వరుస విజయాలతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయాడు శ్రీవిష్ణు. సామజవరగమన, సింగిల్ లాంటి సినిమాల తరవాత నవ్వించే బాధ్యత తనపై మరింతగా పెరిగింది. అందుకే కొత్త కొత్త పాయింట్ల వైపు దృష్టి మరల్చాడు. జాతకాల పిచ్చి అనే పాయింట్ పై ఎంతమంది సినిమాలు తీసినా, ఇంకా ఫ్రెష్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్చి అలాంటిది. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా అదే పాయింట్ తో ఓ సినిమా తీస్తున్నాడు. దీనికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాతో యధునాథ్ మారుతీరావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నయన సారిక కథానాయిక. ఈ రోజు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లోనే పాయింట్ రివీల్ చేశారు.
గతంలో ఈవీవీ సత్యనారాయణ ఇదే పాయింట్ పై ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా తీశారు. ఇందులో హీరో (రాజేంద్ర ప్రసాద్)కు జాతకాల పిచ్చి. ఈ అంశాన్ని ఈవీవీ ఎన్నిరకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొన్నారు. ఇప్పటికీ ఆ సినిమాని చూస్తూ… నవ్వుకొంటుంటాం. మరి ఆ పాయింట్ తో శ్రీవిష్ణు కొత్తగా ఎలా నవ్వించాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. ఇది కాకుండా ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే మరో సినిమా పూర్తి చేశాడు శ్రీవిష్ణు. టైటిల్ పవర్ఫుల్ గా ఉన్నా, అది కూడా కామెడీ కథే. ‘విష్ణు విన్యాసం’ కంటే ముందుగా ఆ సినిమానే విడుదల అవుతుంది.
