నాలుగేళ్లు దాటితే ఎన్నిక‌ల హ‌డావుడి వ‌చ్చేసిన‌ట్టేన‌ట‌..!

హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోయే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ హ‌డావుడిలో మంత్రులంతా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌భాస్థ‌లంలో ఏర్పాట్ల‌ను స‌మీక్షించేందుకు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ స‌భ‌కు త‌ర‌లి వ‌చ్చేందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు చాలా ఉత్సాహంగా ఉన్నార‌న్నారు. కేసీఆర్ ఏం చేసినా సంచ‌ల‌న‌మేన‌నీ, ఈ స‌భ గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకునే విధంగా ఉంటుంద‌ని త‌ల‌సాని చెప్పారు. కేసీఆర్ నాలుగున్న‌రేళ్ల పాల‌న సంచ‌న‌ల‌మ‌నీ, దాని గురించి ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవ‌డం కోస‌మే ఈ స‌భ అన్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి మాట్లాడుతూ… ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌నీ, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు ఉంటాయ‌న్నారు. కానీ, నాలుగేళ్లు దాట‌గానే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రావ‌డం దేశంలో ఎక్క‌డైనా స‌హ‌జంగా ఉండేదే అని త‌ల‌సాని అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ అని ప్ర‌ధాన‌మంత్రి గ‌త ఏడాది చెప్పిన‌ప్పుడు కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పామ‌నీ, ప్ర‌జ‌ల మీద అచంచ‌ల విశ్వాసం త‌మ‌కు ఉంద‌న్నారు. రెండేళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్లు కూడా త‌మ‌ను అధికారం నుంచి త‌ప్పుకోండ‌ని మాట్లాడుతుంటే, తాము ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామంటూ ఈ మ‌ధ్య సీఎం మాట్లాడార‌న్నారు. ఎన్నిక‌లంటే త‌మ‌కు భ‌యం కాద‌నీ, అధికారంలో ఉన్న‌వారికి భ‌యం ఎందుకు ఉంటుంద‌న్నారు!

ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగేళ్లు దాట‌గానే ఎన్నిక‌ల హ‌డావుడి వ‌చ్చేస్తుంద‌ని త‌ల‌సాని చెప్ప‌డం వాస్త‌వ‌మే! కాక‌పోతే, ఆ హ‌డావుడి ప్ర‌తిప‌క్షాల‌కు ఉంటుంది. అంతేగానీ, అధికార పార్టీలో హ‌డావుడి ఎందుకు..? అధికార పార్టీకి మ‌రో ఏడాది, అంటే ఐదేళ్లు పూర్తిగా పాలించాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా కూడా ప‌రిపాల‌న చేయాలి క‌దా! నాలుగేళ్లు దాటింది కాబ‌ట్టి, తాము ఎన్నిక‌ల‌కు వెళ్లే ఉత్సాహంలో ఉన్నామ‌ని చెబుతుంటే విడ్డూరంగా ఉంది. ఓప‌క్క‌… ప్ర‌జ‌ల‌పై త‌మ‌కు అంచంచ‌ల విశ్వాసం ఉందంటారు, తెలంగాణ‌లో గులాబీ జెండా త‌ప్ప, మ‌రొక‌టి ఎగ‌ర‌దంటారు. కానీ, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు సిద్ధ‌ప‌డుతున్నారు అనే ప్ర‌శ్న‌కు తెరాస నుంచి ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన స‌మాధానం రాలేదు. స‌భ భారీత‌నం మీదే తెరాస నేత‌ల దృష్టంతా ఉంది. దేశ‌వ్యాప్తంగా అంద‌ర్నీ ఆక‌ర్షించాల‌నే ఉత్సాహ‌మే క‌నిపిస్తోంది. అంతేగానీ, ఈ స‌భ నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం, సంద‌ర్భం ఎందుక‌నేది కేసీఆర్ కి త‌ప్ప‌, ఇంకెవ్వ‌రూ మాట్లాడ‌కూడ‌ని టాపిక్ లా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com