కూటమి ఐక్యత చెడకొట్టే పరిస్థితి లో నేను లేను.. 15 నుంచి 20 ఏళ్ళు ఉండే కూటమి ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి పాలన ఏడాది అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంస పాలన సాగిందని గుర్తు చేశారు. 2014 నుంచి అభివృద్ధి కోరుకుంటున్నాం.. కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం.. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయి.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు.
ఆ ప్రభుత్వం వస్తే ఏంటి అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మరో పదిహేను..ఇరవై ఏళ్లు ఉంటుందని..ఈ ఐక్యతను తాను చెడగొట్టే పరిస్థితుల్లో లేననని స్పష్టం చేశారు. అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించమని హెచ్చరించారు. గొంతులు కోస్తాం అనే నినాదాలకు భయపడేవారెవరూ లేరన్నారు. పనికిమాలిన బెదిరింపులు చేయకండి.. సంస్కారం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నామని గుర్తు చేశారు. అధికారంలో లేకున్నా గత పాలకుల నియంత పోకడలు మారలేదు.. పోలీసులను వెంటాడుతాం అనే స్టేట్మెంట్లు ఇబ్బందిగా ఉన్నాయని..గొంతులు కోస్తాం.. కుత్తుకలు కోస్తాం అంటే ఊరుకునేది లేదన్నారు.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, రావట్లేదు.గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం.అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ సరదాగా ఎవరూ లేరన్నారు. చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాం.. రాజ్యాంగబద్ధంగా ఉన్నాం.. ఉంటామన్నారు.కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు.. పిచ్చి వేషాలు వేస్తే నార తీస్తాం.. గుర్తుపెట్టుకోవాలని సూచించారు.