విభ‌జ‌న హామీల‌పై సుజ‌నా మొక్కుబ‌డి నిల‌దీత‌..!

హైకోర్టు విభ‌జ‌న త్వ‌ర‌గా చేప‌ట్టాలంటూ లోక్ స‌భ‌లో తెలంగాణ ఎంపీలు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా ఒక ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. తాత్కాలిక హైకోర్టు భ‌వ‌నం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ని త‌మ‌కి తెలిసిందంటూ ప్ర‌భుత్వం చెప్పింది. అయితే, ఇదే త‌రుణంలో ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి స్పందిస్తూ… హైకోర్టు విభ‌జ‌న మాత్ర‌మే కాదు, ఆంధ్రాకి ఇచ్చిన ఇతర హామీల‌పై కూడా కేంద్రం స్పందించాల‌ని మాట్లాడ‌టం విశేషం! ప్ర‌త్యేక హోదాతో స‌హా ఇచ్చిన విభ‌జ‌న హామీల‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌నీ, వెంట‌నే వీటిపై ప్ర‌త్యేక దృష్టి సారించాలంటూ కోర‌డం విశేషం! ఈ విష‌యాన్ని సుజ‌నా ప్ర‌స్థావిస్తుండ‌గా స్పీక‌ర్ స్పందించి.. ‘మీరు కేంద్రమంత్రి అనే విషయాన్ని దృష్టిలోపెట్టుకుని మాట్లాడుతున్నారు కదా’ అంటూ ప్ర‌శ్నించారు. త‌న‌కి ఆ విష‌యం గుర్తుంద‌నీ, ఆ హోదాలోనే ప్ర‌భుత్వాన్ని అడుగుతున్నానంటూ సుజ‌నా చెప్పారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌రోసారి రొటీన్ స‌మాధాన‌ంగా ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తాం అనేసింది.

నిజానికి, ఈ అంశాల‌ను సుజ‌నా చౌద‌రి లోక్ స‌భ‌లో ప్రస్థావించిన ప‌నిలేదు. ఎందుకంటే, టీడీపీ కూడా భాజ‌పాకి భాగ‌స్వామ్య ప‌క్ష‌మే క‌దా. నేరుగా కేంద్ర‌మంత్రుల‌తో మాట్లాడే అవ‌కాశం ఉంది. స‌రే, ప్ర‌ధానితో మాట్లాడే ఛాన్స్ ఈ మ‌ధ్య ద‌క్క‌డం లేద‌నుకోండి! మ‌రి, లోక్ స‌భ‌లోనే సుజ‌నా ఈ త‌ర‌హాలో టీడీపీ స్వ‌రాన్ని ఎందుకు వినిపించిన‌ట్టు అంటే.. దానికీ ఓ ప్ర‌త్యేక కార‌ణం కనిపిస్తోంది. హామీల విష‌యంలో కేంద్రాన్ని ఆంధ్రా నిల‌దీయ‌డం లేద‌నే విమ‌ర్శ ఎప్ప‌ట్నుంచో ఉంది. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం కొర్రీలు, రాజ‌ధాని నిధులు.. ఇలాంటి చాలా అంశాలపై కేంద్రం తీరు ఎంత‌గా చ‌ర్చ‌నీయం అవుతున్నా నిల‌దీసేంత తీవ్రంగా టీడీపీ నేత‌లు మాట్లాడిన సంద‌ర్భాలు లేవు.

అయితే, మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌ల రాబోతున్నాయి. పొత్తుల విష‌యంలో కేంద్రం వైఖ‌రిలో కొంత మార్పు గ‌ణ‌నీయంగా క‌నిపిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల‌ను నూటికి నూరు శాతం నెర‌వేర్చుతుంద‌న్న భ‌రోసా క‌నిపించ‌డం లేదు. ఇంకోప‌క్క వైకాపా కూడా ప్ర‌త్యేక హోదాపై పార్ల‌మెంటు వేదిక‌గా పోరాటం అంటోంది. చివరి అస్త్రంగా రాజీనామాలను ప్రయోగిస్తామంటున్నారు. అదెప్పుడో తెలీదు.. అది వేరే చ‌ర్చ‌! కాబ‌ట్టి, టీడీపీ కూడా ఇప్ప‌ట్నుంచే ఒక ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్ మీద కేంద్రాన్ని నిల‌దీస్తున్న‌ట్టుగా కనిపించాల్సిన అవ‌సరం ఉంది! అప్పుడే క‌దా.. ఎన్నిక‌ల‌కు వెళ్లినా ప్ర‌జ‌ల్లో త‌మ ప్ర‌య‌త్నం ఇద‌నీ, కేంద్రాన్ని పార్ల‌మెంటు సాక్షిగా నిల‌దీసినా మ‌న స‌మ‌స్య‌ల్ని భాజపా గుర్తించ‌లేద‌నే పోరాట ప‌టిమ‌ను ప్ర‌చారం చేసుకునే వీలుంటుంది. ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది కాబ‌ట్టే.. భ‌విష్య‌త్తులో ఎదురుకాబోయే ప్ర‌శ్న‌ల కోస‌మే ఇలా ఢిల్లీ స్థాయిలో టీడీపీ స్వరం పెంచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిజానికి, సుజ‌నా అడిగింది కొత్త విష‌యం కాదు. భాజ‌పా స్పంద‌నా కొత్త‌ది కాదు. కాక‌పోతే, లోక్ స‌భ వేదిక‌గా ఇది జ‌ర‌గ‌డంలో టీడీపీ వ్యూహాత్మ‌క కోణం ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.