శ్రీ‌దేవికి చిరాకు తెప్పిస్తున్న బాహుబ‌లి

మామ్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియా ముందుకు వ‌స్తోంది అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. అయితే… మామ్ గురించి అడ‌గ‌డం మానేసి.. `బాహుబ‌లి` గురించే ప్ర‌శ్న‌లు సంధిస్తోంది మీడియా. దాంతో శ్రీ‌దేవికి చిరెత్తుకొస్తోంది. `బాహుబ‌లి గురించి నన్నెందుకు అడుగుతారు` అని చాలా చోట్ల అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించింది శ్రీ‌దేవి. శివ‌గామి పాత్ర కోసం ర‌మ్య కృష్ణ‌కంటే ముందుగా శ్రీ‌దేవి పేరుని ప‌రిశీలించ‌డం, శ్రీ‌దేవి నో చెబితే… ఆ పాత్ర ర‌మ్యకృష్ణ‌కు ద‌క్క‌డం, ఆ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ రెచ్చిపోవ‌డం.. ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే. శ్రీ‌దేవి భారీ పారితోషికం అడిగింద‌ని… ఆమె స్థానంలో ర‌మ్య కృష్ణ‌ని తీసుకోవ‌డానికి మొగ్గు చూపించింది టీమ్‌. ఆ విధంగా శ్రీ‌దేవి ఓ అద్భుత‌మైన అవ‌కాశాన్ని కోల్పోయిన‌ట్టైంది.

ఆ బాధ‌లో శ్రీ‌దేవి ఉంటే.. ”ఆ సినిమా మీరు ఎందుకు ఒప్పుకోలేదు… బాహుబ‌లిలాంటి హిట్ సినిమా చేజార్చుకొన్నందుకు బాధగా ఉందా?” అంటూ మీడియా వాళ్లు ప‌దే ప‌దే అడ‌గ‌డంతో… శ్రీ‌దేవి అస‌హ‌నంగా క‌నిపించింది. ఓ ద‌శ‌లో… ”బాహుబ‌లి గురించి న‌న్ను అడ‌క్కండి” అంటూ మీడియా ప్ర‌తినిధుల‌కు గ‌ట్టిగా చెప్పేసింది కూడా. ”నాకు ఈమ‌ధ్య చాలా అవ‌కాశాలొచ్చాయి. అన్నింటినీ ఒప్పుకోలేను. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నో చెప్పాల్సివ‌స్తుంది. అందులో బాహుబ‌లి ఒక‌టి. దాన్ని భూత‌ద్దంలో చూస్తారెందుకు? ఆ విష‌యాన్ని నేనెప్పుడో మ‌ర్చిపోయా” అంటోంది శ్రీ‌దేవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com