రేవంత్ మ‌న‌సులో ‘కాంగ్రెస్ పొత్తు’ మాట‌!

ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న‌ట్టుగా ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి! క‌లిసి పోరాడ‌దాం అనుకుంటూ ఉంటే.. క‌మ‌ల‌నాధులు దూరం పెడుతున్నారు. ఒంట‌రి పోరాడ‌దాం అనుకుంటే.. స‌రిప‌డా బ‌లం లేదాయె! ఇప్పుడు టీడీపీ ముందున్న ఒకే ఒక్క ఆప్ష‌న్… కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌డం! అయితే, ఇది అనుకున్నంత ఈజీగా కుదిరే పొత్తు కాదు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ మీద వ్య‌తిరేక‌త నుంచి! టీడీపీ గ‌త చ‌రిత్ర అంతా కాంగ్రెస్ పై పోరాట‌మే. ఇందిరా గాంధీని సైతం ఎదురెళ్లిన ఘ‌న చ‌రిత మాదీ అంటూ టీడీపీ గొప్ప‌గా చెప్పుకుంటుంది. అలా అని కాంగ్రెస్ తో పొత్తు కుద‌ర‌ని ప‌ని అని తీర్మానించెయ్య‌లేం! కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి రేవంత్ రెడ్డి అభిప్రాయం మ‌రోలా ఉంది.

భాజ‌పా – టీడీపీలు పొత్తులో ఉన్నాయి. అయితే, అది కేవ‌లం ఆంధ్రా వ‌ర‌కూ ప‌రిమితం అనేది భాజ‌పా నేత‌ల వాద‌న‌. తెలంగాణ‌కు వ‌చ్చేస‌రికి తెలుగుదేశం పార్టీని దూరం పెడుతూ వ‌స్తోంది భాజ‌పా. సోలోగానే స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్నాల్లో భాజ‌పా నిమ‌గ్న‌మైంది. ఈ క్ర‌మంలో తెలుగుదేశం నేత‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం మానేశారు! ఇదే అంశాన్ని ఇటీవ‌ల అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో రేవంత్ ప్ర‌స్థావించిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు విష‌యంలో రాష్ట్రానికో ర‌కంగా భాజ‌పా ఉంటోంది కాబ‌ట్టి… మ‌నం కూడా ఇత‌ర పార్టీల‌తో పొత్తు విష‌య‌మై కాస్త లిబ‌ర‌ల్ గా ఉంటే బాగుంటుంద‌నే అభిప్రాయం రేవంత్ వ్య‌క్తం చేశార‌ట‌. తెలంగాణ‌లో భాజ‌పా నేత‌ల తీరు అవ‌మాన‌క‌రంగా ఉంటోంద‌నీ, వారితో పొత్తు విష‌య‌మై స్ప‌ష్ట‌త‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండాలంటే పొత్తుల విష‌యంలో స్ప‌ష్ట‌త అవ‌స‌ర‌మ‌ని రేవంత్ మాట్లాడిన‌ట్టు స‌మాచారం.

ఇంత‌కీ, రేవంత్ మ‌న‌సులో మాట ఏంటంటే… కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే మంచిద‌ని ఇన్ డైరెక్ట్ గా క‌న్వే చేయ‌డం! ఎలాగూ ఆంధ్రాలో కాంగ్రెస్ తో టీడీపీకి కుద‌ర‌దు. కానీ, తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు ఉన్నాయి కాబ‌ట్టి… కాంగ్రెస్ తో జ‌తక‌ట్ట‌డం త‌ప్పులేద‌ని ఆయ‌న అభిప్రాయంగా తెలుస్తోంది. భాజ‌పాతో ప్ర‌యాణంపై చంద్ర‌బాబు ఒక క్లారిటీ ఇవ్వ‌గానే… కాంగ్రెస్ తో పొత్తుపై రేవంత్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, తెలంగాణ విష‌య‌మై త్వ‌ర‌లోనే అమిత్ షాతో చంద్ర‌బాబు మాట్లాడ‌తార‌నీ, అంత‌వ‌ర‌కూ ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న‌లు ఆపాలని చంద్ర‌బాబే సూచించిన‌ట్టు స‌మాచారం.

ఏదేమైనా, కాంగ్రెస్ తో పొత్తుకు రేవంత్ మాన‌సికంగా స‌న్న‌ద్ధ‌మైన‌ట్టుగానే సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం టీడీపీ, కాంగ్రెస్ జ‌త క‌డితే అది సంచ‌న‌ల‌మే. ఇదే జ‌రిగితే రాజ‌కీయాల్లో అవ‌స‌రాలు మాత్ర‌మే ఉంటాయ‌నీ, శ‌త్రుత్వాలు ఉండ‌వ‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.