తమిళనాడు రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జయలలిత, కరుణానిధిల హయాం ముగిసిన తర్వాత ఏర్పడిన ఓ రకమైన రాజకీయ శూన్యత ఇప్పుడు భర్తీ అయినట్లుగా కనిపిస్తోంది. విజయ్ సీఎం కావడం.. ఆయన ప్రత్యర్థిగా ఉదయనిధి స్టాలిన్ నిలబడటమే దీనికి కారణం. ఓ వైపు జయలలిత స్థానాన్ని అందుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్.. మరోవైపు కరుణానిధి వారసత్వాన్ని మోస్తూ, ప్రతిపక్ష నేతగా గళమెత్తనున్న ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్ని శాసించనున్నారు.
ఉదయనిధినే విజయ్ ప్రత్యర్థి
విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన 108 సీట్లు కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, అది డీఎంకే కోటపై చేసిన సర్జికల్ స్ట్రైక్. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను విజయ్ తనవైపు తిప్పుకోవడం స్టాలిన్ వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సభలో విజయ్ సర్కార్ను ఎలా ఇబ్బంది పెట్టాలనే వ్యూహాల్లో ఉదయనిధి ఉండగా, విజయ్ మాత్రం పారదర్శక పాలన అంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వ్యక్తిగతం వేరు.. రాజకీయం వేరు. ఆ వేడిని ఇద్దరూ తమిళనాడుకు చూపించనున్నారు. స్టాలిన్ ఇక నేరుగా కాకుండా.. సలహాలకే పరిమితమయ్యి.. ఉదయనిధిని ఎలివేట్ చేయనున్నారు.
అన్నాడీఎంకే కథ కంచికి.. విజయ్ వెంటే అంతా?
తమిళనాడులో ఇప్పుడు అన్నాడీఎంకే పరిస్థితి చీలికలు.. పేలికలు’ అన్నట్టుగా తయారైంది. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఎస్.పి. వేలుమణి వర్గం అసెంబ్లీలో స్పష్టమైన గ్రూపుగా విడిపోయింది. 30 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, ఎడప్పాడి మరోవైపు ఉండటంతో.. అన్నాడీఎంకే ఉనికి దాదాపు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేలోని అసమ్మతి వర్గం విజయ్ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం లేదా కాలక్రమేణా విజయ్ పార్టీలో విలీనమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బలమైన మూడో శక్తి గా ఎదిగిన విజయ్ ముందు, అన్నాడీఎంకే వర్గాలు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
యువ నాయకత్వం.. కొత్త ఆశలు
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఇద్దరు యువ నేతల మధ్య కేంద్రీకృతమయ్యాయి. అన్నాడీఎంకే బలహీనపడటంతో ఇకపై ప్రత్యక్ష పోరు విజయ్ వర్సెస్ ఉదయనిధి గానే సాగనుంది. ఒకరు అధికారంతో తన ఇమేజ్ను సుస్థిరం చేసుకోవాలని చూస్తుంటే, మరొకరు పోరాటంతో తన వారసత్వాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు. స విజయ్ వేసే ప్రతి అడుగుకు ఉదయనిధి ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుందో అని తమిళనాడు ప్రజలే కాదు, దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ద్రవిడ రాజకీయాల చరిత్రలో ఇది అత్యంత కీలకమైన మలుపు అనడంలో సందేహం లేదు.


