సినీ స‌న్యాసం… న‌మ్మాలా స్టార్లూ..?!

‘త్వ‌ర‌లోనే రాజ‌కీయ స‌న్యాసం చేస్తా’ అనే రాజ‌కీయ నాయ‌కుల్ని

‘ఇదే నా చివ‌రి సినిమా’ అని చెప్పే సినీ స్టార్ల‌ని అస్సలు న‌మ్మ‌లేం.

సినిమాల‌కున్న గ్లామ‌ర్ అలాంటిది. మానేద్దాం… మానేద్దాం… అనుకున్నా మాన‌లేరు. మేకప్పులు, షూటింగులు, ప్రెస్ మీట్లు, అభిమానుల గోల‌, రిలీజ్ డే కిక్కు, రికార్డుల మాట‌లు…. ఇవ‌న్నీ ఓసారి అల‌వాటయ్యాయంటే వ‌దులుకోవ‌డం క‌ష్టం. చిరంజీవిని చూడండి… 149 సినిమాలు చేశాక రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయాడు. ప్ర‌జారాజ్యం పార్టీ మొద‌ల‌య్యాక‌… ‘నేను ఇక సినిమాలు చేసేది లేదు.. నా మ‌న‌సు అటు పోవ‌డం లేదు’ అనిచాలాసార్లు చెప్పాడు. సినిమాల‌పై మోజు త‌గ్గిపోయింద‌ని, ఆ ఆలోచ‌న లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సందర్భాలు బోలెడు. కానీ ఏం జ‌రిగింది?? హాయిగా 150వ సినిమా చేసేశాడు. ఇంకా కొన్నాళ్లు ఆయ‌న సినిమాలు చేయ‌డానికి రెడీ.

ప‌వ‌న్ క‌ల్యాణ్ చూడండి. ‘సినిమాలు మానేస్తున్నా’ అని చెప్పి రెండు నెల‌లు కాలేదు. ఇంత‌లోనే… మ‌రో సినిమా మొద‌లెట్ట‌డానికి రెడీ అయ్యాడు. ప‌వ‌న్ ఏప్రిల్ – మేల‌లోనే కొత్త సినిమా మొద‌లెడ‌తార‌ని స‌మాచారం. అందుకు త‌గిన ప్ర‌య‌త్నాలూ జ‌రుగుతున్నాయి. ఇప్పుడు క‌మ‌ల్‌హాస‌న్ బ‌య‌ల్దేరాడు. ‘నా చేతులో రెండు సినిమాలున్నాయి… అవి అవ్వ‌గానే సినిమాల‌కు దూరం అవుతా’ అంటున్నాడాయ‌న‌. విశ్వ‌రూపం 2, భార‌తీయుడు 2 పూర్త‌యితే సినీ స‌న్యాసం తీసుకుంటా అంటున్నాడు. క‌మ‌ల్ దృష్టి ఇప్పుడు రాజ‌కీయాల‌పై ఉంది. సంపూర్ణ రాజ‌కీయనేత‌గా ఆయ‌న మారాల‌నుకుంటున్నాడు. అలాంట‌ప్పుడు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం మామూలే. కానీ వాటిపై ఎంత వ‌ర‌కూ నిల‌బ‌డ‌తార‌న్న‌ది ప్ర‌ధానం. ‘సినిమాలు మానేస్తున్నా’ అని చెప్పిన ఏ సినీ స్టారూ… సినిమాల‌కు దూరం కాలేక‌పోయాడు.

అందుకు ర‌క‌రకాల కార‌ణాలున్నాయి. ర‌జ‌నీకాంత్‌పైనా ఇలాంటి రూమ‌ర్లు బోలెడ‌న్నాయి. రోబో 2 త‌ర‌వాత ఆయ‌న కొత్త‌గా సినిమాలు చేయ‌ర‌న్న‌ది టాక్‌. కానీ.. సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ ఏదీ శాశ్వ‌తం కాదు. ‘అభిమానులు గోల చేస్తున్నారు.. వాళ్ల‌కోస‌మైనా సినిమా చేస్తా’ అని చెప్ప‌డానికి ఓ బ‌ల‌మైన సాకు దొరుకుతుంది. రేపొద్దుట‌… చిరంజీవిలానే ర‌జ‌నీ, క‌మ‌ల్ మాట మార్చొచ్చు. త‌ప్ప‌దు.. త‌ప్పేలేదు…ఇది సినిమా రంగం. ఇక్క‌డ మేక‌ప్‌ వ్యామోహాలు ఇలానే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.