వహ్వా…సుజనా ఆత్మవిశ్వాసం, ఆశాభావం…అధరహో

తెలుగు ప్రజలెవ్వరూ కూడా మరోసారి సుజనాచౌదరి లాంటి నాయకుడిని చూడడం కష్టమే. ఇంతకుముందు ఇలాంటి నాయకుడు ఎవరూ లేరు. ఇకపైనా రాబోరు. సుజనాని చంద్రబాబు ఎక్కడ పట్టాడో కానీ జనాలకు, జర్నలిస్టులకు మాత్రం ఒక పట్టాన అర్థం కావడం లేదు. సుజనా మాటలు నమ్మకుండా వదిలేద్దాం అనుకున్నా కూడా వదలలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు తరపున ఢిల్లీలో రాచకార్యాలు నిర్వహిస్తున్న సీనియర్ లీడర్ మరి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌ని కలిసి అందరినీ ఆశ్ఛర్యపరిచాడు. ఇక మోడీ, చంద్రబాబులు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఢిల్లీలో సుజనా హంగామా మామూలుగా లేదు. నరేంద్రమోడీతో సహా ఢిల్లీలో ఉన్న నాయకులందరినీ కూడా తరచుగా కలుస్తూ ఉన్నాడు. మంత్రులందరినీ ఎందుకు కలుస్తున్నాడో చెప్పడం చాలా కష్టం కానీ బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఆనందంలో ముంచెత్తే మాటలే చెప్తూ ఉన్నాడు. సుజనా చౌదరి మాట్లాడినంత నమ్మకంగా చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కూడా మాట్లాడలేకపోతున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో సుజనా చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టిడిపి నేతలను కూడా షాక్‌కి గురిచేస్తూ వారంలో ప్రత్యేక హోదా వచ్చేస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పిన ఘనత సుజనాది. అలాగే రైల్వే జోన్, పోలవరంలాంటి విషయాల్లో కూడా అంతే ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవాడు సుజనా. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలతో అందరికీ షాక్ ఇచ్చాడు సుజనా. 2019 ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే సీట్లు పెరిగే అవకాశమే లేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రప్రభుత్వం. ఆ తర్వాత నుంచీ వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడులు కూడా సీట్ల పెంపు విషయం గురించి మాట్లాడడం మానేశారు. కానీ సడన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుజనా చౌదరి నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభమయిందని కాన్ఫిడెంట్‌గా చెప్పేశారు. కేంద్ర హోం శాఖ సంబంధిత పత్రాలను సిద్ధం చేసిందని చెప్పాడు. వారంలో ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చెప్పిన స్టైల్‌లోనే నియోజక వర్గాల పెంపు బిల్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని చెప్పాడు. మరి ఈ సారైనా సుజనావారి వాక్కు ఫలిస్తుందేమో చూడాలి. లేకపోతే మాత్రం ఇకపైన సుజనా మాటలను నమ్మేవాళ్ళు ఎవరూ ఉండరేమో. నియోజకవర్గాలు పెరగవు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యం….చంద్రబాబుతో సహా రాష్ట్ర స్థాయి నాయకులెవ్వరికీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న నమ్మకం లేని ప్రస్తుత పరిస్థితుల్లో సుజనా చెప్పినట్టుగా జరిగితే మాత్రం ఆయన హీరోయిజం మామూలుగా ఉండదేమో. తేడా వస్తే మాత్రం సుజనా చౌదరి ఇక ఎప్పటికీ కమెడియన్‌గా మిగిలిపోవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com