‘అన్నీ ఉన్నా… శని’ సామెతలా మారింది శ్రీలీల కెరీర్. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందం, ట్యాలెంట్‌కి కొదవ లేదు. గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ. డ్యాన్సులు ఇరగదీస్తుంది. వరుసపెట్టి అవకాశాలు కూడా వచ్చేశాయి. కానీ ఏం లాభం… విజయమే అందకుండా పోయింది. ధమాకా తర్వాత హీరోయిన్గా మరో విజయాన్ని అందుకోలేకపోయింది. బోనస్‌గా “రొటీన్ క్యారెక్టర్లు, డ్యాన్సులు తప్ప ఇంకేమీ లేవు” అనే నెగటివ్ పబ్లిసిటీని మోసుకుంది.
ఇందులో లీల తప్పు కూడా ఉంది. ఒకే మూసలో ఉండే పాత్రలను ఒక ఉద్యమంలా చేసుకుంటూ వెళ్తోంది. ఫ్లాపులు కూడా అంతే ఉదృతంగా వస్తున్నాయి. మాస్ జాతర ఆమె రొటీన్ మూసకి తాజా నిదర్శనం. అయితే ఇప్పుడీ రొటీన్ ఇమేజ్ నుంచి బయటపడే ఓ ప్రాజెక్ట్ శ్రీలీల చేతిలో ఉంది. అదే పరాశక్తి.
సుధ కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, అథర్వ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన వీడియోలో శ్రీలీల లుక్, క్యారెక్టర్లో కొత్తదనం కనిపించింది. పైగా సుధ కొంగర రిజినల్ ఫిల్మ్ మేకర్. గురు, ఆకాశమే నీ హద్దు లాంటి మంచి సినిమాలు చేసింది. ఆమె రాసే క్యారెక్టర్లు రొటీన్‌కి దూరంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలీలకీ అదే కావాలి. సుధ రూపంలోనైనా లీల రొటీన్ ట్రాప్ నుంచి బయటపడుతుందేమో చూడాలి.
