NGK : అరాజకీయం..అరాచకం

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

చదువు ఎక్కువైతే కాకరకాయ ను కీకర కాయ అన్నాడన్నది సామెత. మేధావితనం ఎక్కువైపోయిన డైరక్టర్ల కన్నా, కమర్షియల్ డైరక్టర్లే బెటర్ అనిపిస్తారు ఒక్కోసారి. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, గతంలో కార్తీ నటించిన శకుని అనే సినిమా వచ్చింది. తన లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రినే కిందకు దించడానికి ఎత్తులు పై ఎత్తులు వేసిన కుర్రాడి కథ అది.

ఇప్పుడు ఈ వారం.సూర్య నటించిన ఎన్ జి కె సినిమా వచ్చింది. ప్రజలకు మేలు చేయాలంటే పొలిటికల్ పవర్ అవసరం అని గుర్తించి, ఆ దిశగా అడుగులు వేసి ఎదిగిన కుర్రాడి కథ ఇది.

కానీ శకుని సినిమా కామన్ మాన్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే, ఎన్ జి కె సినిమా తమిళ రాజకీయాలను, నాయకులను గుర్తు చేస్తూ, ప్రజలను కూడా తప్పుపడుతూ, ఒకేసారి రకరకాల విషయాలు అన్నీ చెప్పేయాలని చేసిన ప్రయత్నం.

ఏ సినిమాకు అయినా దర్శకుడిదే కీలక బాధ్యత. ఏ కథను ఎలా చెప్పాలి? ఎలా చెబితే జనరంజకం అవుతుంది? ఎలా చెబితే జనానికి బోర్ కొట్టదు? అన్నది తెలుసుకుని తీయాలి. అలా కాకుండా ఇది స్టయిల్ …ఇలాగే చెబుతా..ఇలాగే చెప్పాలి..అనుకుంటూ తీస్తే, జనం చూస్తే చూస్తారు..లేదూ అంటే లేదు.

ఇంతకీ ఎన్ జి కే కథేంటీ అంటే, బాగా చదువుకుని,ఉద్యోగం చేయకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు ఎన్ జి కె (నంద గోపాల కృష్ణ). కానీ అతగాడు జనాల్లో ఆర్గానికి వ్యవసాయాన్ని ప్రచారం చేయడం కొంతమందికి ఇష్టం వుండదు. అదే సమయంలో జనాలకు చాతనైన సేవ, సహాయం చేయడం ఎన్ జి కే అలవాటు. కానీ అలా చేయడానికి ఎన్నో అడ్డంకులు. అప్పుడు తెలుస్తుంది. పొలిటికల్ పవర్ వుంటే తప్ప ఏమీ చేయలేం అని. దాంతో లోకల్ ఎమ్మెల్యేను ఆశ్రయించి, రాజకీయాల్లో దిగుతాడు. ఇక్కడ అక్కడ ప్రారంభమైన కథ, సిఎమ్ అయ్యేవరకు చిత్ర విచిత్రంగా ‘సాగు’తుంది.

మరీ చెప్పాలనుకున్న విషయం ఎక్కువైనపుడు భయంకరమైన కన్ఫ్యూజన్ గ్యారంటీ. అలాంటపుడు ఏవి చెప్పాలి..ఏవి వదలాలి? అన్న క్లారిటీ దర్శకుడికి వుండాలి.

పురుగుమందులు, ఆర్గానిక్ వ్యవసాయం. రాజకీయ పలుకుబడి, కార్యకర్తల చేత చాకిరీ చేయించుకునే నాయకులు, తెరవెనుక మిలాఖత్ అయ్యే అధికార ప్రతిపక్షాలు, పార్టీల కోసం వ్యూహ రచన, సోషల్ మీడియా మేనేజ్ మెంట్ చేసే నిపుణులు, ఎదిగే వాడిని తొక్కేసే వ్యూహాలు, వీటన్నింటికి తోడు, తల్లీ కొడుకుల అనుబంధం, బార్యా భర్తల సంబంధాలు, అనుమానాలు, తండ్రీ కొడుకుల వ్యవహారాలు, ఇవీ చాలవన్నట్లు ఇంకా కొసరు సంగతులు. అవేంటీ అంటే, సినిమాలో తమిళనాడు దివంగత నేత ఎంజిఆర్ ను గుర్తుకు తెచ్చేలాంటి వ్యవహారాలు.

ఇవన్నీ కలిపి సిసింద్రీ గొట్టంలో మందు దట్టించినట్లు కూరేసాడు దర్శకుడు శ్రీరాఘవ. దానివల్ల ఏమయింది? అసలు ఏ విషయాన్ని పూర్తిగా డిస్కస్ చేసినట్లు లేదు, చాలా సీన్లలో క్లారిటీ లేదు. దీనికి బోనస్ కూడా వుంది. సినిమాలో గుప్పున కొట్టే తమిళవాసన అనబడు తమిళ నేటివిటీ.

సినిమా చాలా సీరియస్ నోట్ తో స్టార్ట్ అవుతుంది. థ్రిల్లర్ సినిమా లుక్ మాదిరిగా మాంచి వర్షంలో, పొలంలో కాలవ కప్పుతూనో, విప్పుతూనో హీరో ఎంట్రీతో. అంతలోనే హీరోయిజం, అతగాడి ఆశలు, ఆశయాలు ఎలివేట్ చేసే పాట. అంతలోనే రాజకీయల ప్రాధాన్యత తెలియడం, ఇక అక్కడి నుంచి సంతలో తప్పిపోయిన పిల్లాడిలా కథ దానంతట అది ఎలాగో అటు ఇటు తిరిగేస్తూ వుంటుంది. అక్కడక్కడ సూర్య నటన వల్ల చిన్న చిన్న మెరుపులు తప్పిస్తే, మిగిలినదంతా చినుకుచుక్కకు నోచుకోని ఎడారి చందమే.

అసలే ఉప్పు, కారం తగిలించని రాజకీయ సన్నివేశాలతో ప్రేక్షకుడు అరుచితో బాధపడుతుంటే, మధ్యలో సాయిపల్లవితో కొని తెచ్చిపెట్టిన వీర ఎమోషన్ సీన్లు మరోపక్క. మదిలో ఏముందో బయటకు చెప్పలేక, మాంచి బిజీ సెంటర్లో బాత్ రూమ్ కోసం పిచ్చి చూపులు చూసే టైపులో రకుల్ ప్రీత్ సింగ్ హావభావాలు మరోపక్క ప్రేక్షకులను మరింత ఇబ్బంది పెడతాయి.

ఒక దశలో సినిమాను థ్రిల్లర్ టర్న్ తీసేలా దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. దాంతో కామన్ ఆడియన్స్ కు కాస్త ఆసక్తి కలుగుతుందనే ఆశ చిగురిస్తుంది. కానీ అంతలోనే అది మళ్లీ రొటీన్ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం మీద సినిమాకు ఓ సరైన స్క్రిప్, దిశ, దశ అనేది లేకుండా దర్శకుడు శ్రీరాఘవ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పొరపాటున ఎక్కడ హిట్ అయిపోతుందనేమో తన పాటలతో అని యువన్ శంకర్ రాజా కూడా ఎప్పటిలాగే ఓ ఫెయిల్యూర్ అడియో ఇచ్చాడు.

సూర్య మంచి నటుడు. కానీ సూపర్ స్టార్ స్టేటస్ వున్నవాళ్లు అందరూ ఏం చేయాలి? ఏ కథ తీసుకోవాలని కిందామీదా అవుతున్నట్లే ఆయనా తడబడుతున్నాడు. ఆ తడబాటులో రకరకాల ఫ్రయోగాలు, అనేక మంది డైరక్టర్లతో చేసి, ఫ్లాపులు మూట గట్టకుంటూ, కెరీర్ గ్రాఫ్ ను అధోముఖంగా నడిపేస్తున్నాడు.
సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఒకె అనిపించుకుంటారు. మిగిలిన నటుల సంగతి ప్రేక్షకులకు ఎంతమాత్రం పట్టదు. నేపథ్య సంగీతం ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ కూడా. అంతకు మించి చెప్పుకునేంత సాంకేతిక విలువలు కావు.

దర్శకుడు సరైనవాడయి, సరైనదారిలో వెళ్తే, ఇలాంటి సినిమాలు చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగదు. కానీ శ్రీరాఘవ గతంలోనూ తన ప్రతాపం చూపించిన సినిమాలు వున్నాయి. ఇది కూడా వాటి సరసన చేరుతుంది.

ఫినిషింగ్ టచ్. సూపర్ స్టార్ కు మరో సూపర్ ఫ్లాప్

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com