ఓ బూతు ప‌దం వినిపించేస‌రికి… అంతా అలెర్ట్ అయిపోయారు: శ్రీ విష్ణుతో ఇంట‌ర్వ్యూ

మార్కులు, ర్యాంకులు… త‌ల్లిదండ్రుల‌ది ఇదే గోల‌.
పిల్ల‌ల‌కేం కావాలో వాళ్ల‌కు తెలీదు..
పెద్ద‌వాళ్ల ల‌క్ష్యాలేంటో పిల్ల‌ల‌కు అర్థం కాదు.
వీటి మ‌ధ్య బాల్యం.. య‌వ్వ‌నం న‌లిగిపోతున్నాయి. పిల్ల‌ల ఆలోచ‌న‌లు విరిచేస్తున్నారు. రెక్క‌లతో పాటు వాళ్ల ఆశ‌యాల్ని తొక్కేస్తున్నారు.
వీటిని ప్ర‌శ్నించ‌డానికి ఓ సినిమా వ‌స్తోంది. అదే… ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’. శ్రీ‌విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ఈవారం విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌విష్ణుతో తెలుగు 360 ఇంట‌ర్వ్యూ!

* ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు మీ క‌థ కూడా గుర్తొచ్చిందా?
– చేసిన‌ప్పుడు కాదు, విన్న‌ప్పుడే అనిపించింది. ‘ఇది నా క‌థే క‌దా.. చేసేద్దాం’ అనుకున్నా. కానీ చేస్తూ చేస్తూ ఉన్న‌ప్పుడు చాలామంది ‘మాదీ ఇలాంటి క‌థే’ అన్నారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. అంద‌రి క‌థా.. దాదాపు ఇలానే ఉంటుంద‌న్న నిజం తెలిసింది.

* ఈత‌రానికి ఏం చెప్ప‌బోతున్నారు… చ‌దువులు వద్దంటారా?
– చ‌దువు వ‌స్తే చ‌దువుకోండి. లేదంటే వ‌ద్దు. ఏది ఇష్ట‌మో అదే చేసుకోండి. అంతే త‌ప్ప‌ ఉక్కిరి బిక్కిరి అయిపోదు. చ‌ద‌వ‌క‌పోతే ఏం కాదు. జీవితాలేం నాశ‌నం అయిపోవు. గోల్డ్ మెడ‌ల్ తెచ్చుకున్న వాళ్లంతా గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారా? భ‌విష్య‌త్తులో వాళ్లు కూడా ఏమాత్రం చ‌దువురాని వాళ్ల వెనుక నిల‌బ‌డి ప‌నిచేసుకుంటున్నారు. అంటే ఇక్క‌డ చ‌దువుకి ఎంత విలువ ఉన్న‌ట్టు? అలాంటి చ‌దువు కోసం అంత ఇదైపోవ‌డం ఎందుక‌న్న‌ది నా ప్ర‌శ్న‌. ఎల్ బీ న‌గ‌ర్ లో ఓ అమ్మాయి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష స‌రిగా రాయ‌లేద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. బాగా రాయ‌కపోతే చ‌నిపోవ‌డం ఏమిటి? అంటే మ‌నం వాళ్ల‌ని అలా త‌యారు చేస్తన్నామ‌న్న‌మాట‌. ఇంజ‌నీర్ అయితేనే సొసైటీలో బ‌తుకుతున్న‌ట్టా? ఎంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు త‌మ జీవితంలో హ్యాపీగా ఉన్నారు? ఎందుకొచ్చిన జాబ్‌రా బాబూ.. అని ఎంత మంది అనుకోవ‌డం లేదు. ఏదో ప్రాస్టేజ్ కోసం అదే ఉద్యోగాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లంద‌రికీ ఈ సినిమా ఓ క‌నువిప్పు.

* కార్పొరేట్ కాలేజీల‌పై సెటైర్లు ఉంటాయా?
– వాళ్ల‌ని ప్ర‌త్యేకించి టార్గెట్ చేయ‌లేదు. కానీ కొన్ని మాట‌లు వాళ్ల‌కూ త‌గులుతుంది. ఒక‌టో ర్యాంకు ఒక‌టే ఉంటుంది. అది ఒక్క‌రికే వ‌స్తుంది. అంటే మిగిలిన‌వాళ్లంతా చ‌వ‌ట‌ల‌ని కాదు క‌దా. అంద‌రం ఒకేలా భోజ‌నం చేయం, ఒకేలా మంచినీళ్లు తాగం. అలాంట‌ప్పుడు ఒక‌రిలా మ‌రొక‌రి జీవితం ఎందుకు ఉండాలి. ఒక‌రిలా మ‌రొక‌రు ఎందుకు చ‌ద‌వాలి? రోజుకి 20 గంట‌లు చ‌ద‌వండి అంటూ ప‌ర్స‌నాలిటీ డెవ‌లెప్ మెంట్ మేధావులు బోధ‌న‌లు చేస్తుంటారు. వాళ్ల వ‌ల్లే యువ‌త‌రం స‌గం నాశ‌నం అయిపోతోంది. మ‌త గ్రంధాల త‌ర‌వాత ఎక్కువ‌గా చెడ‌గొట్టేది ప‌ర్స‌నాలిటీ బుక్సే.

* వ‌రల్డ్‌లో ది బెస్ట్ సెల్ల‌ర్స్ అనేవ‌న్నీ వ్య‌క్తిత్వ వికాస పుస్త‌కాలే క‌దా? అందులో ఏం లేనప్పుడు ఇంత ఆద‌ర‌ణ ఎందుకు?
– ఇలా చేయండి.. అలా చేయండి.. అని చెప్ప‌డ‌మే క‌దా ప‌ర్స‌నాలిటీ డెవ‌లెప్ మెంట్‌. అది మ‌న‌కు తెలీదా? ఎవ‌రి జీవితాల్లోంచి వాళ్లు అనుభ‌వాలు నేర్చుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ప‌ర్స‌నాలిటీ డెవ‌లెప్‌మెంట్ పుస్త‌కాలు రాసిన‌వాళ్లంతా మేధావులే క‌దా? ఆ తెలివితేట‌ల్ని వేరే రంగంలో పెట్టుకోకుండా.. పుస్త‌కాలు రాసుకుని సొమ్ము చేసుకుంటున్నారెందుకు?

* మీరిప్ప‌టి వ‌ర‌కూ అలాంటి పుస్త‌కాలేం చ‌ద‌వ‌లేదా?
– ఒక్క‌టి కూడా చ‌ద‌వ‌లేదు. చ‌దివి టైమ్ వేస్ట్ చేసుకోద‌ల‌చుకోలేదు. ఈ పుస్త‌కాల్లో ఏం లేద‌ని చ‌దివిన వాళ్లు చాలామంది చెప్పారు.

* ట్రైల‌ర్ చూస్తుంటే తారే జ‌మీర్ ప‌ర్‌, త్రీ ఈడియ‌ట్స్ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి?
– కొంచెం ఆ ఛాయ‌లు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోనూ చేసింది చ‌దువు గురించి డిస్క‌ర్ష‌న్ కాబ‌ట్టి. తారే జ‌మీన్ ప‌ర్‌… ఓ చిన్న‌పిల్లాడి క‌థ. ఆ వ‌య‌సులో అంత మెచ్యూరిటీ, పెయిన్ ఉండ‌దు, కాక‌పోతే ఆ వ‌య‌సు నుంచే జాగ్ర‌త్త ప‌డాలి. అలాంటి గొప్ప సినిమాల‌తో నేను పోల్చ‌ను గానీ, మా పాయింట్ కూడా అంత బ‌లంగానే ఉంటుంది.

* ఇలాంటి యూనివ‌ర్స‌ల్ క‌థ‌ల్ని మిగిలిన భాష‌ల‌కూ అందివ్వొచ్చు క‌దా?
– ఓ మంచి పాయింట్ ఎక్క‌డ చెప్పినా.. అది అంద‌రికీ చేరువ కావాలి. ఇలాంటి క‌థ‌ల‌కు ప్రాంతానికి, భాష‌కు సంబంధం లేదు. ఎవ‌రైనా వ‌చ్చి అడిగితే రీమేక్ రైట్స్‌ ఇచ్చేస్తా.

* ఈ సొసైటీ చూశాక‌, ఇలాంటి సినిమా చేశాక నా జీవితం, నా త‌ల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ గొప్ప‌ది అనిపించిందా?
– వంద‌కు వంద శాతం. ఇంట్లో వాళ్లు నాకు స్వేచ్ఛ ఇవ్వ‌క‌పోతే ఇంత దూరం వ‌చ్చేవాడ్ని కాదు. ఈ విష‌యంలో నేను చాలా అదృష్ట‌వంతుడ్ని అనుకున్నా. నాకిష్ట‌మైన ప‌ని.. చేసుకునే అవ‌కాశం ఇచ్చారు. మ‌న‌ల్ని చ‌దివించాల‌నే ప్ర‌య‌త్నంలో ఒత్తిడి తీసుకురావ‌డంలో త‌ల్లిదండ్రుల త‌ప్పు కూడా లేదండీ. వాళ్ల భ‌యాలు వాళ్ల‌కుంటాయి. కాక‌పోతే మ‌న‌కేం కావాలో వాళ్లు స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌గాలి. మ‌న‌పై వాళ్లకు న‌మ్మ‌కం కుద‌రాలి. ఒప్పుకోక‌పోతే మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాలి. ఓ అమ్మాయి నో అన్నా.. ప‌దిసార్లు వెంట‌ప‌డి ఆమె ప్రేమ‌ని సాధించుకుంటాం. జీవితంలో ప్రేమ అనేది చిన్న విష‌యం. దానికోసం పోరాడుతున్న‌ప్పుడు, మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు జీవితం కోసం ఆమాత్రం పోరాడ‌లేమా?

* ఈ క‌థ‌కి గ్రామీణ నేప‌థ్యం, మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితం ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?
– అదేంటో గానీ, మ‌న క‌థ‌ల‌న్నీ హైద‌రాబాద్ చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రేమ‌క‌థ‌లూ ఇక్క‌డే, థ్రిల్ల‌ర్లూ ఇక్క‌డే. కాలేజీ క‌థ‌లూ ఇక్క‌డే. అందుకే ఈ నేటివిటీ కి దూరంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. చాలా క్లియ‌ర్‌గా చెబుతున్న పాయింట్ అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఉండాల‌నుకున్నాం.. అందుకే రూల‌ర్ ఏరియా. నా భాష కూడా నెల్లూరు యాస‌లో ఉంటుంది. ఆ భాష‌లో అమాయ‌క‌త్వం క‌నిపిస్తుంది. దాంతో పాటు శ‌క్తిమంతంగానే ఉంటుంది. ఎలాంటి డైలాగ్ చెప్పినా త్వ‌ర‌గా రీచ్ అవుతుంది. అందుకే.. ఆ యాస ఎంచుకున్నాం.

* ఓ పాట‌లో.. ఓ బూతు మాట వినిపించింది. అయినా సెన్సార్ క్లీన్ యూ ఇచ్చారు. ఆ ప‌దం ఉందా, తీసేశారా?
– అది కేవ‌లం ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ మాత్ర‌మే. సినిమాలో ఉండ‌దు. ఓ స్టూడెంట్ నిరాశ నిస్పృహ‌లో పిచ్చెక్కిపోయి కాలాన్ని తిట్టుకుంటూ పాడే పాట అది. కాబ‌ట్టి పెద్ద‌వాళ్లు చూడొద్దు… అని ప్ర‌మోట్ చేశాం. పిల్ల‌ల‌కు బాగా న‌చ్చింది. పెద్ద‌వాళ్లూ ఎంజాయ్ చేశారు. ఈ ఆల్బ‌మ్‌లో చివ‌ర విడుద‌ల చేసిన పాట అదే. పార్వ‌తీ త‌న‌యుడు అంటూ తెలంగాణ ఉగ్గు సంస్ర్కృతి బేస్‌తో ఓ పాట చేశాం. మ‌ద‌న సుంద‌రి అనే మ‌రో పాట‌ గ‌ద్ద‌ర్ గారి పాట నుంచి స్ఫూర్తి పొంది రూపొందించాం. త్యాగ‌రాజు కీర్త‌న‌లతో ఓ పాట చేశాం. ఇవ‌న్నీ మంచి పాట‌లే. జ‌నాల‌కు ప‌నికొచ్చే పాట‌లు. ఇవ‌న్నీ వ‌దిలేసి.. ఓ పాట‌లో చిన్న బూతు ప‌దం వినిపించేస‌రికి అంతా ఎలెర్ట్ అపోయారు. `ఇన్ని మంచి పాట‌లున్నాయి.. సూప‌ర్‌` అని ఎవ‌రూ అన‌లేదు. ఓ బూతు వినిపించే స‌రికి ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. చ‌క్రంలో ఓ డైలాగ్ గుర్తొస్తోంది. తెల్ల కాగితంపై చిన్న మ‌చ్చ ఉన్నా.. అంద‌రూ మ‌చ్చ గురించే మాట్లాడుకుంటారు. ఈ పాట విష‌యంలోనూ అదే జ‌రిగింది.

* క‌మ‌ర్షియ‌ల్‌గా హ్యాపీయేనా?
– ఈ సినిమా చూశాక న‌లుగురు మాట్లాడుకుంటే చాలు.. ఈ పాయింట్ పై చ‌ర్చ జ‌రిగితే చాలు. అదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.