ఎన్టీఆర్ కోసం సుక్కు చెప్పిన క‌థ‌

సుకుమార్ నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన చిత్రం `ద‌ర్శ‌కుడు`. సినిమా చిన్న‌దే అయినా.. ప్ర‌మోష‌న్లు భారీగా చేయించాల‌ని చూస్తున్నాడు సుక్కు. అందుకే… టీజ‌ర్ రిలీజ్ కోసం ఎన్టీఆర్‌ని తీసుకొచ్చాడు. త‌న ప‌రిచ‌యాల్ని ఇలా ప్ర‌మోష‌న్ కోసం సుకుమార్ వాడేసుకొంటున్నాడ‌ని జ‌నం అనుకొంటార‌ని సుక్కుకి తెలుసు. అందుకే త‌న మీద తానే కౌంట‌ర్లు వేసుకొన్నాడు. `ఎన్టీఆర్‌ని వాడుకోవ‌డం త‌ప్పడం లేదు` అని వేదిక‌పైనే అనేశాడు. అంతే కాదు ఓ చిట్టి క‌థ చెప్పి అంద‌రినీ ఆక‌ట్టుకొన్నాడు సుక్కు.

”ఓ బౌద్ధ గురువు త‌న శిష్యుడితో క‌ల‌సి ప్ర‌యాణిస్తున్నారు. మార్గ మ‌ధ్య‌లో ఓ యువ‌తి క‌నిపించింది. ‘న‌న్ను ఈ యేరు దాటించండి’ అని అడిగింది. ఓ అమ్మాయిని ముట్టుకోవ‌డానికి శిష్యుడు ఒప్పుకోలేదు. కానీ ఆ గురువు మాత్రం అమ్మాయిని ఎత్తుకొని ఏరు దాటించాడు. గురువు గారు అమ్మాయిని ఎలా ముట్టుకోగ‌లిగారో శిష్యుడికి అర్థం కాలేదు. ప్ర‌యాణం మొత్తం పూర్త‌య్యాక‌, ఇక ఉండ‌బ‌ట్ట‌లేక అడిగేశాడు. ‘స్వామి ఓ బౌద్ధ‌మ‌త గురువు అయ్యుండి ఓ అమ్మాయిని ఎలా తాకారు? ఆ అమ్మాయిని ఎలా మోశారు’ అని. ‘ఓరి పిచ్చోడా… నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దించేశా. నువ్వు ఇంకా ఆ అమ్మాయిని మ‌న‌సులో మోస్తూనే ఉన్నావా’ అన్నాడు బౌద్ధ గురువు. `నాన్న‌కు ప్రేమ‌తో` సినిమాని వ‌డ్డున చేర్చి వ‌దిలేశాడు గానీ, శిష్యుడిలా నేను ఆ ప్రేమ‌ను ప‌ట్టుకొని వేళాడుతూనే ఉన్నా.. “ అని చ‌మ‌త్క‌రించాడు సుక్కు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com