వైకాపా కూడా అదే కోరుకొంటున్నట్లుంది

శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాని ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. సాధారణంగా ఎథిక్స్ కమిటీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటుందని కానీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తన పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా రోజాను సస్పెండ్ చేసారని జగన్ విమర్శించారు. ఆమెపై విధించిన సస్పెన్షన్ న్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వం ఏమి తప్పు చేసిందో దానిని ఏవిధంగా సవరించుకోవాలో జగన్ సూచించినట్లయింది. వెంటనే స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులతో కూడిన ఎథిక్స్ కమిటీని నియమించారు.

డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఆ కమిటీలో వైకాపా తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఆ కమిటీ నిన్న సమావేశమయ్యి, రోజాపై విధించిన సస్పెన్షన్ గురించి చర్చించింది. మళ్ళీ ఈనెల 19న మరొకమారు సమావేశమయ్యి తన నివేదికను రూపొందిస్తుంది.

ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాన ప్రతిపక్షమయిన మేము సూచించిన ఏ సూచనను ఎథిక్స్ కమిటీ పట్టించుకోలేదు. తెదేపా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి ఆమోదముద్ర వేయడానికే ఈ కమిటీని ఏర్పాటు చేసుకొన్నట్లుంది. శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన గురించి మేము లేవనెత్తిన అభ్యంతరాలను కమిటీ అసలు పట్టించుకోలేదు. పైగా సమావేశంలో చర్చించిన విషయాలను వారిలో ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే మీడియాకి లీక్ చేసారు. ప్రభుత్వం రేపు శాసనసభలో మాతో ఏవిధంగా వ్యవహరించబోతోందో ఈ సమావేశం అద్దం పడుతోంది,” అని విమర్శించారు.

రోజాని ఏడాదిపాటు శాసనసభ నుండి సస్పెండ్ చేయడం చాలా తొందరపాటు చర్యే. అందుకు తెదేపా చాలా విమర్శలు మూట గట్టుకొంది కూడా. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎథిక్స్ కమిటీ ప్రస్తావన తెచ్చి ఆ సమస్య నుండి ఏవిధంగా బయటపడవచ్చో ప్రభుత్వానికి సూచించినట్లయింది. అంతే కాదు ఆ తరువాత రోజా, వైకాపా వరుసగా చాలా పొరపాట్లు చేసారు.

ఆమె సభ నుండి సస్పెండ్ అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “సస్పెండ్ అయినందుకు తానేమీ బాధపడటం లేదని” చెప్పడంతో ఆమె టీవీ షోలు చేసుకోవడానికి వీలు చిక్కినందుకు చాలా సంతోషిస్తున్నట్లున్నారని మీడియాలో కధనాలు వచ్చేయి. ఆ తరువాత కూడా ఆమె తన తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేయకుండా శాసనసభలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించి మంచి రసవత్తరమయిన డ్రామా చూపించారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెకి మద్దతు ఇచ్చి మరో తప్పు చేసారు. ఆమె తరపున స్పీకర్ కోడెలకి క్షమాపణలు చెప్పి ఉండి ఉంటే, సస్పెన్షన్ ఎత్తివేసి ఉండేవారు. కానీ జగన్ కూడా సభలో యుద్ద వాతావరణం సృష్టించి బయటకు వెళ్ళిపోయారు. ఆమె సభ నుంచి సస్పెండ్ అయి ఉంటేనే ఆ వంకతో ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం ఉంటుందని భావించారేమో?

కనీసం ఆమె అయినా స్పీకర్ ని కలిసి క్షమాపణలు చెప్పుకొని ఉండి ఉంటే సస్పెన్షన్ ఎత్తివేసేవారేమో? కానీ ఆమె కూడా జగన్ వైఖరికి అనుకూలంగానే వ్యవహరించవలసి రావడంతో ఆ పని చేయలేదనుకోవాలి. ఎథిక్స్ కమిటీకి లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరినా ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉండేది. కానీ రోజా ఆ అవకాశాన్ని కూడా బహుశః అదే కారణం చేత ఉపయోగించుకోలేకపోయారు.

శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా రోజాపై విధించిన సస్పెన్షన్ న్ని ఖరారు చేయడానికే ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయబడిందనే సంగతి శ్రీకాంత్ రెడ్డికి తెలియకపోదు. అయినా కమిటీ సమావేశానికి వెళ్ళకపోతే తమదే తప్పు అవుతుంది కనుక దానికి హాజరయ్యి ఆనక దాని తీరును విమర్శిస్తున్నారు. వైకాపా తీరు చూస్తుంటే అది కూడా రోజా సస్పెండ్ కావాలని కోరుకొంటున్నట్లే ఉంది తప్ప ఏదో విధంగా ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలనే ఉద్దేశ్యం కనబడటం లేదు. రోజాపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను చేజేతులా వదులుకొని, ప్రభుత్వాన్ని, ఎథిక్స్ కమిటీని నిందించడం దేనికంటే ప్రజల సానుభూతి పొందడానికేననుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com