శ్రీ‌దేవి సంతాప స‌భ‌… మ‌రో రెండు కోణాలు

ఆదివారం హైద‌రాబాద్‌లో శ్రీ‌దేవి సంతాప స‌భ జ‌రిగింది. స‌భ‌లో పాల్గొన్న వ‌క్త‌లంతా శ్రీ‌దేవితో త‌మ జ్ఞాప‌కాల్ని పంచుకున్నారు. శ్రీ‌దేవి మ‌హా న‌టి అని, తాను మ‌ళ్లీ పుట్టాల‌ని కోరుకున్నారు. ఏ సంతాప స‌భ‌లో అయినా ఇదే జ‌రుగుతుంది. చ‌నిపోయిన‌వాళ్ల‌ని గుర్తు చేసుకుంటూ, వాళ్ల సేవ‌ల్ని కొనియాడ‌డ‌మే సంతాప స‌భ ల‌క్ష్యం.. ఉద్దేశం. అయితే శ్రీ‌దేవి సంతాప స‌భ‌లో మ‌రో రెండు కోణాలూ క‌నిపించాయి.

ఒక‌టి.. సుబ్బిరామిరెడ్డిని పొగ‌డ‌డం.

ఈ సంప‌తా స‌భ నిర్వ‌హించింది టి.సుబ్బిరామిరెడ్డి. ప‌రిశ్ర‌మ చేయాల్సిన ప‌నిని తాను భుజాల‌పై వేసుకుని న‌డిపించాడు. ఈ విష‌యంలో సుబ్బిరామిరెడ్డి పొగ‌డ్త‌ల‌కు అర్హుడే. కానీ.. ఇది మాత్రం స‌మ‌యం కాదు. మైకు ప‌ట్టుకున్న ప్ర‌తి ఒక్క‌రూ శ్రీ‌దేవిని త‌ల‌చుకోవ‌డానికి ముందు.. సుబ్బిరామిరెడ్డిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్రయ‌త్నించారు. ఇలాంటి ఘ‌న కార్యాలు ఈ క‌ళాబంధు మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌ని.. రెండు మూడు నిమిషాల పాటు సుబ్బిరామిరెడ్డి విశిష్ట‌త గురించి మాట్లాడిన త‌ర‌వాతే… అస‌లు మేట‌ర్‌లోకి వెళ్లారు.

రెండు… బోనీ క‌పూర్ నిజాయ‌తీ

శ్రీ‌దేవి మ‌ర‌ణం త‌ర‌వాత‌….కొన్ని అనుమానాలు రేకెత్తిన మాట వాస్త‌వం. అంద‌రూ బోనీక‌పూర్ వైపు అనుమానంగా చూశారు. దుబాయ్ పోలీసులు గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌శ్నిస్తుంటే, పాస్ పోర్టు స్వాధీనం చేసుకుంటే ఆ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. దుబాయ్ పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చేసినా, జ‌నం ఇంకా బోనీక‌పూర్ గురించి కాస్త నెగిటీవ్‌గానే మాట్లాడుకుంటున్నారు. శ్రీదేవి సంతాప స‌భ‌లో కూడా బోనీక‌పూర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. కాక‌పోతే.. పూర్తి పాజిటీవ్‌గా. శ్రీ‌దేవి గురించి చెప్పిన వాళ్లంతా.. బోనీక‌పూర్ మంచిత‌నాన్నీ ప్ర‌స్తావించారు. ‘శ్రీ‌దేవిని క‌న్న బిడ్డ‌లా చూసుకున్నా’డ‌ని ఒక‌రు… వాళ్ల‌ది అన్యోన్య దాంప‌త్య‌మ‌ని మ‌రొక‌రు, చిల‌కా గోరింక అని ఒక‌రు… ఇలా ఎవ‌రికి తోచిన ఉప‌మానాలు వాళ్లు ఇచ్చేశారు.

వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్క‌టే.. ‘బోనీని చెడుగా చూడొద్దు’ అని. అలా శ్రీ‌దేవి సంతాప స‌భ‌… సంతాపాల‌కే ప‌రిమితం కాలేదు. పొగ‌డ్త‌ల‌కు, కితాబుల‌కూ, అనుమానాల నివృత్తికీ వేదిక అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.