టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా ఈరోజు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడలో ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయి విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం క్రిద్నకు వచ్చే 264 గ్రామాలను దత్తత తీసుకొనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. కార్పోరేట్ సంస్థల సామాజిక బాధ్యత అనే పధకం క్రింద వాటిని టాటా సంస్థ దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. దానికోసం టాటా సంస్థ అవసరమయిన ప్రణాళికలు చేసుకొంది. ఆ 264 గ్రామాలను తమ సంస్థ ఏవిధంగా అభివృద్ధి చేయాబోతున్నదీ రతన్ టాటా ముఖ్యమంత్రికి వివరించారు. టాటా సంస్థ ఏకంగా 264 గ్రామాలను దత్తత తీసుకొని వాటిని స్మార్ట్ విలేజీలుగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం చాలా హర్షణీయం. ఈ గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల అభివృద్ధి మొదలయిన పనులను ఈ ప్రాజెక్టులో భాగంగా టాటా సంస్థ చేపట్టుతుంది. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు విభిన్నంగా ఆలోచిస్తూ సరికొత్త మార్గంలోవెళుతున్నారని, కనుక ఏపీ రాజధాని అమరావతి దేశంలో మిగిలిన రాష్ట్రాల రాజధానుల కంటే అద్భుతంగా తయారవుతుందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరుల గురించి ఆయనకు వివరించి పెట్టుబడులు పెట్టమని కోరారు. కానీ ఆయన ఫిషరీస్, ఆక్వా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.