అక్కినేని సుమంత్ ఖాతాలో కొన్ని మంచి విజయాలే ఉన్నాయి. గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా.. ఇలా డిఫరెంట్ సినిమాలు, జోనర్లతో ఆకట్టుకొన్నాడు. ఇటీవల ఈటీవీ విన్ కోసం `అనగనగా` చేశాడు. అదీ తనకు మంచి పేరే తీసుకొచ్చింది. ఇప్పుడు మైథలాజికల్ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమా పూర్తి చేశాడు. అదే.. ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. సుమంత్ పై ఇంత బడ్జెట్ అంటే వర్కవుట్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తడం సహజం. అయితే ఈ సినిమా కోసం ఆయన ఓ స్పెషల్ ప్యాకేజీ సిద్ధం చేశారు. ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక పాత్రలు ఉన్నాయి. వాటి వల్ల ఈ సినిమాకు కావాల్సినంత మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నారు.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆయనది చిన్న పాత్రేం కాదు. రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తారు. కథానాయిక కీర్తి సురేష్ కూడా కామియో చేయబోతోందని సమాచారం. అయితే ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా షూట్ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు మినహా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఆ అవుట్ పుట్ కూడా బాగా వచ్చిందని సమాచారం. ఫైనల్ కాపీ రెడీ అయ్యాక రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఈలోగా ఓ టీజర్ ని సిద్ధం చేస్తున్నారు.
