంభమయింది. అందుకే… టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై నైతిక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయినా టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుంటే.. నేరుగా పెట్టుకుంటాయి. ఆదరించాలో లేదో నేరుగా ప్రజలు తేల్చుకుంటారు. కానీ బీజేపీ అలా కాదుగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సహకరించి.. దానికిగాను లోపాయికారీగా.. సిట్టింగ్‌ సీట్లను అయినా గెలిపించుకునే ఎత్తుగడ వేయడం.. ఏ తరహా పొత్తులు.. ? ఏ తరహా నైతికత..? కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లే చెప్పాలి. ఈ విషయంలో అయినా వారి మధ్య ఏకాభిప్రాయ ఉంటుందో ఉండదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com