సురేష్‌బాబు ‘సినిమా’ పాఠాలు.. వాటి వెనుక వాస్త‌వాలు

చిత్ర‌సీమ‌దంతా పైన ప‌టారం లోన లొటారం వ్య‌వ‌హారం. అంతా బాగున్న‌ట్టే ఉంటుంది, కానీ లోప‌లంతా డొల్ల‌. నిజాలు మాట్లాడుకునే ధైర్యం ఎవ్వ‌రూ చేయ‌రు, చేయ‌లేరు. కానీ.. చాలా కాలం త‌ర‌వాత సీరియ‌ర్ నిర్మాత డి.సురేష్ బాబు నిజాలు మాట్లాడారు. స‌క్సెస్ మీట్ల‌పై సెటైర్ వేశారు. శాటిలైట్ వ్య‌వ‌హారంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. థియేట‌ర్లు ఎలా ఉండాలి? ప‌ర్సంటేజీ విధానం ఏమిటి? ఇలాంటి సీరియ‌స్ విష‌యాల‌పై చాలా సిన్సియ‌ర్‌గా మాట్లాడారు.

మెంట‌ల్ మ‌దిలో స‌క్సెస్ మీట్ ఈరోజు (గురువారం) రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. `మా సినిమా ఇర‌గాడింది.. అదుర్స్ బెదుర్స్‌` లాంటి ప‌డిక‌ట్టు ప‌దాలేం వాడ‌లేదు. ప‌రిశ్ర‌మ విష‌యాల గురించి సీరియెస్ టాపిక్ న‌డిచిందిక్క‌డ‌. ఒక‌రోజు, ఒక పూట ఆడినా స‌క్సెస్ మీట్ పెట్టేస్తున్నార‌ని, వాటి మ‌ధ్య నిజంగా స‌క్సెస్ అయిన సినిమాల‌కు విలువ లేకుండా పోతోంద‌న్న‌ది ఆయ‌న పాయింట్‌. మెంట‌ల్ మదిలో సినిమాకి మంచి రేటింగులు వ‌చ్చాయి. కానీ ఆ స్థాయిలో వ‌సూళ్లు రాలేదు. దానికి కార‌ణం.. డిజిట‌లైజేష‌న్ అన్న‌ది సురేష్ బాబు అభిప్రాయం. శాటిలైట్ వ్య‌వ‌స్థ పూర్తిగా మారిపోయింది. ఇది వ‌ర‌కు సినిమా విడుద‌లైన సంవ‌త్స‌రం వ‌ర‌కూ టీవీలో వ‌చ్చేది కాదు. అది ఆర్నెళ్లు అయ్యింది. ఇప్పుడు నెల‌కే సినిమా వ‌చ్చేస్తోంది. ఈ ద‌శ‌లో జ‌నాలు థియేట‌ర్‌కి ఎందుకు వ‌స్తారు?? అనేది సురేష్ బాబు పాయింట్‌. వాళ్లంతా థియేట‌ర్
ఎక్స్‌పీరియ‌న్స్ మిస్ అవుతున్నార‌న్న‌ది ఆయ‌న ఆవేద‌న‌.

థియేట‌ర్ల ప‌ర్సంటేజీ విధానంపై కూడా నిజాయ‌తీగానే మాట్లాడారాయ‌న‌. చిన్న సినిమాలు ప‌ర్సంటేజీల‌పై ఆడించ‌మంటున్నారు? పెద్ద సినిమాల‌కు రెంట‌ల్ ప‌ద్ధ‌తి బెట‌ర్ అంటున్నారు. దానికి థియేట‌ర్ యాజ‌మాన్యం సిద్ధంగా లేదు. ”ఆడిస్తే చిన్నా, పెద్ద సినిమాలు రెండింటినీ ప‌ర్సంటేజీల‌పైనే ఆడించండి” అనేది థియేట‌ర్ యాజ‌మాన్యాల మాట‌. మ‌ల్టీప్లెక్స్‌లో చిన్న సినిమా, పెద్ద సినిమా రెండూ ప‌ర్సంటేజీల‌పైనే ఆడుతుంది. కానీ సింగిల్ స్ర్కీన్స్‌ల‌లో ఇది క‌ష్టం. పెద్ద సినిమా నిర్మాత‌లు ప‌ర్సంటేజీకి ఒప్పుకోవ‌డం లేదు. చిన్న‌వాళ్లేమో రెంట‌ల్ క‌ట్ట‌డానికి రెడీగా లేరు. నిర్మాత‌లంతా కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణ‌యానికి వ‌స్తే త‌ప్ప‌… ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవ్వ‌దు. చిన్న సినిమాలు ఆడాలంటే, నిల‌బ‌డాలంటే, చిన్న సినిమా వాడూ బ‌త‌కాలంటే.. ప‌ర్సంటేజీ విధాన‌మే స‌రైంది. కానీ పెద్ద నిర్మాత‌లు అంగీక‌రిస్తారా, లేదా అనేదే పాయింటు. సురేష్ బాబు ఇప్పుడంటే చిన్న సినిమాలు తీస్తున్నాడు. కానీ ఆయ‌నా ఓ పెద్ద నిర్మాతే. త‌నైతే…. ప‌ర్సంటేజీల‌కు ఒప్పుకుంటాడా..??

చిత్ర‌సీమ‌లో స‌మిష్టిత‌త్వం లేద‌న్న‌ది సురేష్ బాబు మాటల్లో అర్థ‌మౌతోంది. ఎవ‌రికి వాళ్లు త‌మ సినిమా బ‌య‌ట‌ప‌డిపోతే చాల‌నుకుంటున్నారు. అదే పెద్ద స‌మ‌స్య‌గా మారింది. స‌క్సెస్ మీట్ అనేది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది. సినిమా విడుద‌ల రోజునే స‌క్సెస్ మీట్ ఏమిటి? చోద్యం కాక‌పోతే. సురేష్ బాబు కుటుంబంలో ఉన్న హీరోలూ అలాంటి స‌క్సెస్ మీట్లు పెట్టిన వాళ్లే కదా??

శాటిలైట్ విష‌యానికొద్దాం. చిన్న సినిమాల‌కు శాటిలైట్ ఓ వ‌రం. ఒక్కోసారి బ‌డ్జెట్ మొత్తం శాటిలైట్ రూపంలో వ‌చ్చేస్తుంది. అదే పెద్ద సినిమా అనుకోండి. నైజాం ఏరియా ఎంత ప‌లుకుతుందో, శాటిలైట్ అంత ప‌లుకుతుంది. సినిమా మార్కెట్, స్టామినా పెర‌గ‌డానికి శాటిలైట్ దోహ‌దం చేస్తోంది. ఓ సినిమాకి ఓ టీవీ ఛాన‌ల్ ప‌ది కోట్ల‌కు ఎందుకు కొంటుంది?? రూ.20 కోట్లు రాబ‌ట్టుకోవ‌డానికే క‌దా. ఆ రూ.20 కోట్లు రావాలంటే.. యేడాది పోయిన త‌ర‌వాత సినిమాని వేస్తుందా?? సినిమా విడుద‌లైన రెండో రోజుకే హెచ్ డీ క్వాలిటీ పైర‌సీ ప్రింటు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంటే.. ఓ సినిమా సంవ‌త్స‌రం వ‌ర‌కూ టీవీలో ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండ‌గ‌ల‌దా??

పైర‌సీ ఆప‌డానికి నిర్మాత‌ల మండ‌లి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకొంటోంది. కానీ స‌రైన ఫ‌లితాలు రావ‌డం లేదు. థియేట‌ర్‌లో రెంట‌ల్స్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. టికెట్ ధ‌ర‌లే విప‌రీతంగా పెరుగుతున్నాయి. అంతా పెట్టి సినిమాకి వెళ్తే… స‌మోసా నుంచి మంచినీళ్ల ప్యాకెట్ వ‌ర‌కూ అన్ని చోట్లా దోపిడి. పార్కింగ్ ద‌గ్గ‌ర జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇవ‌న్నీ స‌మ‌స్య‌లే. ఇన్ని ఇబ్బందులు ప‌డుతూ.. ఓ ప్రేక్ష‌కుడు సినిమా థియేట‌ర్‌కి వెళ్ల‌గ‌ల‌డా?? స‌మ‌స్య‌లు ప‌రిశ్ర‌మ త‌ర‌పునుంచే కాదు, ప్రేక్ష‌కుడి త‌ర‌పునుంచి కూడా ఆలోచించాలి. టికెట్ రేటుకి గిట్టుబాట‌య్యే వినోదం ఇస్తున్నామా, లేదా అనేది ప్ర‌శ్నించుకోవాలి. అప్పుడు నిర్ణ‌యాలు తీసుకొంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.