విజయ్ మాల్యాలాగ జగన్ కూడా పారిపోతారా?

అక్రమాస్తుల కేసులలో ఈడి జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.750 కోట్లు విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసిన తరువాత తెదేపా, వైకాపా నేతల మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది. ఈడి చర్య సహజంగానే తెదేపాకి చాలా ఆనందం కలిగించే విషయమే..దాని వాదనలకి బలం చేకూర్చేదిగా ఉండటంతో తెదేపా నేతలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆయన ఉంటున్న లోటస్ పాండ్ నివాసాన్ని ఈడి అటాచ్ చేసింది కనుక జగన్ ఇష్టపడితే అమరావతిలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కే.ఈ.కృష్ణమూర్తి అన్నారు. ఈడి త్వరలో మరో వెయ్యి కోట్ల ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నాలు చేసి నిరాశ చెందిన జగన్ కి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బేనని అన్నారు.

జగన్ కి అమరావతిలో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పడం ఆయనని హేళన చేయడమేనని అర్ధమవుతూనే ఉంది. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి ఈవిధంగా మాట్లాడటం అవసరమా? ఆలోచించుకోవాలి. అలాగే ఈడి మరో 1,000 కోట్లు అటాచ్ చేయబోతోందని జోస్యం చెప్పడం కూడా సరికాదు. ఆయన ఏ ఆధారంతో ఆవిధంగా చెప్పగలుగుతున్నారు? అని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక ఆయనే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

జగన్, కుటుంబ సభ్యుల పాస్ పోర్టులని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని లేకుంటే ఆయన కూడా విజయ్ మాల్యాలగా విదేశాలకి పారిపోయే అవకాశం ఉందని జూపూడి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయ్ మాల్యాతో జగన్మోహన్ రెడ్డిని ముడిపెట్టడం కూడా చాలా అసంబద్ధంగానే ఉంది. విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద సుమారు 9,000 కోట్లు అప్పులు తీసుకొని వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశ్యం లేకనే గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. కానీ జగన్ ఏ బ్యాంకులకి బాకీలు లేరు. ఒకవేళ ఉన్నా వాటికి తగ్గ ఆస్తులు చాలానే ఉన్నాయి. ఆయనకి చెందిన వందల కోట్ల ఆస్తులే ఈడి అధీనంలో ఉన్నాయి. అటాచ్ చేసుకోవడానికి ఇంకా చాలా విలువైన ఆస్తులు, వ్యాపారాలున్నాయి. పైగా ఎప్పటికైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కనుక విజయ్ మాల్యాలాగ గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకి పారిపోయే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డిని, వైకాపాని వ్యతిరేకించే ప్రజలని ఆకట్టుకోవడం కోసమే తెదేపా నేతలు తెదేపా నేతలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. తెదేపా నేతలు ఈడి వ్యవహారాల గురించి ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిపై ఎదురుదాడి చేయడం కంటే ఆయనని రాజకీయంగా ఎదుర్కొని తమ సత్తా చూపుకొని ఉంటే అందరూ హర్షిస్తారు కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com