వైకాపా విమర్శలకి టీడీపీ నేతల కౌంటర్లు..!

ఆంధ్రాలో భాజపా, టీడీపీ మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కూ మాట యుద్ధం కొన‌సాగుతూ వ‌చ్చింది. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీ కేటాయింపులు.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రంపై టీడీపీ నేత‌లూ విమ‌ర్శ‌ల‌కి త‌గ్గ‌డం లేదు, టీడీపీపై ఏపీ భాజ‌పా నేత‌లూ ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు వెన‌కాడ‌టం లేదు. అయితే, ప్ర‌త్యేక హోదా కోసం త‌మ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హోదాను చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టేశారు, అమ్మేశారూ అంటూ వైకాపా నేత‌లు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. దీంతో వీటికి కౌంట‌ర్ గా ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా స్వ‌రం పెంచారు. వైకాపా విమ‌ర్శ‌ల్ని తిప్పి కొడుతున్నారు. ప్ర‌త్యేక హోదాను తాము త్యాగం చేయ‌లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

హోదాలో ఉన్న ప్రయోజ‌నాల‌ను య‌థాత‌థంగా ప్యాకేజీ ద్వారా ఐదేళ్ల‌లో ఇస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ చెప్పార‌ని సోమిరెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగుల‌ను కూడా ఆయ‌న చూపించారు. కేంద్ర ఆర్థిక‌మంత్రే ఇలాంటి ప్ర‌క‌ట‌న చేశారు కాబ‌ట్టి, హోదాకు బ‌దులుగా ప్యాకేజీని ఒప్పుకున్నామ‌న్నారు. అంతేగానీ, హోదాను త్యాగం చేయ‌లేద‌ని మ‌రోసారి చెప్పారు. ఈరోజున తాము కేంద్రాన్ని చేస్తున్న డిమాండ్ కూడా ఇదేన‌నీ, హోదాకు స‌మానంగా ఇస్తామ‌న్నవి ఇవ్వాల‌నే కోరుతున్నామ‌న్నారు. ఈ విష‌యంలో రాజీప‌డే ప్రసక్తే లేదన్నారు. త‌మకు ప‌ద‌వులు ముఖ్యం కాద‌నీ, ఇంత‌కంటే పెద్ద సంఖ్య‌లో ప‌దవుల్ని వ‌దులుకున్న సంద‌ర్భాలూ ఉన్నాయ‌ని సోమిరెడ్డి చెప్పారు. జ‌గ‌న్ ను ఉద్దేశించి మాట్లాడుతూ… కేసుల్లో ఇరుక్కుని సోనియా గాంధీ కాళ్లు ప‌ట్టుకున్నార‌నీ, ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే ద‌మ్ము ఆయ‌న‌కు లేద‌ని సోమిరెడ్డి విమ‌ర్శించారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌద‌రి మాట్లాడితే, ఆయ‌న‌పై ఛైర్మన్ కు వైకాపా ఫిర్యాదు చేసింద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టివ‌ర‌కూ 29 సార్లు ఢిల్లీ వెళ్లి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నిస్తూ వ‌చ్చార‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏనాడైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లొచ్చారా అని ప్ర‌శ్నించారు. ప్రజలువారిని శాస‌నస‌భ‌కు పంపిస్తే, స‌మావేశాలు ఎగ్గొట్టి రోడ్ల‌ మీద తిరుగుతున్నారు అంటూ జ‌గ‌న్ పై మండిప‌డ్డారు. మరో నేత, టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా వైకాపా ఎంపీల రాజీనామా అంశంపై స్పందించారు. వారు రిజైన్ చేసినంత మాత్రాన రాష్ట్రానికి కొత్తగా ఒరిగేది ఏదీ ఉండ‌ద‌న్నారు. ఏప్రిల్ 6న రాజీనామా చేస్తే వెంట‌నే ఉప ఎన్నిక‌లు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌దనీ, అదేదో ఇప్పుడే చేస్తే కొంత ప్ర‌యోజ‌నం ఉండేదేమో అని జేసీ అన్నారు. ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు జగ‌న్ సిద్ధంగా లేర‌నీ జేసీ చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే అంశ‌మై ఫైర్ అయ్యారు. రాజీనామాల పేరుతో జ‌గ‌న్ మ‌రో డ్రామాకు తెర తీశార‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎప్పుడూ తాము వెన‌క్కి త‌గ్గ‌లేద‌నీ, మోడీకి చంద్రబాబు భ‌య‌పడాల్సిన ప‌రిస్థితులు లేనేలేవ‌ని అన్నారు.

మొత్తానికి, నిన్న‌టివ‌ర‌కూ భాజ‌పా వెర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య సాగిన మాట యుద్ధం. ఇప్పుడు అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మొద‌లైంది. ‘ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు వ‌దులుకున్నారు’ అనే పాయింట్ ను వైకాపా బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కౌంట‌ర్ గా హోదాపై తాము వెన‌క‌డుగు వేయ‌లేద‌నీ, త‌త్స‌మాన ప్ర‌యోజనాల కోస‌మే పోరాటం చేస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నంలో టీడీపీ నేత‌లు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.