రివ్యూ: సుల్తాన్‌

రేటింగ్: 2/5

కార్తీపై తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా న‌మ్మ‌కం. కొత్త త‌ర‌హా క‌థ‌లు ఎంచుకుంటాడ‌ని. ఒక సినిమాకీ మ‌రో సినిమాకీ సంబంధం లేని పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని. ఈ న‌మ్మ‌కాన్ని చాలాసార్లు నిల‌బెట్టుకుంటూనే వ‌చ్చాడు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా, కొత్త త‌ర‌హా సినిమాల్ని అందించే ప్ర‌య‌త్న‌మైతే దిగ్విజ‌యంగా చేశాడు. యుగానికొక్క‌డు, ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. అందుకే తెలుగు నాట కార్తికి మైలేజీ పెరుగుతూ వ‌స్తోంది. తాజాగా `సుల్తాన్` అవ‌తారం ఎత్తాడు. ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు బాగా క్లిక్ అయ్యాయి. ఈ సినిమాపై అంచ‌నాలు పెంచాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ర‌ష్మిక ఉండ‌నే ఉంది. అందుకే.. సుల్తాన్ పై ఫోక‌స్ రెట్టింప‌య్యింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? సుల్తాన్ తో కార్తీ త‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడా? లేదా?

క‌థ‌లోకెళ్దాం. సేతుప‌తి (నెపోలియ‌న్‌) ద‌గ్గ‌ర కౌర‌వులుగా చెప్పుకునే వంద మంది రౌడీ బ్యాచ్ ఆశ్ర‌యం పొందుతుంటారు. సేతుప‌తి వార‌సుడు సుల్తాన్ (కార్తి) వాళ్ల చేతుల్లోనే పెరుగుతాడు. ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌న‌కు ఈ గ్యాంగ్ వార్‌లూ, గొడ‌వలూ అంటే న‌చ్చ‌వు. ఈ విష‌యంపైనే తండ్రితో గొడ‌వ ప‌డుతుంటాడు. అయితే… సేతుప‌తి ఈ వంద మంది కౌర‌వుల బాధ్య‌త‌నూ సుల్తాన్ ని అప్ప‌గించి క‌న్నుమూస్తాడు. సిటీకి కొత్త‌గా వ‌చ్చిన పోలీస్ ఆఫీస‌ర్ రౌడీల్నంద‌రినీ ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం మొద‌లెడ‌తాడు. త‌న నుంచి… కౌర‌వుల్ని కాపాడ‌డం కోసం అంద‌ర్నీ తీసుకుని మ‌రో ఊరు తీసుకెళ్లిపోతాడు. అక్క‌డ ఈ వంద మంది చేత వ్య‌వ‌సాయం చేయిద్దామ‌నుకుంటాడు. అయితే ఆ ఊర్లో మ‌రో స‌మ‌స్య కూడా ఉంటుంది. ఆ స‌మ‌స్య‌ని సుల్తాన్ ఎలా తీర్చాడు? ఈ వంద‌మంది ఎలా మారారు? అనేదే మిగిలిన క‌థ‌.

చెప్పుకోవ‌డానికి కావ‌ల్సినంత క‌థ ఉంది ఇందులో. క‌థ‌లో ఉప క‌థ‌లు, వాటిలో మ‌ళ్లీ కావ‌ల్సిన‌న్ని పాత్ర‌లు. క‌థ లేకుండా సినిమాని న‌డిపేయ‌డం ఎంత క‌ష్ట‌మో, కావ‌ల్సిన దానికంటే పెద్ద క‌థ‌లు రాసుకున్నా అంతే క‌ష్టం. సుల్తాన్ స‌మ‌స్య ఇదే. చెప్ప‌డానికి బోలెడంత ఉంది. పైగా తెర నిండా జ‌నం. కౌర‌వుల క‌థ క‌దా. అందుకే ప్ర‌తీ ఫ్రేములోనూ ఆ వంద మందినీ చూడాల్సిందే. నిజానికి మంచి పాయింట్ ఇది. వంద మంది రౌడీల బాధ్య‌త‌ని హీరో తీసుకోవ‌డం, వాళ్ల‌ని మంచి వాళ్లుగా మార్చ‌డం.. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్. కాక‌పోతే… సినిమా అంతా త‌మిళ వాస‌న‌. వాళ్ల అతి. ఆ వ్య‌వ‌హారాలు మ‌న వాళ్ల‌కు ఏమాత్రం న‌చ్చ‌వు.

శ్రీ‌కృష్ణుడు పాండ‌వుల ప‌క్షంలో కాకుండా.. కౌర‌వుల ప‌క్ష‌మైతే ఎలా ఉంటుంద‌న్న ఊహ‌కు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌.. సుల్తాన్‌. ఈ విష‌యం క‌థ‌లో లేయ‌ర్స్‌ని అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. వంద‌మంది మూర్ణుల్ని మార్చడం అంత తేలికైన విష‌యం కాదు. తొలి స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా సాగాయి. యోగిబాబు బ్యాచ్ చేసే కామెడీ న‌వ్విస్తుంది. అయితే అస‌లు క‌థ‌కు స‌బ్ ఫ్లాట్లు ఎప్పుడైతే… తోడ‌వ్వ‌డం మొద‌ల‌య్యిందో.. అప్ప‌టి నుంచి క‌థ భారంగా మారుతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో `ఇది కూడా ఉంది..` అన్నట్టు హీరో – హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంటుంది. యాక్ష‌న్ సీన్ల‌ని ద‌ర్శ‌కుడు బాగా డిజైన్ చేసుకోగిలిగాడు. దాంతో.. మాస్ కి ఆయా స‌న్నివేశాలు న‌చ్చుతాయి. సినిమా అంతా.. బీ, సీ ఆడియ‌న్స్ ని దృష్టిలో ఉంచుకుని రాసుకున్న సీన్లే. పైగా త‌మిళ డోసులో. కాబ‌ట్టి… వాటిని భ‌రించ‌డం కొంచెం క‌ష్ట‌మే.

క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా రాసుకోలేక‌పోయాడు. సినిమా అంతా ఫ్లాటుగా సాగుతుంటుంది. త‌ర‌వాతి సన్నివేశం ఏమిట‌న్న‌ది సుల‌భంగా ఊహించేయొచ్చు. క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌ను అనుగుణంగా ఓ మాస్ మ‌సాలా సినిమాని.. త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచికి న‌చ్చేలా ద‌ర్శ‌కుడు తీయ‌గ‌లిగాడు.కాక‌పోతే ఆ అతి త‌మిళ ప్రేక్ష‌కులు సైతం భ‌రించ‌లేనంత‌గా ఉండ‌డం విషాదం. ఇక వీకెండ్ వ్య‌వసాయం, సేంద్రియ వ్య‌వ‌సాయం లాంటి కాన్సెప్టులు చూసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ రౌడీల వ్య‌వ‌సాయం అనే లైన్ ఏమంత కొత్త‌గా అనిపించ‌దు. పైగా… అస్త‌మానూ ఇవే క‌థ‌లా? అంటూ లైట్ తీసుకునే ప్ర‌మాదం ఉంది.

కార్తి చాలా జోవియ‌ల్ గా చేసేశాడు. పోరాట స‌న్నివేశాల్లో ఇంకా ఈజ్ గా క‌నిపించాడు. ర‌ష్మిక ఈ సినిమాలో అదోలా క‌నిపించింది. బ‌హుశా తెలుగు సినిమాల్లో చూసిన ర‌ష్మిక‌ని త‌మిళ నేటివిటీలో చూడ‌డం ఇబ్బంది అనిపించిందేమో..? జోగిబాబు ఓకే అనిపించాడు. త‌నే కాస్త ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచాడు. కేజీఎఫ్ లాంటి సినిమాల్లో భ‌య‌పెట్టిన రామ్ ని స‌రిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది.
పాట‌లేవీ గుర్తుండ‌వు. నేప‌థ్య సంగీతంలో ఒక‌టే రొద‌. పాటల ప్లేస్‌మెంట్ కూడా న‌చ్చ‌దు. అన్నింటికంటే ముఖ్యంగా నిడివి ప‌రంగా ఈ సినిమా చాలా పెద్ద‌ది. ఎడిట‌ర్ ఇంకాస్త మ‌న‌సు పెట్టి క‌త్తెర‌కు ప‌నిచెబితే అర‌గంట త‌గ్గొచ్చు.

మొత్తానికి చాంతాడంత క‌థ‌ని ప‌ట్టుకుని కూడా ద‌ర్శ‌కుడు ఒకే చోట గింగిరాలు తిరిగి.. ప్రేక్ష‌కుల‌కు త‌ల‌నొప్పి వ‌చ్చేలా చేశాడు. ట్రైల‌ర్లూ, టీజ‌ర్లూ, టైటిళ్లూ బాగుంటే సినిమా బాగుంటుంద‌న్న రూలేం ఉండ‌ద‌న్న విష‌యాన్ని `సుల్తాన్` మ‌రోసారి చాటి చెప్పాడు.

రేటింగ్: 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close