ఢిల్లీలో వైకాపా ఒక్క‌రోజు హోదా దీక్ష‌… అస‌లు వ్యూహం ఇదే..!

వంచ‌న‌పై గ‌ర్జ‌న పేరుతో ఈ మ‌ధ్య వైకాపా కొన్ని దీక్ష‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధన దిశ‌గా ఈ దీక్ష‌లు ఆ పార్టీ చేస్తోంది. అయితే, ఈసారి ఢిల్లీలో ఈ దీక్ష ప్లాన్ చేస్తున్నారు. దేశ రాజ‌ధానిలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ నిన‌దించేందుకు స‌న్నాహాలు చేసుకుంటోంది. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోతున్న పార్ల‌మెంటు స‌మావేశాలే చివ‌రివి కావ‌డంతో… ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌తరం చేయాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అందుకే, ఈసారి నేరుగా పార్ల‌మెంటు ముందే ఆందోళ‌న‌కి దిగాల‌ని భావిస్తున్నారు.

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ముగిసేలోగా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ ధ‌ర్నాకి సిద్ధ‌మౌతున్నారు. ఈ ధ‌ర్నాలో ఏపీ నుంచి ఎంత‌మంది నేత‌లు పాల్గొనాలనే అంశంపై ప్ర‌స్తుతం పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. వైకాపా జిల్లా అధ్య‌క్షుల ద‌గ్గ‌ర నుంచీ… కీల‌క నేత‌లంతా ఢిల్లీకి వెళ్తార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఢిల్లీ వెళ్లాల్సిన నేత‌లంతా హైదరాబాద్ లో స‌మావేశం కానున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వైకాపా అభిప్రాయం ఏంటంటే… హోదా సాధ‌న కోసం చాలా పోరాటం చేశామ‌నీ, ఎంపీలు కూడా రాజీనామాలు చేశార‌నీ, ఏపీలో నిరంత‌రం దీక్ష‌లు చేస్తున్నామ‌ని! ఢిల్లీలో దీక్ష‌ను పెద్ద ఎత్తున విజ‌యవంతం చేస్తే… ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దాని మైలేజ్ ఉంటుంద‌నే వారి అభిప్రాయం ఉంది.

అయితే, ఢిల్లీలో దీక్ష‌ను వైకాపా ఎందుకింత సీరియ‌స్ గా తీసుకుంటోందంటే… దానికి కార‌ణం వేరేగా క‌నిపిస్తోంది. శీతాకాల స‌మావేశాల్లో పార్ల‌మెంటులో హోదా గురించి టీడీపీ మ‌రోసారి గ‌ట్టిగానే పోరాటం చేసే అవ‌కాశాలున్నాయి. అంతేకాదు, పార్ల‌మెంటు లోప‌ల టీడీపీ గ‌ళానికి కొంత మ‌ద్ద‌తు పెరిగే అవ‌కాశ‌మూ ఇప్పుడు ఏర్ప‌డింది. తాము అధికారంలోకి రాగానే హోదా ఇస్తామ‌న్న కాంగ్రెస్ తోపాటు, భాజ‌పా వ్య‌తిరేకంగా క‌లిసి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప‌నిచేయాల‌నే ఉద్దేశంతో ఉన్న ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో, స‌భ‌లో వైకాపా చేయ‌గ‌లిగిందేమీ లేదు. స‌భ‌లో వైకాపాకి ప్రాతినిధ్య‌మే లేదు. ఎంపీల రాజీనామాల‌తో ఏం సాధించార‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే ఎదుర్కొంటున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాలంటే… ఢిల్లీలోనే తామూ పోరాటం చేశామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. అందుకే, ఈ ఢిల్లీ ధ‌ర్నా స‌క్సెస్ పై ఇంత క‌స‌ర‌త్తు అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఒక‌వేళ, ప్ర‌త్యేక హోదా సాధ‌న దిశ‌గా కేంద్రాన్ని నిల‌దియ్య‌డ‌మే వైకాపా ల‌క్ష్య‌మే అయితే… ఆంధ్రా నుంచి ఢిల్లీకి ఎవ‌రెళ్తార‌నే స‌న్నాహాలూ చ‌ర్చ అన‌వ‌స‌రం, జాతీయ స్థాయిలో త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచే పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చెయ్యాలి. అస‌లైన పోరాటం చేయాల్సిన పార్ల‌మెంటు లోపల.. బ‌య‌ట కాదు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.