రైత‌న్న‌ల‌పై ప్ర‌భుత్వాల వైఖ‌రి ఉండాల్సింది ఇలాగేనా!

ప్ర‌పంచానికి అన్నం పెట్టే రైత‌న్న అంటే ఎందుకింత చిన్న చూపు? ఎందుకు వారి క‌ష్టాల గురించి ప‌ట్టించుకోరు? వారి క‌ష్టంతో నాలుగు మెతుకులు తింటున్న మ‌నం ఎందుకింత ఉదాశీనంగా ఉంటున్నాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పించి, వారి ఇక్క‌ట్లు పార్టీల‌కూ ప‌ట్ట‌వు. ఎన్నిక‌ల‌కు మ‌ధ్య ప్ర‌భుత్వాలు వింత‌వింత ప్ర‌చారాలు చేస్తుంటాయి. అన్న‌దాత ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటే.. అమాయ‌క‌త్వాన్ని న‌టిస్తాయి. అది వారి త‌ప్పే త‌ప్ప త‌మ‌కు సంబంధం లేద‌ని వాదిస్తాయి. 1999-2003 మ‌ధ్య ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రైత‌న్న ఇంట మ‌ర‌ణ మృదంగం మోగుతుంటే.. అది స‌ర్కారు వారికే కాక‌, దాన్ని స‌మ‌ర్థించిన ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు శ్రావ్య‌మైన సంగీతంలా వినిపించాయి. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించిన మాదిరిగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. మాస్ హిస్టీరియా కార‌ణంగా రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆ ప‌త్రిక సూత్రీక‌రించింది. మాన‌సిన నిపుణుల‌తో విశ్లేష‌ణ‌లు రాయించింది. వాస్త‌వ ప‌రిస్థితిని గుర్తించిన ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకున్నారు. రైతు ఇక్క‌ట్లు తీర్చ‌డం మాని మాన‌సిక దౌర్బ‌ల్యం కార‌ణంగానూ.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డే కుటుంబాల‌కు ఇచ్చే ప‌రిహారాన్ని పొందేందుకూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వ‌చ్చిన వార్త‌లు సామాన్యుల గుండెను పిండేశాయి. ఏ రైత‌యినా డ‌బ్బుకోసం శ్ర‌మిస్తాడు త‌ప్ప ప్రాణాలు తీసేసుకోవాలనుకుంటాడా అని ఆక్రోశించారు. కొంత‌కాలం క్రితం తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఇలాంటి అఫిడ‌విట్‌నే హైకోర్టులో దాఖ‌లు చేసింది.

తాజాగా నిన్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో వేసిన స‌మాధానం కూడా ఇలానే ఉంది. ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర రెండునెల‌లుగా ఢిల్లీలో త‌మ స‌మ‌స్య‌లు తీర్చాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర రైతులు ఆందోళ‌న చేస్తుంటే ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం ఇటీవ‌ల దిగొచ్చింది. రైతుల ద‌గ్గ‌ర‌కు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి వెళ్ళి ఓదార్చారు. అది జ‌రిగిన రెండు రోజుల‌కే రాష్ట్రంలో రైతుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లూ లేవ‌ని పేర్కొంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి నివేదించింది. రైత‌న్న‌లపై ఇలాంటి వైఖ‌రి గ‌ర్హ‌నీయం. రైతుల్ని ఆదుకోండి. అప్పుడే మ‌నం నాలుగు మెతుకులు తిన‌గ‌లుగుతామ‌ని, రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయ‌ని ప్ర‌భుత్వాలు ఎప్ప‌టికి తెలుసుకుంటాయో! ఈ అంశాన్ని సుప్రీం తీవ్రంగా ప‌రిగ‌ణించి త‌గిన సూచ‌న‌లు చేయాలి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com