డ్ర‌గ్స్ కేసు : జాలి చూపులు మొద‌లయ్యాయా?

ఎవ‌రైనా ఏదైనా త‌ప్పు చేసి దొరికిపోతే… ముందు కోప్ప‌డ‌తాం, అస‌హ్యించుకొంటాం. చివ‌రికి జాలి ప‌డ‌తాం. ‘డ్ర‌గ్స్‌’ దోషుల‌పై అలాంటి జాలి చూపులు మొద‌లైపోయాయి. డ్ర‌గ్స్ కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చిన పేర్లు చూసి… తెలుగు చిత్ర‌సీమ ఏమీ దిగ్భ్రాంతికి లోన‌వ్వ‌లేదు. ఎందుకంటే అందులో కొంద‌రిపై ముందు నుంచీ డ్ర‌గ్స్ విష‌యంలో అనుమానాలున్నాయి.అవి కాస్త రూఢీ అయ్యాయంతే! నందులాంటి యువ హీరోల పేర్లు కూడా ఈ లిస్టులో క‌నిపించ‌డం కాస్త బాధ క‌లిగించింది. కొంత‌మంది ”మాకు ఎలాంటి సంబంధం లేదు” అని మొత్తుకొంటున్నారు. ముమైత్ ఖాన్‌, సుబ్బ‌రాజులూ అదే మాట అంటున్నారు. ర‌వితేజ‌… ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.

చిత్ర‌సీమ‌లో చాలామంది ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో నోరు విప్పారు. ‘మా’ అయితే కాస్త అటూ ఇటుగా సినిమా వాళ్ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూనే మాట్లాడింది. ”మేమూ మ‌నుషులే.. మాకూ బ‌ల‌హీన‌తలు ” ఉంటాయ‌న్న‌ది వాళ్ల పాయింటు. ఒత్తిడికి స‌త‌మ‌త‌మై, అందులోంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలీక ఇలాంటి ద‌గ్గ‌రి దారిని వాడుకొంటున్నార‌న్న‌ది వాళ్ల మాట‌. ఒత్తిడి ఎవ‌రికి లేదు..?? సాఫ్ట్ వేర్‌లో ప‌నిచేసే ఉద్యోగి హాయిగా నెల పూర్త‌య్యేస‌రికి జీతం తీసుకొంటున్నాడా? ఎవ‌రి త‌ల‌నొప్పులు వాళ్ల‌వి. ‘మేం ఎవ్వ‌రినీ ఉపేక్షించం.. డ్ర‌గ్స్ తీసుకోవ‌డం ఘోరం.. నేరం’ అంటూ తొలి ప్రెస్ మీట్‌లో గ‌ట్టిగా చెప్పిన ‘మా’ స్వ‌రం.. ఇప్పుడు చ‌ల్ల‌బ‌డడం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. చూసేవాళ్ల దృష్టి కూడా అలానే మారుతోందిప్పుడు. ”అయ్యో పాపం.. ఇలా ఇరుక్కుపోయాడేంటి” అంటూ జాలి ప‌డుతున్నారు. డ్ర‌గ్స్ కేసులో చాలామంది ప్ర‌ముఖుల పేర్లున్నాయ‌న్న‌ది నిజం. అందులో కొన్నే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బ‌డా బ‌డా వాళ్లు త‌మ అధికారాన్నో, ప‌లుకుబ‌డినో చూపించి త‌ప్పించుకోగ‌లిగారు. ఆ స్థోమ‌త లేనివాళ్లు దొరికిపోయాడు అంటూ… ఈ 12 మందిపై జాలి ప్ర‌ద‌ర్శిస్తున్నారు చాలామంది. నేరం రుజువు కానంత వ‌ర‌కూ అంద‌రూ అమాయ‌కులే. దోషులెవ‌రో కాలం… చ‌ట్టం చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com