రెండే రెండు సినిమాలతో క్రేజీ దర్శకుల జాబితాలో చేరిపోయాడు అవసరాల శ్రీనివాస్. తన మూడో సినిమా నానితో అనే ప్రచారం సాగింది. నాని కూడా అవసరాలతో సినిమా చేయాలని ఉత్సాహం చూపించాడు. అవసరాలతో సినిమా చేస్తున్నా అని ప్రకటించాడు కూడా. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. దానికి కారణం నాని వేరే సినిమాలతో బిజీ అయిపోవడమే. నాని మజ్ను సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తరవాత నేను లోకల్ సినిమాతో బిజీ అవుతాడు. ఇదికాక మరో రెండు కమిట్మెంట్స్ వున్నాయి. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే ఓ ఏడాది సమయం పడుతుంది. అప్పటి వరకూ సినిమా చేయకుండా ఖాళీగా కూర్చోవడం అవసరాలకు ఇష్టం లేదు. దానికి తోడు నీకు మంచి ఆఫర్ వొస్తే మరో హీరోతో సినిమా చేసుకో అని నాని కూడా చెప్పేశాడట. అందుకే ఇప్పుడు మరో హీరో కోసం అన్వేషిస్తున్నాడు. జో అచ్చుతానంద చూశాక అవసరాలతో జట్టు కట్టడానికి కుర్ర హీరోలు చాలా మంది ముందుకు వస్తున్నారు. నాగ శౌర్య తో అవసరాల మరో సినిమా చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. శర్వానంద్, రాజ్ తరుణ్ లు కూడా… కధ ఉంటే చెప్పమని అవసరాలని అడిగారట. సో నాని ని పక్కన పెట్టి.. తన కథకి తగిన హీరోతో ప్రయాణం చెయ్యడానికి అవసరాల ప్రయత్నిస్తున్నట్టు టాక్. మరి ఆ హీరో ఎవరో చూడాలి. హీరో ఎవరైనా నిర్మాత మాత్రం సాయి కొర్రపాటి అనేది ఖాయం అయిపొయింది.